Tiffen centre
-
సీతయ్య
మధ్యాన్నమయింది. పొద్దున ముసలమ్మ దగ్గిర నుంచి అడుక్కున్న కానీతో రంగు చూసి మోసపోయి ఆ చక్కెర బిళ్ళలు కొనకపోతే, గుగ్గిళ్ళు కొని తింటే ఇప్పుడింత ఆకలి వెయ్యదుకదా అని పశ్చాత్తాపపడ్డాడు సీతయ్య. మధ్యానం టిఫెన్ కొరకై మామూలు స్థలాలు వెతికాడు. కోమటిరత్నం ఇంటిముందు పుల్లిస్తరాకులు కుక్కలు చప్పగా నాకేశాయి. ఏమీ ఆశలేదు. ఈవాళ దోసకాయలేమీ కుళ్ళినట్లులేవు. దుకాణం దగ్గిర ఒక మేకయినా లేదు. మిఠాయికొట్టు దగ్గిర వచ్చిపోయ్యేవాళ్ళని కనిపెడుతూ ఓ కుక్కపిల్ల కానీ కారప్పూస కొనుక్కున్న కోమటిపిల్ల కాళ్ల చుట్టూ తిరిగింది. పరికిణీ పట్టుకులాగింది. వెంటపరుగెత్తికెళ్ళింది. ఆ కోమటిపిల్ల తంతే దూరానపడి, మళ్ళీ తోకాడించుకుంటూ వెంట పరుగెత్తింది. సందు ములుపులో ఇద్దరూ అదృశ్యమైనారు. ఇదంతా చూశాడు సీతయ్య. తానో కుక్కపిల్లనైనా బాగుండును ఎవరో ఒకరు దయదలచి వుందురు తన మీద. కుయ్యిమని యేడిస్తే తన ఆకలి అబద్ధమనుకోరు. తన మకిలి లాగు పైకి లాక్కుని పట్టుకున్నాడు. బనియను చిల్లుల్లో వేళ్లు పెట్టుకొని రాజకుమారుడి ఠీవితో చూశాడు రోడ్డు వంక. తాను కుక్కనై యే ధనవంతుడి వెంటనో వాడి ఇల్లు చేరుకుంటే వాడు తనని పెంచుకుంటే? ఎవడు పెంచుకుంటాడు? పోనీ తనే ఎవణ్ణో తండ్రిగా పెంచుకుంటే నేం? బస్సు డ్రైవరు ప్రకాశి, తోటి డ్రైవర్లిద్దరూ, కండక్టరు కోటయ్య వెడుతున్నారు. కాఫీ హోటల్ నుంచి, బస్సుస్టాండ్ దగ్గరికి. సీతయ్య వాళ్ళ వెనకనే వెళ్ళి, ప్రకాసి చొక్కా పట్టుకులాగాడు. అతను వెనక్కి తిరిగి, ‘‘ఏం కావాలిరా?’’‘‘నీ కోసమే నాన్నా’’ అందరూ తిరిగి చూశారు. ‘‘నేను కాదురా, మీ నాన్న–బాగా చూడు’’‘‘కాదు. వెళ్ళు, వెళ్ళు’’ అని జేబులోంచి కాని తీసి యిచ్చాడు దయతలచి. అది తీసుకొని వెంటనడిచాడు సీతయ్య, యుముడి వెనకసావిత్రిలాగు.‘‘కానీ యిచ్చానుగా పో’’‘‘ఇప్పుడెక్కడున్నావు నాన్నా’’తక్కిన డ్రైవర్లు అర్థయుక్తంగా కనుగీటులతో ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకుంటున్నారు.‘‘నా వెంట రాకు. పో. యేం? తెలుస్తుందా నే చెప్పేది?’’‘‘సరే నాన్నా!’’‘‘నన్ను నాన్నా అనకు’’‘‘ఎందుకు?’’ప్రకాశి స్నేహితులు నవ్వుతో వొంగిపోతున్నారు.‘‘పోతావా? తన్నులు కావాలా?’’‘‘ఎక్కడికి పోను?’’ అన్నాడు చాలా జాలిగా!‘‘ఇంటికి పో’’‘‘ఇంటికే వస్తున్నా మరి’’‘‘వీణ్ణి తప్పించుకొని పారిపో. అది అన్యాయమైన పనేగాని, యేం చేస్తావు మరి!’’ అన్నాడు కండక్టరు కోటయ్య. ‘‘అన్యాయమేమిటి? అన్యాయమంటే యేమిటి నీ ఉద్దేశ్యం?’’ అన్నాడు ప్రకాసి కోపంగా.‘‘నీకే తెలియాలి, పాపం! నాకేం తెలుసు? మరి చేసినపనికి అనుభవించవద్దూ?’’‘‘ఎన్నాళ్ల కిందట చూశావు మీ నాన్నని?’’ అని అడిగాడు ఒక డ్రైవరు.‘‘నాకు జ్ఞాపకంలేదు. చాలా నెలలయింది’’‘‘అప్పటికి యిప్పటికీ మారాడా, మీ నాన్న?’’‘‘ఒక్కరవ్వ మారలేదు’’‘‘ఒరే నువ్వు పోతావా పోవా?’’ అన్నాడు పళ్ళు కొరుకుతో ప్రకాశి–అని త్వరత్వరగా నడిచాడుఎదురుగా చూస్తూ. ‘‘ఇంకా వస్తున్నాడు’’ అన్నాడు డ్రైవరు. ‘‘చాలా పట్టు వుందిరోయి వీడికి!’’ అన్నాడు కోటయ్య.‘‘వాళ్ళ అమ్మపోలిక అయి వుంటుంది’’ అన్నాడు యింకోడు. ప్రకాశి మాట్లాడకుండా నడిచాడు దబదబా బస్సు దగ్గరకి. తన సీటులో ఎక్కి ఒకసారి తిరిగి చూశాడు. ఎన్నడూ లేనిది త్వరగా ‘స్టార్టు’ చెయ్యాలని చూస్తున్నాడు. సీతయ్య వెనక చక్రాన్ని ఆనుకు నుంచున్నాడు. ఆ మోటరు సొంతదారుఆంజనేయులుగారు కుర్రాణ్ణి చూశారు. ‘‘ఏం కావాలి, నీకు?’’ అన్నాడు.‘‘మా నాన్న కావాలి’’‘‘ఎవరు మీ నాన్న’’‘‘డ్రైవరు ప్రకాశం’’‘‘ఏమోయ్ ప్రకాశీ ఇట్టరా’’రాలేదు.‘‘మీ అబ్బాయి వచ్చాడోయ్, నీకోసం’’‘‘మా అబ్బాయి కాదండి’’‘‘కాదూ ఇక్కడ వుంటేనే. వొచ్చిచూడు’’విధిలేక వచ్చాడు. నవ్వుతున్న కోటయ్యని కాల్చేట్టు చూసి, అటు తిరిగాడు. ‘‘పాపం ఎట్లావున్నాడో చూడు? నీ పిల్లల్ని యిట్లా వుపేక్ష చేయ్యడం ఏమీ బాగాలేదు’’‘‘నాకేం సంబంధం వీడి మొహం నేనెరుగను’’‘‘మీ నాన్న అట్లా అంటున్నాడేం, అబ్బాయి. నువ్వుండు ప్రకాశి–మీ అమ్మ ఎక్కడ వుంది?’’‘‘చచ్చిపోయిందండి. నాన్న తప్ప నా కెవరూ లేరు’’ఆంజనేయులుగారి మనసు కరిగిపోయింది. ‘‘మీ నాన్నతో బెజవాడ వస్తావా?’’ సీతయ్య మొహం వికసించింది. ‘‘కోటయ్యా, ఈ కుర్రాణ్ణెక్కించు. మనవాడు, టిక్కెట్టు, గిక్కెట్టు అక్కర్లేదు. మన ప్రకాశి కొడుకయ్యెను’’‘‘మన వాడేమిటి నాకేం తెలవదంటాడోయ్’’‘‘ఎందుకులే, నేనేం అడగనంటూ వుంటే? ఎవరో అంతర బొంతర వాళ్ళని వూరికే ఎక్కిస్తే కోపమొస్తుందిగాని సొంత కొడుకైనప్పుడు నేనేమంటాను? పాపం–ఆకలిగా వున్నట్టుంది ఏమన్నా కొనిపెట్టు. నీ దగ్గిర డబ్బులు లేవు గావును. ఇదిగో అబ్బాయి, పావలా–కాఫీ హోటల్కుపో–తరువాత ఇద్దురుగానిలే ప్రకాశీ’’కుర్రాడు పావలా తీసుకొని ‘‘నేను వచ్చిందాకా పోకండి’’ అని హోటలు వేపుకు దూకాడు. ‘‘ఈ బస్సులవాళ్ళు–వీళ్ళకి ప్రతివూళ్ళో ఒక భార్య’’ ‘‘ఈయన్ది బెజవాడగా’’ ‘‘ఐతేనేం, ఈ వూళ్ళో ఒక భార్య వుంటుంది’’ ‘‘తన కొడుకునే మరచిపోయినాడు?’’ ‘‘బలేవాడు’’ ‘‘మొహాన అట్టా పోలిక కనబడుతుంటే–పైగా బూకరిస్తాడేమిటి?’’ ‘‘తల్లి పనికొచ్చిందిగాని, పిల్ల పనికి రాలేదు’’కుర్రాడు వొచ్చాడు, పొట్టా, జేబులూ నింపుకుని. ప్రతివాళ్ళూ చోటిచ్చి రమ్మనే వాళ్ళే! బస్సు బయలుదేరింది. కొంచెం సేపట్లో ఆంజనేయులు కేకలు వేస్తున్నాడు. ‘‘ఇదిగో. ప్రకాశం. యేమిటి ‘నీ కుర్రాడు–అరే, కిందపడేట్టున్నాడు–వీడికి భయభక్తులులేవే! ఆ మూట కింద తోశాడు. ఆపు–ఆపు’’‘‘ఇంత అల్లరి యెట్లా నేర్పావయ్యా! మా అందరికీ పిల్లులు లేరూ?’’ అన్నాడు ఒకాయన. ‘‘నేనా!’’ అన్నాడు చివరికి ప్రకాశి. ‘‘మొత్తానికి నీ గుణాలే–ఒక్కటొక్కటే బైటికొస్తున్నాయి. చిన్నప్పుడు మనంచదువుకునేప్పుడునువ్వింతే!’’ అన్నాడు కోటయ్య.‘‘అట్లాచూస్తో నుంచుంటావేం? నీ కుర్రాణ్ణి సద్దుకో మా ప్రాణాలు తీస్తున్నాడు’’ అన్నాడు ఇంకో పెద్ద మనిషి. ఏ లోకంలో వున్నాడో కలో మాయో నిశ్చయించుకోలేని చూపుపెట్టి చక్రం ముందు కూచున్నాడు ప్రకాశి, మధ్య ఊళ్ళో బస్సాగింది. మళ్ళీ కాఫీ హోటల్లోకి అందరూ ప్రవేశించారు.‘‘నాన్నా! ఆకలిగా వుంది’’ అని ప్రకాశి వెంట బైల్దేరాడు కుర్రాడు. ‘‘పోరా వెధవా’’ అని తప్పించుకుని గుంపులో ప్రవేశించాడు ప్రకాశి. బస్సు బయలుదేరాలి, డ్రైవరు లేడు. పిలిచారు. వెతికారు. గంటసేపు చూశారు. కనబడలేదు. ‘‘నాన్నా! నాన్నా’’ అంటూ యేడుస్తున్నాడు కుర్రాడు. కోటయ్య మోటరు నడపవలసి వచ్చింది. ‘‘మరి ఈ కుర్రాణ్ణి యేం చేద్దాం?’’ అన్నాడు కోటయ్య. ప్రకాశి యెంత రౌడీ ఐనా ఇంత నిలబడలేని టక్కరివాడనుకోలేదు. తన సొంత కుర్రాణ్ణి ఇట్లా నడివడిలో వొదిలిపోయినాడే! మరీ ఇంత ఘాతుకుడనుకోలేదు’’ అన్నాడు ఆంజనేయులు. ‘‘కుర్రాడు. యేం చేస్తాం? బెజవాడలో ప్రకాశి దగ్గిర వదలి పెడదాం’’ ‘‘వాడిల్లు నాకు సరిగా తెలీదు’’ అన్నాడు కోటయ్య. ‘‘ఏం చేస్తావు సీతయ్యా!’’‘‘ఏం చెయ్యను?’’ అని బాధత్య వాడికే వదిలివేశాడు. కొంచెం యేడుపు మాని జాలి పుట్టించేట్టు అందరి మొహాలు చూసి, ముడుచుకొని ముసిలమ్మ వొళ్ళో తలపెట్టుకొని నిద్రపోయాడు. ఒక అరగంటలో నిద్రపోయి లేచి ప్రక్కనున్న రెడ్డిగారి బోదకాలు తొక్కి, సీటు నుంచి సీటుకి గంతులు వేస్తున్నాడు. బెజవాడ చేరారు. ఒక్కొక్కళ్ళె దిగిపోతున్నారు. దిగిపోయే వాళ్ళందర్ని ‘‘మీ ఇల్లెక్కడ!’’ అని అమాయకంగా ముద్దొచ్చేట్టు అడుగుతున్నాడు కుర్రాడు. ‘‘మరి కుర్రాడో’’ అన్నాడు కోటయ్య.‘‘ఏంచేస్తాం? రాత్రి ఇక్కడ పడుకొని, రేపు మళ్ళీ ఆ వూరే తీసుకుపోయి దిగపెడదాం’’ అన్నాడు కనికరంగల ఆంజనేయులు. కోటయ్యా, ఆంజనేయులూ, బజారువీధి నుంచి నగరప్పేటవేపు పోతున్నారు. తెలిసినవాణ్ణి పిలవడానికని కోటయ్య వెనక్కు తిరిగిచూసి ‘అరే’ అన్నాడు. కొంచెం దూరంలో నెమ్మదిగా బెజవాడ పురజనుల ఔదార్యమూ, పట్టణ సౌందర్యమూ తీరుబడిగా తిలకిస్తో సీతయ్య వొస్తున్నాడు. ఆంజనేయులు, కోటయ్యా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తన మీద వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధను గమనించి, వాడు–‘‘నాన్నా!’’ అన్నాడు. ‘‘నిన్ను పెంచుకున్నాడోయి, కోటయ్య’’ అన్నాడు ఆంజనేయులు.‘‘మిమ్మల్ని’’ అన్నాడు కోటయ్య. అప్పుడు ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద ఆగి చూస్తున్నారు. కోటయ్య, ఆంజనేయులు త్వరత్వరగా నడిచారు. ‘‘నాన్నా, ఆగు త్వరగా వెడుతున్నావు’’ అని అన్నాడు సీతయ్య.‘‘నేనా సందుకు పోతాను. పనివుంది’’ అన్నాడు కోటయ్య.‘‘అరే, ఆ కుర్రాణ్ణి ఏం చేసుకోమంటావు? పొమ్మని కేకెయ్యి’’‘‘మీ కోసం వొస్తున్నాడు. ఎవరి కోసం సీతయ్యా’’ అన్నాడు దయగా.‘‘నాన్న కావాలి’’ అని ఆంజనేయుల్ని చూపించాడు. ‘‘ఎవరు కావాలి?’’ అన్నాడు భయంగా ఆంజనేయులు.‘‘నువ్వే నాన్నా’’ఆంజనేయులు త్వరత్వరగా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు ఇంటికి.‘‘ఏం లేదు. లోపలికి పద’’‘‘ఆ కుర్రాడెవడు?’’‘‘పాపం, ఎవరో వెర్రికుర్రాడు, మా బస్సు ఎక్కాడు’’‘‘నేను వెర్రివాణ్ణా, నాన్నా! కాను’’‘‘పాపం పిచ్చివాడికి. ప్రకాశి కొడుకునన్నాడు పాపం’’‘‘కాదు. నువ్వు నానాన్న’’‘‘అంతేలే, కనబడ్డ ప్రతీవాణ్ణీ నాన్న నాన్న అంటాడ, అదీ వాడి పిచ్చి. కొంతసేపు కోటయ్యని నాన్నా అన్నాడు’’‘‘లేదు. నన్ననలేదు’’‘‘తరువాత ఈ శేషయ్యగార్ని నాన్న అన్నాడు...మిమ్మల్ని కాదేమిటి? ఆ శెట్టిగారిని’’‘‘గావును’’‘‘సరేలెండి. ప్రకాశిని అన్నాడా లేదా?’’‘‘ప్రకాశి ఏడి ఐతే?’’ అంది కాంతమ్మ. ‘‘వాడు పారిపోయినాడు’’ ‘‘ఆహా, తెలుస్తోంది. ఈ పెద్దమనుష్యులందరూ వీడు ప్రకాశి కొడుకని నాతో చెప్పడానికి వొచ్చారా?’’‘‘అవును’’ అన్నారు అందరూ. కాంతమ్మ రోడ్డువంక చూసింది. కన్నీళ్లతో, గద్గద స్వరంతో, ‘‘ఎంతపని చేశారండీ’’ అంది. ‘‘నేనేమీ యెరగను. కోటయ్యని అడుగు’’‘‘అడగడమెందుకులెండి? మీ కండక్టరేమంటాడు, అంతకంటే?’’‘‘ఈ పెద్దమనుష్యులు చూడలేదూ? వాళ్లనడుగు ఈ కుర్రాడెవరి కోసం వచ్చాడో అసలు’’‘‘వాళ్ళు మాత్రం మీ స్నేహితులు కారూ? ఎందుకులెండి. ఎంత అన్యాయం చేశారండి నన్ను! ఎంత నమ్మాను!’’‘‘ఏంరా! వెధవా, పాపం ఆంజనేయులుగారు నిన్ను అంత దయతో చూసినందుకుఆయనకీ కుంపటి తెచ్చిపెట్టావా?’’ అన్నాడు శేషయ్య. ‘‘దయగా చూశారా?’’ అంది కాంతమ్మ మండిపడుతూ.‘‘సొంత కొడుకు కాదు. మేనల్లుడిమల్లె చూసుకున్నాడు. ఎవర్నీలేంది వీణ్ణి టికట్టులేకుండా బస్సులో ఎక్కించాడు. ఫలహారం పెట్టించాడు. మా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన చూపే ప్రేమ చూసేటప్పటికి’’ఇంత గొప్పగా పొగుడుతున్నా ఆంజనేయులు మొహంమాత్రంమండిపోతుంది. కాంతమ్మ ఇంక భరించలేక చప్పున ఇంట్లోకిపోయి తలుపేసుకుంది. గుంపులో మనుషులంతా ఒకరొకరే జారిపోయినారు. అందరూ పోగానే ఆంజనేయులు ఇంట్లోకి వెళ్ళాడు.ఏడుస్తో కాంతమ్మ పక్కమీద పడుకుంది‘‘ఒసే–మాట’’ ‘‘నాతో మాట్లాడకండి. నా మొహం చూడ్డానికి సిగ్గులేదూ’’‘నా మాట విని ముందు...’’ ‘‘నే ననుకుంటూనే వున్నా, యేదో ఇట్టాంటిది రహస్యంగా జరుగుతుందని–బస్సు అనేది, రాత్రులంతా యెక్కడో వుండిపొయ్యేదీ, ఆ డబ్బు అంతా యేమవుతుంది? మొన్న లైసెన్సుకి అడ్డిగ అమ్ముతానని తీసుకెళ్ళారే? ఇదా సంగతి! యెంతమోసంచేశారండీ? ఎప్పుడూ దిగులుగా కూచోడం–అదీ–తెలిసిపోతుంది–అంతా తెలిసింది’’‘‘విను–ముందు’’ ‘‘వినడమే! ఏమిటి వినడం? ఎందుకు వినడం–మీ అబద్ధాలన్నీ! ఇంకా మోసపోతానా? నేనూరుకోను. చూడండి...ఏం చేస్తానో! ఇంతటితో మీకు నాకు సరి’’‘‘విను–కుర్రాడు ప్రతివాణ్ణి అంటాడు నాన్నా అని, ఈపాటికి ఇంకెవణ్ణో పట్టుకుని వుంటాడు’’‘‘నే నూరుకోను–ఇది వూరంతా’’ అటూ వుండగానే, మెల్లిగా తలుపు తెరుచుకొని మొహం లోపలికి పెట్టి చూస్తున్నాడు సీతయ్య. మండిపడుతో కాంతమ్మ వాడి వేపు చూసింది. ఎవరూ మాట్లాడలేదూ రెండు నిమిషాలు. ‘‘అమ్మా’’ అన్నాడు. తలఎత్తి చూసింది. నిర్ఘాంతపోయి కుర్రాడి మొహం చూస్తో పడుకుంది. తలుపు ఇంకొంచెం తెరుచుకొని లోపలికి వచ్చాడు. ఆంజనేయులు భార్య వైపు చూశాడు. నవ్వాపుకోలేక కిటికీ వైపు తిరిగాడు.‘‘అమ్మా యేం అట్లా పడుకున్నావు?’’‘‘ఎంత పనిచేశావే! నన్ను ఇంత మోసం చేశావనుకోలేదు’’‘‘పోండి. వేళాకోళం చేస్తారు!’’‘‘సందేహం లేదు–పోలిక కనపట్టం లేదనుకున్నావా? పగలంతా లైను మీద చస్తాను. ఇంటి దగ్గర నువు చేసే పని ఇదా? యెప్పుడు కన్నావే వీణ్ణి?’’ అంటో నవ్వాపుకోలేక కిటికీకేసి తిరిగాడు. కాంతమ్మ లేచి అతని మెడ గట్టిగా పట్టుకుంది. ‘‘అంటారు! నన్నట్లా అంటారు?’’‘‘ఏమిటా, దిగులుగా ఆలోచిస్తోకూచుంటుంది అనుకున్నాను. ఎంత ఇచ్చినా చాలదంటుంది. ఏమవుతుందా అనుకున్నాను’’కాంతమ్మ అతని నోరు మూసింది. ‘‘ఏంరా, వేధవా! నేను నీకు అమ్మనట్రా?’’‘అవును. అమ్మవేగా?’’ అని నిశ్చయంగా అన్నాడు. హడలిపోయి చూసింది కుర్రాణ్ణి. చప్పున ఆపుకోలేక ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఆంజనేయులు ఆపుకున్న నవ్వును అంతా నవ్వేశాడు. ఇద్దరూ సీతయ్యనిలాక్కుని కౌగిలించుకున్నారు. - చలం -
కొత్తదనానికి ఉప్మానం
ఉప్మాలో ఏముంటుంది చెప్మా అనుకోవద్దు.ఇవి ఒట్టి ఉప్మాలు కావు. చెమ్చాతో కొంచెం కొంచెం కొరుక్కుతినాలనిపించే కొత్తతరహా పలహారాలు.ఓట్స్, మరమరాలు, అటుకులు... రొటీన్‌గా రవ్వతో కాకుండా కొత్తగా ట్రై చేసిన డిష్‌లు ఇవి.మసాలా ఇడ్లీతో ఉప్మా, దోసె ఉప్మా ఎప్పుడైనా చూశారా?వానలు పడుతున్నాయి.కొంచెం వెరైటీగా పోండి. వేడివేడిగా ఎంజాయ్ చేయండి. ఓట్స్ ఉప్మా కావలసినవి:ఓట్స్ – 2 కప్పులు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూన్; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత అలంకరణ కోసం; కొత్తిమీర – కొద్దిగా తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఓట్స్, పసుపు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించి తీసేయాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ∙అదే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙క్యారట్ తురుము, పచ్చి బఠాణీ జత చేసి రెండు నిమిషాలు వేయించాలి ∙చివరగా ఓట్స్, పంచదార, ఉప్పు వేసి పసుపు జత చేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేగాక, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి ∙బాగా ఉడికిన తరవాత స్టౌ ఆపేసి, బాణలి దింపేసి, కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా అందించాలి. స్పైసీ మసాలా ఇడ్లీ ఉప్మా కావలసినవి:ఇడ్లీలు – 10; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి)గ్రైండ్ చేయడం కోసం పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతఈ పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.పోపు కోసం... ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – తగినంత తయారీ: ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ∙బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙మిక్సీలో మెత్తగా చేసిన మిశ్రమం, పావు కప్పుడు నీళ్లు జత చేసి బాగా కలిపి, రెండు మూడు నిమిషాలు కలపాలి ∙చివరగా ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలిపితే ఇడ్లీ ఉప్మా సిద్ధమైనట్లే ∙కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి. దోసె ఉప్మా కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత పోపు కోసం... నూనె – తగినంత; ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: బియ్యాన్ని సుమారు రెండు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙కొబ్బరి తురుము జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పాత్రలోకి తీసుకోవాలి ∙రెండు కప్పుల నీళ్లలో మిక్సీ జార్‌ను శుభ్రంగా కడిగి, ఆ నీటిని బాణలిలో పోసి, స్టౌ మీద ఉంచి, దగ్గరపడేవరకు కలిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రవ్వ దోస పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక, మిశ్రమాన్ని దోసెగా వేసి రెండువైపులా కాల్చి తీసేయాలి ∙కుకర్‌లో తగినన్ని నీళ్లు, కందిపప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙దోసెలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉడికించిన కంది పప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి ∙నీళ్లు మరుగుతుండగా దోసె ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙దోసె ఉప్మా రెడీ అయినట్లే ∙వేడివేడిగా అందించాలి. బ్రెడ్ ఉప్మా కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 10; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టీ స్పూను; పోపు కోసంఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – ఒక రెమ్మ; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను తయారీ: ముందుగా బ్రెడ్ స్లయిసెస్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బ్రెడ్ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తురుము వరుసగా వేసి వేయించాలి ∙సెనగ పప్పు బంగారు వర్ణంలోకి వచ్చాక ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో తరుగు, మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙టొమాటో ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక, బ్రెడ్ ముక్కలు వేసి అన్నీ కలిసేవరకు జాగ్రత్తగా కలియబెట్టి దింపేసి, వేడివేడిగా అందించాలి. అవలక్కి ఉప్మా కావలసినవి: అటుకులు – 2 కప్పులు; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత పోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను తయారీ: అటుకులను తగినన్ని నీళ్లల్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా ఒంపి, పావు గంటసేపు పక్కన ఉంచాలి వేయించిన సెనగ పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కొబ్బరి తురుము జత చేసి తడిపోయే వరకు వేయించాలి ∙కడిగిన అటుకులను