గుంటూరు జిల్లా దాచేపల్లిలో శనివారం రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి తదితరులు
సాక్షి నెట్‌వర్క్: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగికదాడి విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలను అడ్డుకోలేని ప్రభుత్వం వద్దంటూ నినదించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు. రాష్ట్రంలో అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నినదించారు. నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తుండటం వల్లే దుర్మార్గులు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఇటీవల కాలంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలు క్షీణించాయి..
అత్యాచారాల ఘటనలపై ప్రభుత్వ తీరుకు గుంటూరు జిల్లాలో పార్టీ శ్రేణులు ఎండగట్టాయి. మానవ మృగాలను శిక్షించకుండా వారిని కాపాడే ధోరణిపై మండిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శనతో తమ నిరసనను వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలో నిర్వహించన ర్యాలీలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, చిలకలూరిపేటలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, వేమూరులో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన మండిపడ్డారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ కేవీఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి నియోజవర్గంలోని దగదర్తిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దాచేపల్లి ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు.
ప్రభుత్వానికి పతనం తప్పదు..
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని.. వాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తే పతనం తప్పదని వైఎస్సార్ సీపీ శ్రేణులు నినదించాయి. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కడప ఏడురోడ్ల కూడలి వద్ద నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు తిరుపతి, చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లె, సత్యవేడు, నగరి, పీలేరు, కుప్పం, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు.
బాలికలకు రక్షణలేదు..
అధికారం ఇస్తే మహిళలకు రక్షణ కల్పిస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక బాలికలకు కూడా రక్షణలేకుండా పోయిందని ప్రతిపక్షం మండిపడింది. విశాఖపట్నంలోని వేపగుంట వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్‌కే రోజాతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శలను జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాల్గొని ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వారి నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
శనివారం రాత్రి కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు కృష్ణా జిల్లా నేతలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బహిరంగ సభ ముగిసిన అనంతరం జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment