Viral Video: టికెట్ లేకుండా దొరికాడు.. ఆపై మన్‌కీబాత్‌తో ముంబైనే కదలించాడు!
ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది అంటుంటారు పెద్దలు. అలాగే ముంబై మొత్తాన్ని ఆ ఒక్కడి వీడియో కదిలించింది. ‘టికెట్ లేని ప్రయాణం నేరం’ అనే ఆదేశాలకు తలొగ్గిన ఆ యువకుడు.. తనలాంటి వేలమంది ఆవేదనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ నిలదీశాడు. ఆ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ కావడంతో వేలమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
ముంబై: మహానగరం.. జూన్ చివరివారంలో ఒక రోజు. లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ఆ యువకుడ్ని.. పరేల్ స్టేషన్ వద్ద టీసీ దొరకబట్టాడు. టికెట్ లేదని, పైగా అనుమతి లేకున్నా రైళ్లో ప్రయాణిస్తున్నాడని ఛలానా రాయబోయాడు. ఆ యువకుడు బతిమాలడమో, లేదంటే పారిపోవడమో లాంటి ప్రయత్నాలు చేయలేదు. సరాసరి టీసీ వెంట ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ తనకు విధించిన ఫైన్‌ను కట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు. కానీ, ఆ ఘటనంతా సెల్ఫోన్లో రికార్డ్ చేస్తుండగా.. అధికారులు సైతం అడ్డుచెప్పలేదు.
‘‘ఒకప్పుడు నెలకు 35 వేల రూపాయలు సంపాదించేవాడ్ని. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం పోయింది. ఖర్చులన్నీ పోనూ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 400రూ. చేరింది. ఈ మధ్యే జాబ్ దొరికింది. వెళ్లాలంటే రైలు మార్గం తప్ప నాకు వేరే దిక్కులేదు. కానీ, రెండో రోజే ఇలా టీసీకి దొరికిపోయా. టీసీ సాబ్ తన డ్యూటీ తాను చేశాడు. అలాగే ఫైన్ కట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, లాక్‌డౌన్‌తో నాకంటే దారుణమైన కష్టాలు పడుతున్నవాళ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.
This situation is there with the youth now in Mumbai. Same story can be guessed for me & my fellow DJ's from the Entertainment Industry. The government should look into this very seriously..#LockDown #adityathackeray #mumbailocal @AUThackeray @UdhavThackeray @VijayWadettiwar pic.twitter.com/8pnqtHWPyu
— Omkar Raut (@djomkar) June 27, 2021
ఇప్పుడు రోజూ రైళ్లలో నాలాంటి వందల మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్లే. కానీ, అది సరదా కోసం చేయట్లేదు కదా. కుటుంబాల్ని పోషించుకోవాలనే తాపత్రయంతోనే అలా చేస్తున్నారు. కరోనా.. లాక్డౌన్ ఇక చాలు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే సంపాదించుకోవడానికి అర్హులా? మాలాంటి వాళ్లకు రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వరా? దయచేసి ప్రభుత్వం ఆ నిబంధనల్ని ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు’’ అని మాట్లాడాడు ఆ యువకుడు.
వెల్లువలా మద్దతు
కరోనా కమ్మేసిన మహా నగరం ముంబైలో.. ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ వస్తోంది బీఎంసీ. అయితే లోకల్ ట్రైన్లను నడిపిస్తున్నా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాలేదు. అత్యవసర సర్వీసుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎమర్జెన్సీ కేటగిరీలో చేర్చిన ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో తనలాంటి వేల మంది ప్రైవేట్ ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబిస్తూ ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో సోషల్ మీడియా మొత్తం అతనికి మద్ధతుగా నిలుస్తోంది. ప్రైవేట్ వాహనాలకు రోజూ బోలెడు ఖర్చులు చేస్తున్నామని..భరించలేకపోతున్నామని కొందరు, ప్రభుత్వ ఉద్యోగుల వేళలు మార్చాలని మరికొందరు, గవర్నమెంట్ ఉద్యోగులతో కరోనా వ్యాపించదా?.. అందరికీ అనుమతులు ఇవ్వాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా సాకుతో సామాన్యుడికి లోకల్ రైలులో ప్రయాణాలపై ఆంక్షలు విధించిన అధికార యంత్రాగం.. బస్సు ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు. ఇలా ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్లో చర్చకు దారితీసింది.
పరిష్కారం ఏమిటసలు?
కరోనా మహమ్మారి భయం పూర్తిగా పోని తరుణంలో.. రైలు ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేయడం సరికాదనే అభిప్రాయంలో ఉన్నారు అధికారులు. లోకల్ రైళ్లలో గుంపులుగా ప్రయాణిస్తారు గనుకే ధైర్యం చేయడం లేదని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ చాహల్ వెల్లడించారు. అయితే త్వరలో ఆ ఆంక్షల్ని సడలిస్తామని, ముందుగా మహిళలకు, ఆపై మిగతా సెక్టారలకు ఒక్కో దశలో అనుమతులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: బాప్రే.. మాస్క్ లేకుండా నెలలో లక్షమంది!!