జత చేసి బాగా కలపాలి ∙చివరగా వేయించిన సెనగపప్పు పొడి, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙ఆవకాయ లేదా మాగాయలో నంచుకుని తింటే రుచిగా ఉంటుంది. పోరి ఉప్మా కావలసినవి: మరమరాలు – 5 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పసుపు – చిటికెడు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, మరమరాలు వేసి సుమారు మూడు నిమిషాలు నానబెట్టాక, మరమరాలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి వేయించాక, కొత్తిమీర వేసి కలియబెట్టాలి ∙వేయించిన పల్లీలు, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙మరమరాలు జత చేసి రెండు మూడు నిమిషాలు వేయించి వేడి వేడిగా అందించాలి. (దీనినే మరమరాల ఉప్మా అని కూడా అంటారు). రాగి సేమ్యా ఉప్మా కావలసినవి: రాగి సేమ్యా – పావు కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; నూనె – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: రాగి సేమ్యాను తగినన్ని నీళ్లల్లో సుమారు రెండు మూడు నిమిషాలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, సేమ్యాను ఇడ్లీ ప్లేట్లో ఉంచి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండు మిర్చి వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙చివరగా ఉడికించిన సేమ్యా జత చేసి బాగా కలిపి వేడివవేడిగా అందించాలి. పెరుగు ఉప్మా కావలసినవి: బియ్యం – ఒక కప్పు; కొబ్బరి తురుము – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుల్ల పెరుగు – ముప్పావు కప్పు; సెనగ పప్పు – టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు–అర టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ మిశ్రమం తయారుచేసుకోవాలి (మరీ చిక్కగాను, మరీ పల్చగాను ఉండకూడదు) ∙ఒక గిన్నెలో సెనగ పప్పును రెండు గంటలసేపు నానబెట్టుకొని, బియ్యప్పిండి మిశ్రమంలో కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙మినప్పప్పు, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙బియ్యప్పిండి, పెరుగు మిశ్రమం వేసి బాగా కలపాలి ∙మిశ్రమం ఉప్మాలా విడివిడిలాడే వరకు సుమారు అరగంట సేపు ఉడికించి దించేసుకుని వేడివేడిగా అందించాలి. ఉప్మా.. ఉత్తమం... కాలాలు మారినా, తరాలు మారినా, మానవుని శక్తికి యుక్తికి మూలాధారం ఆహారమే. నాగరికత పరిణామ క్రమంలో ప్రకృతి ప్రసాదించిన అపక్వ (వండని) ఆహార సేవన నుండి, పదార్థాలను కాల్చి, ఉడికించి తినటం, అనంతరం వివిధ ద్రవ్యాలతో పచనం (వండి) చేసి తినటం వరకు మార్పు చోటుచేసుకుంది. అంతవరకు ‘ప్రగతి’గానే భావించవచ్చు. కాని ప్రస్తుతం మితిమీరుతున్న ‘క్షణాల్లో వంటలు, అధిక కాలం నిల్వచేసిన భక్ష్యాలు’ పరిశీలిస్తే అర్ధరహితమైన వ్యాపారకోణం మాత్రమే ప్రస్ఫుటమౌతోంది. పోషక విలువలు లేని, శరీరానికి హానికరమైన ఆహారాలకు, ఆ రుచులకు సమాజం బానిసైపోతోంది. ఈ నేపథ్యంలో సనాతన వంటకాలకు ఆదరణ పెరుగుతోందనేది నిర్వివాదం. విజ్ఞులంతా ఆ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వాటిలో అత్యంత ఉత్తమమైనది ‘ఉప్మా’. రోజులో ప్రధాన ఆహారాన్ని ‘భోజనం’అనీ, ఇతర సమయాల్లో తక్కువ పరిమాణాలలో తినేవాటిని ‘ఉపాహారం లేదా అల్పాహారం’ అనీ పిలుస్తుంటాం. ఉప్మా మనం ఉదయం పూట తినే అల్పాహారాలలో ప్రధానమైనది. దీనికి కారణం అప్పటికప్పుడు సునాయాసంగా తయారుచేసుకోగలగటం. కొంతమంది రాత్రిపూట భోజనానికి బదులు ఉప్మాను ఆస్వాదిస్తారు. దీనిని ‘బోంబే రవ్వ’గా పిలవబడే ‘నూక’ లేదా ‘మొరుము’ తో తయారుచేస్తారు. దీని మూలం గోధుమలు. వాస్తవానికి పాత రోజుట్లో వరి నూక (రవ్వ)తో ఉప్పుడు పిండిని తయారుచేసుకునేవారు. ఈ రెండింటి తయారీలో చాలా సారూప్యత ఉంది. రుచి భేదం కూడా సుస్పష్టం. బొంబాయి రవ్వ ఉప్మా:గోధుమల పై పొట్టు తీసేసి పాలిష్ చేసి మిల్లులో ఆడి రవ్వ తయారుచేస్తారు. (పూర్తిగా మెత్తగా చేస్తే పిండి అంటాం). ఈ రవ్వ అతి సన్నం, కొంచెం పెద్ద సైజులలో రెండు రకాలుగా ఉంటుంది. ఈ పెద్ద సైజునే ‘సెమోలినా’ అంటారు. హిందీలో ‘సూజీ’ అంటారు. తయారీ విధానం: ఇది అందరికీ తెలిసిందే. ముందుగా రవ్వను పొడిగా (తడి తగలకుండా) వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంత పప్పులు, కరివేపాకు, ఆవాలు, మిర్చిలతో కూడిన పోపును తైల సంస్కారంతో (నూనెలో వేయించి) తయారుచేసుకుని, దానిలో కావలసిన నీరు