సాక్షి, గుంటూరు, చుండూరు(అమృతలూరు), తెనాలి: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడిని మరిచిపోకముందే గుంటూరు జిల్లా మోదుకూరులో మరో దారుణం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. చుండూరు మండలం మోదుకూరులో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిపై తాపీ పని చేసే షేక్ నాగుల్‌మీరా (25) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 3న మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్లు కొని ఇస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో మిన్నకుండిపోయిన బాలిక రెండుబాలిక రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటం గమనించిన తల్లి ఈ నెల 6న గట్టిగా అడగడంతో జరిగిందంతా చెప్పి విలపించింది. దీంతో బాలిక తల్లి సోమవారం చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రోశయ్య కేసు నమోదు చేసి నిందితుడు నాగుల్ మీరాను అరెస్ట్ చేశారు. తెనాలి డీఎస్పీ స్నేహిత, చుండూరు సీఐ రమేష్‌బాబు సోమవారం మోదుకూరు వచ్చి దర్యాప్తు కొనసాగించారు.
బాలికను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మోదుకూరు టీడీపీ నాయకులు కేసు వాపస్ తీసుకోవాలంటూ బాలిక తల్లిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కేసు వెనక్కి తీసుకుంటే డబ్బు, స్థలం ఇప్పిస్తామంటూ రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. నిందితుడు నాగుల్‌మీరా కుటుంబ సభ్యులతో పోలీసు స్టేషన్‌కు వెళ్లిన మోదుకూరు టీడీపీ నేత, నీటి సంఘం అధ్యక్షుడు కొల్లి శివారెడ్డి రాజీ కుదురుస్తామని, కేసు నమోదు చేయొద్దంటూ పోలీసులపై తీవ్ర స్థాయి ఒత్తిడి తెచ్చారు. కాగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బాలికకు వైద్య పరీక్షలు చేయలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమారి తెలిపారు. బాలికకు.. డీఎంవో, గైనకాలజిస్ట్, ఆర్‌ఎంవో, ఏవో, పిల్లల వైద్యులతో కూడిన బృందం వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, రావి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్‌లు బాలికను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నెల్లూరులో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం
అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరులోని గాంధీ గిరిజన కాలనీలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన బాలిక ఆదివారం మధ్యాహ్నం బహిర్భూమి కోసం రైలు పట్టాల వద్ద చెట్లలోకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ అగంతుకుడు బాలికను వివస్త్రను చేసి లైంగిక దాడి చేయబోయాడు. అదే సమయంలో బహిర్భూమికి వచ్చిన మరో మహిళ ఘటన చూసి కేకలు వేయడంతో కామాంధుడు పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బాలిక స్థానిక దుకాణానికి వెళ్లగా అక్కడ తారసపడిన మృగాడిని చూసి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అతడ్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. నిందితుడిని గూడూరుకు చెందిన బండి శివయ్యగా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో గాంధీ గిరిజన కాలనీలో ఉన్న తన బంధువు పాలకీర్తి దుప్పయ్య ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చినట్లు శివయ్య చెప్పాడు. శివయ్యకు దేహశుద్ధి చేసే సమయంలో స్థానిక రామాలయం వద్ద ఉన్న కొందరు మహిళలు కూడా వచ్చి గత రాత్రి తాము ఆరు బయట నిద్రిస్తుండగా అసభ్యకరంగా ప్రవర్తించాడని, పట్టుకోబోగా పరారయ్యాడని చెప్పి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు.
చిన్నారులపై అకృత్యాల నిరోధంలో ప్రభుత్వ వైఫల్యం
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున
తెనాలి: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నా, వీటిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున విమర్శించారు. చిన్నారులపై లైంగిక దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల గ్రామం మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికను సోమవారం వైద్యపరీక్షల నిమిత్తం తెనాలి తల్లీపిల్లల వైద్యశాలకు తీసుకొచ్చారు. మేరుగ నాగార్జున, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, పార్టీ చుండూరు మండల అధ్యక్షుడు గాదె శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ వుయ్యూరు అప్పిరెడ్డి మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి బాలికను పరామర్శించారు. వైద్యాధికారిణిని కలిసి బాలిక ఆరోగ్యపరిస్థితిని వాకబుచేసి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. అనంతరం మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో చట్టాలు నిర్వీర్యమయ్యాయన్నారు. రాష్ట్ర సాంఘికశాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment