
సాక్షి, అమరావతి: అత్యాచారాలకు పాల్పడితే ఉరికంబం ఎక్కించే వరకు విశ్రమించబోమని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఆడపిల్లల జోలికొస్తే సహించేది లేదన్నారు. దాచేపల్లి ఘటన నిందితుడు సుబ్బయ్య కుటుంబసభ్యులందరూ టీడీపీ వారని చెబుతూ వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అత్యాచార ఘటన బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను శుక్రవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో సీఎం చంద్రబాబుకు వద్దకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా వారితో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. 48 గంటల్లోగా కేసును పరిష్కరించామన్నారు. భయంతోనే నిందితుడు ఉరేసుకున్నాడని చెప్పారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా.. ప్రజల్లో అత్యాచారాలపై అవగాహన కల్పించేలా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపడతామన్నారు. విజయవాడలో జరిగే ప్రదర్శనలో తాను పాల్గొంటానని చెప్పారు. శనివారం తాను గుంటూరు ఆస్పత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శిస్తానని తెలిపారు. కాగా, అత్యాచారం చేసిన వారిని ఉరితీసేలా చట్టాలు తీసుకురావాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ప్రజల్లో సంతృప్తస్థాయిని 90 శాతానికి తీసుకెళ్లాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గత నెల సర్వే ప్రకారం 73 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, దీన్ని 90 శాతానికి పెంచేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ వైద్యసేవపై 88.90 శాతం, జాతీయ ఉచిత డయాలసిస్‌పై 89.50 శాతం, చంద్రన్న బీమాపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
‘ఐఐటీ జేఈఈ’ ఎస్సీ, ఎస్టీ ర్యాంకర్లకు సీఎం అభినందన
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతూ ఐఐటీ–జేఈఈ మెయిన్స్, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించారు. సచివాలయంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 216 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించడం గర్వకారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment