కడతేరిన కామాంధుడు  | Rapist Annam Subbaiah Suicide Death by hanging | Sakshi
Sakshi News home page

కడతేరిన కామాంధుడు 

Published Sat, May 5 2018 4:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Rapist Annam Subbaiah Suicide Death by hanging - Sakshi

చెట్టుకు వేలాడుతున్న సుబ్బయ్య మృతదేహం (పక్కన) ఫైల్‌ ఫోటో

సాక్షి, గుంటూరు/దాచేపల్లి/దైద(గురజాల రూరల్‌)/గురజాల: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దాచేపల్లి అత్యాచార ఘటనలో నిందితుడు అన్నం సుబ్బయ్య శుక్రవారం అనూహ్యంగా శవమై కనిపించాడు. గుంటూరు జిల్లా గురజాల మండలం దైద శ్రీఅమరలింగేశ్వర దేవాలయం పరిధిలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 55 ఏళ్ల వృద్ధుడైన సుబ్బయ్య నాలుగు రోజుల క్రితం దాచేపల్లిలో 9 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి, పరారైన సంగతి తెలిసిందే. అతడిని పట్టుకునేందుకు పోలీసులు దాచేపల్లి గ్రామస్తులతో కలిసి 17 బృందాలుగా ఏర్పడ్డారు. కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా గాలిస్తున్నా నిందితుడి అచూకీ చిక్కలేదు. సుబ్బయ్య చేసిన ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు శుక్రవారం గాలిస్తుండగా, దైద శ్రీఅమరలింగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్‌ లోపల అటవీ ప్రాంతంలో వేపచెట్టుకు ఓ శవం వేలాడుతోందని గొర్రెల కాపరులు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లుంగీతో వేపచెట్టుకు ఉరేసుకున్న  మృతుడి ఫొటోను సెల్‌ఫోన్‌ ద్వారా సుబ్బయ్య బంధువులకు చూపించారు. ఆ మృతదేహం సుబ్బయ్యదేనని నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సుబ్బయ్య మృతదేహాన్ని చూసేందుకు గానీ, అంత్యక్రియలు నిర్వహించేందుకు గానీ బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు గురజాల పంచాయతీ అధికారులకు అప్పగించారు. గురజాల శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య సుబ్బయ్య కుమారుడితో దహన సంస్కారాలు చేయించారు. 
హోం మంత్రి చినరాజప్ప కాన్వాయ్‌కి అడ్డంగా రోడ్డుపై ఆందోళన చేస్తున్న స్థానికులను అడ్డుకుంటున్న పోలీసులు

మృతదేహాన్ని నడిరోడ్డుపై తగలబెట్టాల్సిందే.. 
మానవ మృగం సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ అంతకుముందు మహిళలు, స్థానికులు భారీఎత్తున అద్దంకి–నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మృగాళ్ల దాష్టీకాలకు మరో ఆడపిల్ల బలికాకుండా ఉండాలంటే సుబ్బయ్య మృతదేహాన్ని నడిరోడ్డుపై తగలబెట్టాలని ఆందోళనకారులు భీష్మించుకు కూర్చున్నారు. అదే సమయంలో గురజాల నుంచి వస్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించేవరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలీసులు లాఠీచార్జీ చేసి, ఆందోళనకారులను చెదరగొట్టి చినరాజప్ప కాన్వాయ్‌ని పంపించారు. 

జీజీహెచ్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గుంటూరు జీజీహెచ్‌ గైనకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జీజీహెచ్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఉపముఖ్యమంత్రి వస్తున్నాడనే నెపంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలను పక్కకు లాగి పడేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రోజా నీరసించి పోవడంతో ఆమెకు మంచినీళ్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బాలిక ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకుంటున్న రోజా, వైఎస్సార్‌సీపీ నేతలు 

బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా 
అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించినట్లు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యాచార ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, వీటిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం దాచేపల్లికి వెళ్లి బాధితురాలి బంధువులతో మాట్లాడారు. 

దాచేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత 
మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనపై దాచేపల్లి పట్టణంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్లపైకి చేరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు రెండు రోజులపాటు దాచేపల్లిలోనే మకాం వేశారు. 144 సెక్షన్‌ విధించారు. సున్నితమైన అంశం కావడంలో అందరూ సంయమనం పాటించాలంటూ స్వయంగా మైక్‌ పట్టుకుని జాతీయ రహదారిపై తిరుగుతూ విజ్ఞప్తి చేశారు. నిందితుడు సుబ్బయ్య ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. 

సుబ్బయ్య కుమారుడి నుంచి ప్రాణహాని: బాలిక తండ్రి  
తన తండ్రి చనిపోతే మీ అమ్మాయిని కూడా చంపేస్తానని అన్నం రామసుబ్బయ్య కుమారుడు నరసింహారావు బెదిరించాడని బాధిత బాలిక తండ్రి ఉపముఖ్యమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం వచ్చిన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ మాలకొండయ్యను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన కుమార్తె భవిష్యత్తును సుబ్బయ్య సర్వనాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సుబ్బయ్య కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. భయపడాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని డీజీపీ మాలకొండయ్య బాలిక తండ్రికి హామీ ఇచ్చారు. 

సుబ్బయ్య నా తమ్ముడని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది: లక్ష్మయ్య 
‘‘సుబ్బయ్య నాకు తమ్ముడిగా పుట్టాడని చెప్పుకోవడం సిగ్గుగా వుంది. 15 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవు. సుబ్బయ్యకు ఇద్దరు భార్యలు. ఒక్కొక్కరికి ఇద్దరు బిడ్డలున్నారు. బిడ్డలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే భార్యలను వదిలిపెట్టాడు. మనవరాలి వయసున్న చిన్నారిపై ఆత్యాచారం చేయడం దారుణం. ఆత్మహత్య చేసుకోకుండా పోలీసులకు దొరికినా బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేసేవాళ్లం’’ అని నిందితుడు అన్నం సుబ్బయ్య సోదరుడు లక్ష్మయ్య తెలిపాడు. 

నా పాపం పండింది.. అందుకే పోతున్నా..
సుబ్బయ్య అఖరి మాటలు 
‘‘ఇక లేదులే జీవితం.. చావుకు దగ్గర్లో ఉన్నా. పది మందికి మంచి చెప్పి నేను సరదాగా బతికేవాణ్ని. అనుకోకుండా జరిగింది. ఇక బతకకూడదు. నీకు నా ముఖం చూపెట్టకూడదు. నా ఖర్మ.. పాపం పండింది. అందుకే పోతున్నా. నేను చేసిన పనికి నా కొడుకు పరువు పోయింది. నా కొడుకు ఎట్టా బతుకుతాడో. వాడిని వెన్నపూసలాగా మెత్తగా పెంచుకున్నా. చివరకు వాడికి ఊళ్లో తావులేకుండా చేసి పోతున్నా. రేపు పొద్దునే మీకు అందుబాటులో శవమై కన్పిస్తా’’ 

ఇవీ దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడు అన్నం సుబ్బయ్య అఖరి మాటలు. సుబ్బయ్యతో బంధువు ఫోన్‌లో సంభాషించాడు. ‘తిక్కలోడ.. తిక్కల పని చేసుకోవద్దు. ఎక్కడ ఉన్నావో చెప్పు. నేను వస్తా.. శవమై ఏం చేసుకుంటావు’’ అని మాట్లాడాడు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో తన బంధువుతో సుబ్బయ్య ఈ మాటలు మాట్లాడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ బంధువు ఎవరు? సుబ్బయ్య సామాజికవర్గానికే చెందిన వ్యక్తా లేక ఇతరులా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement