ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆర్టీసీలో ప్రవేశపెట్టిన టిక్కెట్ జారీ మిషన్లు మొరాయిస్తున్నాయి. కండక్టర్లు ప్రయాణికులకు టిక్కెట్లు సులువుగా జారీ చేయడానికి ఇచ్చిన మిషన్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దాదాపు 75 శాతం మిషన్లు పనిచేయడం లేదు. రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన మిషన్లు వృథాగా అవుతున్నాయి. ఆర్టీసీ రీజినల్ వ్యాప్తంగా ఆరు డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌లలో డిపోలు ఉన్నాయి. వీటిలో 643 టిక్కె ట్ జారీ మిషన్లు ఉన్నాయి. ఇందులో 604 మాత్రమే అవసరం. ఇంకా 39 మిషన్లు అదనంగా ఉన్నాయి. ఇందులో డ్రైవర్లు టిక్కెట్ ఇచ్చే మిషన్లు(అనలాజీకల్) 99, కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ వినియోగించే మిషన్లు(మైక్రో ఎఫెక్స్) 544 ఉన్నాయి.
సగానికి పైగా చెడిపోయిన టిక్కెట్ జారీ మిషన్లు
2010 సంవత్సరంలో సులువుగా టిక్కెట్స్ జారీ చేయడానికి టిక్కెట్ జారీ మిషన్లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి కొంతకాలం సజావుగా పనిచేశాయి. అనంతరం ఏడాది కూడా పనిచేయలేదు. దాదాపు సగానికిపైగా మిషన్లు మరమ్మతుకు వచ్చా యి. బ్యాటరీలు నాణ్యతగా లేకపోవడం, చార్జింగ్ ఆగకపోవడం, అకస్మాత్తుగా ఆగిపోవడం తదితర కారణాలతో మూలనపడ్డాయి. ఇలా పనిచేయకపోవడంతో కండక్టర్లు పాత పద్ధతిలోనే టిక్కెట్లు జారీ చేస్తున్నారు.
మిషన్ ద్వారా టిక్కెట్ల జారీ సులువుగా ఉండేదని, లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సులకు కండక్టర్లు లేకుండా డ్రైవర్లే మిషన్ల ద్వారా టిక్కెట్ ఇచ్చేవారు. మిషన్లు పనిచేయకపోవడంతో మళ్లీ భారం పడిం దని కండక్టర్లు ఆవేదన చెందుతున్నారు. టిక్కెట్ జారీ మిషన్ ద్వారా ఏ స్టాపులో ఎంత మంది దిగారు.. బస్సులో ఎంత మంది ఉన్నారు.. మొత్తం కలెక్షన్ ఎంత అనేవి సులువుగా తెలిసేవి. కండక్టరుకు ప్రయోజనకరంగా ఉండేది.
దొరకని విడిభాగాలు
మైక్రో ఎఫెక్స్ కంపెనీ నిర్వాహకులు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డీఎం కార్యాలయంలో మిషన్ల మరమ్మతు కోసం ఒక దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. కంపెనీ నిర్వాహకులు ఆర్టీసీలోనే ఒక కార్మికునికి శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ, మరమ్మతు చేసే గది ఎప్పుడు కూడా తాళం వేసి ఉంటుంది. రిపేరింగ్ జరగడం లేదు. టిక్కెట్ జారీ మిషన్ల విడిభాగాలు లభించకపోవడంతో మూలన పడుతున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం.. - వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
జిల్లాలోని టిక్కెట్ జారీ మిషన్‌లు మొరాయిస్తున్న విషయం నాకు తెలిసింది. మిషన్లు మృదువుగా ఉండటంతో వినియోగించక రాక పాడవుతున్నాయి. మరమ్మతుకు వచ్చిన మిషన్ల కోసం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఒక ఎలక్ట్రికల్ సిబ్బందికి రిపేరింగ్‌పై శిక్షణ ఇప్పించాం. ఇబ్బందులు కలుగకుండా చూస్తాం.
ఆర్టీసీలో పనిచేయని టిక్కెట్ జారీ మిషన్లు
Published Mon, Feb 17 2014 2:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement