భారతీయులకు యూకే వీసా షాక్
లండన్ : ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువతకు వీసా విషయంలో చుక్కెదురవుతోంది. బుధవారం వెలువడిన ఒక నివేదిక వీసా ఆశావహులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశానికి చెందిన ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు, టీచర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన సుమారు 6,080 మంది భారతీయులకు గత డిసెంబర్ నుంచి యూకే వీసాలను నిరాకరిస్తోంది.
ద క్యాంపెయిన్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఏఎస్ఈ).. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ నుంచి పొందిన గణాంకాల ప్రకారం.. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులకు 57 శాతం వీసాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ వెలుపల నుంచి వీసాలు పొందిన అత్యధిక మంది విదేశీయులు కూడా భారతీయులే. కానీ ప్రస్తుతం ఉన్న యూకే ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల ఎంతో మంది వీసా పొందలేకపోతున్నారు.
ఏడాదికి 20, 700 మంది మాత్రమే..
టైర్ 2 వీసా కేటగిరీలో భాగంగా కంపెనీలు.. ఈయూ వెలుపలి నుంచి ఏడాదికి 20, 700 మంది విదేశీ ఉద్యోగులని మాత్రమే నియమించుకునే అవకాశం ఉంటుంది. పరిమితి అయితే గడిచిన ఆరేళ్లుగా నెలకు 1600 మంది చొప్పున ఉన్న పరిమితిని కేవలం ఒకే ఒక్కసారి పెంచారు. కానీ గతేడాది డిసెంబర్ నుంచి ఈ పరిమితిని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2017- మార్చి 2018 వరకు 6,080 మంది భారతీయ ఉద్యోగులకు వీసా నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ నయోమీ వేర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆమె మాట్లాడుతూ.. ‘సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారత్, యూకేల మధ్య జరిగిన మేధోమదనం, సహాయ సహకారాల వల్ల మేము లాభం పొందామ’ని తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ దెబ్బతిందని వ్యాఖ్యానించారు. ‘నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు వీలుగా వీసా మంజూరును మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని’ తెలిపారు.
వైద్యుల కొరత ఉంది...
బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్(బీఎమ్ఏ) చైర్మన్ డాక్టర్ చాంద్ నాగ్‌పాల్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు. పటిష్టమైన ఇమ్మిగ్రేషన్ విధానం అంటే వైద్యుల కొరత సృష్టించడం కాదని.. ఇలా చేయడం వల్ల జాతీయ ఆరోగ్య వైద్య సేవలకు భంగం కలుగుతోందని వ్యాఖ్యానించారు. టైర్ 2 వీసా కోటాలో ఐదు నెలల సమయం మించిపోయిందని.. సుమారు లక్ష వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని భర్తీ చేయాల్సిందిపోయి నాన్- ఈయూ వర్కర్స్‌పై ఆంక్షలు విధించడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈ రకమైన విధానాల వల్ల రోగుల భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఎన్హెచ్ఎస్ రిక్రూట్ చేసుకున్న 100 మంది వైద్యులకు.. టైర్ 2 వీసా కోటా ముగిసిందనే కారణంతో గత నెలలో వీసా నిరాకరించారు. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను విమర్శించారు.
స్వదేశీయులు కూడా ముఖ్యమే కదా..
వీసా విధానంపై విమర్శలు వెల్లువెత్తడంతో యూకే హోం ఆఫీస్ స్పందించింది. విదేశీ ఉద్యోగుల నియామకం కంటే స్వదేశీయులకు ఉద్యోగుల గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందని తేల్చి చెప్పింది.