పోసి, మరిగించి, ఈ రవ్వను మెల్లమెల్లగా కలుపుతూ (తగినంత ఉప్పుతో సహా) ఉడికిస్తే ఉప్మా సిద్ధమౌతుంది. చివరి దశలో కొంతమంది ‘నేతిని’ కలుపుతారు. ఇవి ఉప్మాకు కావలసిన ప్రాథమిక ద్రవ్యాలు. అభిరుచిని బట్టి వేగిన పోపులో జీడిపప్పు, వేరుసెనగ పలుకులు కొందరు కలుపుకుంటారు. మరికొందరు వీటికి తోడు రకరకాల కూరముక్కలు (క్యారట్, మటర్, బంగాళదుంప, క్యాబేజీ, బిరియానీ బీన్సు వంటివి) కూడా జత చేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం సాధారణమైపోయింది. కొన్ని ప్రాంతాలలో (ఉత్తర భారతంలో) తయారైన పోపులో వేయించిన రవ్వను కలిపి, అనంతరం మరిగించిన నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతారు. దీనివలన ఉండలు కట్టదు. పోషక విలువలు: రవ్వలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు తగినంతగాను, కొవ్వులు అత్యంత తక్కువగాను ఉంటాయి. పీచు సమృద్ధిగా ఉంటుంది. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింకులు కూడా ఉంటాయి. బి కాంప్లెక్సు విటమిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ – ఇ, సెలీనియం కూడా ఉంటాయి. ఆరోగ్య ఫలితాలు:ఉప్మా చాలా నిదానంగా అరుగుతుంది కనుక వేరే చిరుతిళ్ల మీద ధ్యాస ఉండదు. రక్తహీనతను తగ్గించి, ఎముకల బలాన్ని పెంచి, వ్యాధినిరరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. సుఖవిరేచనం జరుగుతుంది. మూత్రపిండాలకు, గుండెకు కూడా బలకరం. మనం కలుపుకునే జీడిపప్పు లేదా వేరుసెనగ పలుకులు, ఇతర కూరగాయల యొక్క పోషకవిలువ వలన అధిక ప్రయోజనం ఉంటుంది. మితంగా సేవిస్తే బరువును కూడా తగ్గించే గుణం గోధుమకు ఉంది. పిల్లలకైనా, పెద్దలకైనా నీరసాన్ని తగ్గిస్తుంది. ఇతర ద్రవ్యాలతో ఉప్మాలు: వరి రవ్వ (నూక): ఇది అసలైన సనాతన సాంప్రదాయక అల్పాహారం. దీని పేరు ఉప్పుడు పిండి. దీనిలో ఉండే ప్రధాన ప్రత్యేక ఇంగువను పోపులో తగినంత వేస్తారు. స్వచ్ఛమైన నువ్వులనూనెను వాడతారు. ఉప్మాలో మాదిరి ఇతరమైన అధికపదార్థాలను కలపరు. మిగిలిన తయారీ విధానం సమానమే. ఈ నూకను దంపుడు బియ్యం నుండి కూడా తయారుచేస్తారు. వరిలో ఉండే అన్ని పోషకవిలువలూ లభిస్తాయి. ఇంగువ జీర్ణాశయాన్ని శుద్ధి చేసి, ఆకలి పెంచుతుంది. దలియా: ఇది పొట్టు తీయని గోధుమల నుండి తయారయ్యే కొంచెం పెద్ద సైజులో ఉండే రవ్వ. పొటాషియం, విటమిన్ బి 6 సమృద్ధిగా లభిస్తుంది. అటుకులు: వరి ధాన్యం నుండి తయారవుతాయి. సన్నని, దⶠసరి రకాలు లభిస్తాయి. గోధుమలలో ఉండే గ్లూటెన్ దీంట్లో ఉండదు. ఐరన్, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై బలాన్ని సమకూరుస్తుంది. మొక్కజొన్న రవ్వ: ఇది బజారులో లభిస్తుంది. దీని పోషక విలువలను అనుగుణంగా ప్రయోజనం సమకూరుతుంది. కొర్ర బియ్యం: ఇవి చాలా సన్నగా చిన్న పరిమిణంలో ఉంటాయి కనుక దీనిని ర్వగా చేయనవసరం లేదు. ఓ గంటసేపు నీటిలో నానబెట్టిన తరువాత ఆ నీటిని తొలగింఇచ ఉప్మాను తయారుచేసుకోవచ్చు. దీనిలో పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక మధుమేహం ఉన్నవాళ్లకి కూడా చాలామంచిది, బలకరం కూడా. గమనిక: ఓట్సు, సేమ్యాలతో కూడా ఉప్మా చేస్తారు. ఇవి కడుపులో వాయువును వృద్ధి చేస్తాయి. శరీరానికి మైదా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి భారతీయుల ఉప్మాలలో ఇవి అంత శ్రేష్ఠం కావు. తినేటప్పుడు పైన చెప్పిన ఏ రకం ఉప్మా లేక ఉప్పుడుపిండిలోనైనా కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే రుచి పెరుగుతుంది. విటమిన్ ‘సి’ సమకూరుతుంది.గుర్తుంచుకోవలసిన సారాంశం:ఉప్మ చేయుట సులభమ్ము ఉత్తమమ్ముపాత ఉప్పుడుపిండియున్ బలకరమ్ముఅటుకులు దలియ గోధుమల్ పటుతరమ్మెఅన్ని వయసులవారికిన్ ఆప్తబంధు – డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు జై ఉప్మా .. జై సేమ్యా ఉప్మా జనాలు ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ అసలూ ... ఉప్మా ఎంత బావుంటుందో తెల్సా! మండే ఎండల్లో వండివార్చలేని పూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా ఉప్మా అంటే అన్నంపప్పుకూరలు ఇప్పుడేం చేస్తామని బద్ధకించే ప్రాణానికి అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా ఉప్మా అంటే ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడు ఎక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే కూరముక్కలేసినా పొంగిపోక