వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
ఆత్మకూరు రూరల్: వైఎస్సార్‌సీపీ కార్యకర్త, ఆత్మకూరు ఎంపీటీసీ మాజీ సభ్యురాలు వాసిపల్లి సుబ్బరత్నమ్మపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..పట్టణంలోని హిల్‌రోడ్ గిరిజనకాలనీకి చెందిన వాసిపల్లి సుబ్బరత్నమ్మ గతంలో ఆత్మకూరు ఎంపీటీసీకి పోటీ చేసి విజేతగా నిలిచింది. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మకూరు 15వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైంది.
పదిరోజులుగా ఆమె పట్టణ పరిధిలోని జాలయ్యనగరం సమీపంలో నెల్లూరు-ముంబయి రహదారిపై పంక్చర్ షాపు వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. కుమార్తెకు వివాహం అయిపోవడంతో ఒంటరిగా ఉంటున్న సుబ్బరత్నమ్మ రోజూ రాత్రివేళలో దుకాణం వద్దే నిద్రించేది. ఈ క్రమంలో బుధవారం టీ తాగేందుకు వెళ్లిన గ్రామస్తులు సుబ్బరత్నమ్మ మంచంపై రక్తగాయాలతో పడి ఉం డడం గమనించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టర్‌ను ఆపి విషయం తెలిపారు. అందులోని వారు 108కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై జి.వేణుగోపాల్‌రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బరత్నమ్మను మొదట ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. బండరాయితో మోది ఆమెను హత్యచేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో నివాసం ఉంటున్న పలువురిని స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. బాధితురాలు స్పృహలోకి వస్తే ఘటన ఎలా జరిగిందనే వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.