వేయకపోతే కుంగిపోక స్ధితప్రజ్ఞతతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే ఎర్రరవ్వైనా ఏడిపించక తెల్లరవ్వైనా పోజుకొట్టక చిటికెలో తయారై చింత తీర్చేదేరా ఉప్మా అంటే సేమ్యాతో చేస్తే సూపర్ హిట్‌గా బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే మినిమం గ్యారంటీ వున్న ఏకైక డిష్రా ఉప్మా అంటే .. నేతితో చేసినా.. నూనెతో చేసినా రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా చట్నీ లేకపోయినా చింతించక, ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది .. ఊరగాయ అందుబాటులో లేకపోయినా.. నిమ్మచెక్క పిండితే చాలు నోరూరించేలా సిద్ధమైపోతుంది జీడిపప్పు వేయకున్నా ఏమనుకోదు కరివేపాకు వేయకున్నా కలవరపడదు కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి ఘుమఘుమలాడే ఆత్మీయ నేస్తమురా ఉప్మా అంటే ... అకాల క్షుద్బాధకు చెక్ చెబుతూ... సకాలంలో తయారైపోయే డిష్... ఉదయమైనా సాయంత్రమైనా... అర్ధరాత్రైనా .. ఉన్నట్టుండి బంధువులొస్తే... ఉప్మారవ్వ ఉంటే ఇంట్లో కొండంత నిశ్చింత ఉన్నమాట ఒప్పుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు తప్పదు... అందుకే మరి చెప్పేదేంటంటే .,, ఉప్మాని ఆరగిస్తూ వుంటే మీకు అన్నీ ఇట్టే కలిసొచ్చేస్తాయి... (చాలా బాగా టేస్టీగా వచ్చిందన్న ఆనందంతో ) – కాత్యాయని ఇటీవల కొంతకాలంగా వాట్సాప్‌లో వీరవిహారం చేస్తోన్న కొన్నింటికి ఉపమాలంకారమిది. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
వంటరి లక్ష్మి
అవసరం అన్నీ నేర్పిస్తుందని అంటారు. భర్తకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆమెకు సంపాదించవలసిన అవసరం ఏర్పడింది. భర్తకు తోడుగా ఆసుపత్రిలో ఉన్నప్పుడుకాస్త ఎంగిలి పడదామని రోడ్డు మీదకు వెళ్లినప్పుడు బండ్ల మీద ఫుడ్డుకు ఎంత డిమాండ్ ఉందోఆమె గ్రహించింది! అలా.. ఫుడ్డుకు ఉన్న డిమాండ్‌ను తనకు ఉపాధిగా ఆమె మార్చుకుంది. ఇంటావంటా లేని పనేంటని తల్లిదండ్రులు మందలించినా చిన్నబుచ్చుకోకుండాభర్త, అత్తమామల ప్రోత్సాహంతో కుటుంబాన్ని నిలబెట్టుకుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏడాది దాదాపు పది లక్షలు సంపాదిస్తోంది. సెక్టార్ 14.. గుర్గావ్, ఎన్సీఆర్.. మధ్యాహ్నం రెండు గంటలు.. అక్కడున్న చోళే, కుల్చా బండీ చాలా బిజీగా ఉంది. 35 ఏళ్ల ఒకావిడ.. ఇంగ్లిష్‌లో మాట్లాడే వాళ్లకు ఇంగ్లిష్‌లో.. హిందీలో మాట్లాడే వాళ్లకు హిందీలో.. హర్యానీ మాట్లాడేవాళ్లకు హర్యానీ లో మాట్లాడుతూ ఆర్డర్ తీసుకుంటోంది. సింగిల్ హ్యాండ్‌తో యాభై మందికి సర్వ్ చేస్తోంది... చెదరని చిరునవ్వుతో! ఆమె పేరు ఊర్వశి యాదవ్. ఈ బండీ ఎందుకు పెట్టింది? 2016లో ఆమె భర్త అమిత్ యాదవ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ‘ఓరిస్’ ఫెసిలిటీ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఊర్వశి కిడ్స్ స్కూల్లో టీచర్‌గా చేసేది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కొన్నాళ్లదాకా బెడ్రిడెన్గానే ఉంటాడని తేల్చారు డాక్టర్లు. కుటుంబాన్ని పోషించే బాధ్యత అంతా ఆమె మీదే పడింది. పైగా అత్తామామతో కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం. భర్త ఆసుపత్రి బిల్లు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువు .. అన్నిటినీ తనకొచ్చే 13 వేల రూపాయల జీతంతో సర్దడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఒకరోజు.. భర్త ఆసుపత్రిలో ఉన్నప్పుడే మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో ఊర్వశికి బాగా ఆకలైంది. ఆసుపత్రికి దగ్గర్లో ఉన్న ఒక చోళే, కుల్చా బండి దగ్గరకు వెళ్లింది. అక్కడ రద్దీ చూసి నేటివ్ ఫుడ్డుకు ఇంత డిమాండా? అని ఆశ్చర్యపోయింది. ఆ విషయమే బండీ ఓనర్‌నూ అడిగింది. ఆ వ్యాపారం వల్ల వచ్చే లాభం గురించి విని నోరెళ్లబెట్టింది. తన ఆర్థిక బాధ్యతను నెరవేర్చే అద్భుతమైన మార్గం చూపించినందుకు ఆ బండీ ఓనర్‌కు థ్యాంక్స్ చెప్పి వెనుదిరిగింది ఊర్వశి. కొన్ని రోజులకే... భర్త డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. గుర్గావ్లో ఎలాంటి టిఫిన్ సెంటర్స్లేని చోటు వెదుక్కుంది. చోళే, కుల్చా బండీ పెట్టుకోవడానికి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుంది. ఓ చోళే బండీని అద్దెకు తీసుకుంది. 2016, జూన్ 16న.. 25 వేల రూపాయాలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. వారం రోజులు పెద్దగా గిరాకీ లేదు. కాని తర్వాత రోజు నుంచి అంతకంతకు పెరిగిపోసాగింది. ఇప్పుడు యేడాదికి దాదాపు పదిలక్షల రూపాయల దాకా ఆర్జిస్తోంది. రోజు ఎలా మొదలవుతుంది? పొద్దున ఏడింటికల్లా చోళే తయారు చేస్తుంది. తర్వాత గుర్గావ్లోని సదార్ బజార్‌కు వెళ్లి రెడీమేడ్ కుల్చాలు తెచ్చుకుంటుంది. తొమ్మిదిన్నర కల్లా బండీ దగ్గరకు చేరుకుంటుంది. పదింటికల్లా తెరుస్తుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడున్నరదాకా పీక్ అవర్స్. సాయంకాలం నాలుగున్నరకల్లా క్లోజ్ చేసి ఇంటికి బయలుదేరుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చే సరికల్లా ఓ పరవ్న్యాప్ కూడా తీస్తుంది. తర్వాత ఇంటిని, పిల్లలను, అత్తామామనూ చూసుకుంటుంది. ఖర్చులు.. ఆదాయం? చోళేకు కావల్సిన సరుకులు, కుల్చాల కోసం రోజుకు ఆరువందల రూపాయలు వెచ్చిస్తుంది. ఇతర అన్నీ ఖర్చులూ పోనూ మూడు వేల రూపాయల దాకా మిగుల్తుంది. ఇప్పుడు అద్దె బండి తీసేసి సొంత బండీ కొనుక్కుంది. భర్త ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడింది. చోళే, కుల్చా సెంటర్‌కు కావల్సిన సరుకులు తెచ్చిపెడ్తూ తను చేయదగ్గ సహాయం చేస్తున్నాడు. ఆమె ఆదాయంతోనే గుర్గావ్లోని మంచి కాలనీలో మూడుకోట్ల రూపాయల విలువచేసే ఫ్లాట్‌నూ తీసుకుంది. మహేంద్రా ఎస్యూవీ కార్‌నూ కొన్నది. త్వరలోనే ఓ రెస్టారెంట్‌ను స్టార్ట్చేసే ప్రయత్నంలో ఉన్నది. ఎవరో ఏదో అనుకుంటారని.. ఢిల్లీ వాసి అయిన ఊర్వశి యాదవ్ అక్కడే చదువుకుంది. మాంటిస్సోరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసింది. ‘‘ఎంత తక్కువ జీతానికైనా నేను ఒక చోట పనిచేయడాన్నే గౌరవంగా భావించారు నా చుట్టూ ఉన్నవాళ్లు. అంతెందుకు నా తల్లిదండ్రులు కూడా. అంత తక్కువ సంపాదన నా కుటుంబానికి సరిపోక.. నేనిలా ఫుడ్ బిజినెస్ పెడితే చీప్‌గా చూసేవాళ్లే ఎక్కువ. నెలకు దాదాపు ఎనభైవేలు సంపాదిస్తున్నా.. చోళే బండి నడిపిస్తది అని నా వెనకాల కామెంట్ చేసుకుంటారు మా కాలనీ వాళ్లే. మనింటా వంటా లేని పనిచేస్తున్నావని మా అమ్మానాన్న నాతో మాట్లాడ్డమే మానేశారు. నేను అవేవీ పట్టించుకోవడం లేదు. ఈ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఆలోచిస్తున్నాను. నా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి. ఇంకో పదిమందికి ఉపాధి చూపించాలి... అదే నా ముందున్న లక్ష్యం. ఎవరేమనుకున్నా.. ఎంట్రప్రెన్యూర్షిప్లోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఆత్మవిశ్వాసాన్ని మించిన బలంలేదని అర్థం చేసుకున్నా’’ అంటోంది ఊర్వశి యాదవ్. – శరాది -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
ఆత్మకూరు రూరల్: వైఎస్సార్సీపీ కార్యకర్త, ఆత్మకూరు ఎంపీటీసీ మాజీ సభ్యురాలు వాసిపల్లి సుబ్బరత్నమ్మపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..పట్టణంలోని హిల్‌రోడ్ గిరిజనకాలనీకి చెందిన వాసిపల్లి సుబ్బరత్నమ్మ గతంలో ఆత్మకూరు ఎంపీటీసీకి పోటీ చేసి విజేతగా నిలిచింది. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మకూరు 15వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైంది. పదిరోజులుగా ఆమె పట్టణ పరిధిలోని జాలయ్యనగరం సమీపంలో నెల్లూరు-ముంబయి రహదారిపై పంక్చర్ షాపు వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. కుమార్తెకు వివాహం అయిపోవడంతో ఒంటరిగా ఉంటున్న సుబ్బరత్నమ్మ రోజూ రాత్రివేళలో దుకాణం వద్దే నిద్రించేది. ఈ క్రమంలో బుధవారం టీ తాగేందుకు వెళ్లిన గ్రామస్తులు సుబ్బరత్నమ్మ మంచంపై రక్తగాయాలతో పడి ఉం డడం గమనించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టర్‌ను ఆపి విషయం తెలిపారు. అందులోని వారు 108కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై జి.వేణుగోపాల్‌రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బరత్నమ్మను మొదట ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. బండరాయితో మోది ఆమెను హత్యచేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో నివాసం ఉంటున్న పలువురిని స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. బాధితురాలు స్పృహలోకి వస్తే ఘటన ఎలా జరిగిందనే వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.