కొత్తదనానికి  ఉప్మానం | Family food special on upma | Sakshi
Sakshi News home page

కొత్తదనానికి  ఉప్మానం

Published Sat, Jul 14 2018 12:57 AM | Last Updated on Sat, Jul 14 2018 12:57 AM

Family food special on upma - Sakshi

ఉప్మాలో ఏముంటుంది చెప్మా అనుకోవద్దు.ఇవి ఒట్టి ఉప్మాలు కావు. చెమ్చాతో కొంచెం కొంచెం కొరుక్కుతినాలనిపించే కొత్తతరహా పలహారాలు.ఓట్స్, మరమరాలు, అటుకులు... రొటీన్‌గా రవ్వతో కాకుండా కొత్తగా ట్రై చేసిన డిష్‌లు ఇవి.మసాలా ఇడ్లీతో ఉప్మా, దోసె ఉప్మా ఎప్పుడైనా చూశారా?వానలు పడుతున్నాయి.కొంచెం వెరైటీగా పోండి.  వేడివేడిగా ఎంజాయ్‌ చేయండి.

ఓట్స్‌  ఉప్మా
కావలసినవి:ఓట్స్‌ – 2 కప్పులు; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూన్‌; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్‌ తురుము – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూన్‌; ఉప్పు – తగినంత
అలంకరణ కోసం;  కొత్తిమీర – కొద్దిగా

తయారీ:  స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఓట్స్, పసుపు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించి తీసేయాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ∙అదే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙క్యారట్‌ తురుము, పచ్చి బఠాణీ జత చేసి రెండు నిమిషాలు వేయించాలి ∙చివరగా ఓట్స్, పంచదార, ఉప్పు వేసి పసుపు జత చేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేగాక, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి ∙బాగా ఉడికిన తరవాత స్టౌ ఆపేసి, బాణలి దింపేసి, కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా అందించాలి.

స్పైసీ మసాలా ఇడ్లీ ఉప్మా
కావలసినవి:ఇడ్లీలు – 10; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి)గ్రైండ్‌ చేయడం కోసం     పుట్నాల పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ధనియాలు – ఒక టేబుల్‌ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతఈ పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.పోపు కోసం... ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – తగినంత

తయారీ:  ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ∙బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙మిక్సీలో మెత్తగా చేసిన మిశ్రమం, పావు కప్పుడు నీళ్లు జత చేసి బాగా కలిపి, రెండు మూడు నిమిషాలు కలపాలి ∙చివరగా ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలిపితే ఇడ్లీ ఉప్మా సిద్ధమైనట్లే ∙కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

దోసె ఉప్మా
కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత
పోపు కోసం... నూనె – తగినంత; ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ: బియ్యాన్ని సుమారు రెండు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙కొబ్బరి తురుము జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పాత్రలోకి తీసుకోవాలి ∙రెండు కప్పుల నీళ్లలో మిక్సీ జార్‌ను శుభ్రంగా కడిగి, ఆ నీటిని బాణలిలో పోసి, స్టౌ మీద ఉంచి, దగ్గరపడేవరకు కలిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రవ్వ దోస పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక, మిశ్రమాన్ని దోసెగా వేసి రెండువైపులా కాల్చి తీసేయాలి ∙కుకర్‌లో తగినన్ని నీళ్లు, కందిపప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙దోసెలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉడికించిన కంది పప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి ∙నీళ్లు మరుగుతుండగా దోసె ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙దోసె ఉప్మా రెడీ అయినట్లే ∙వేడివేడిగా అందించాలి.

బ్రెడ్‌ ఉప్మా
కావలసినవి: బ్రెడ్‌ స్లయిసెస్‌ – 10; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టీ స్పూను; పోపు కోసంఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – ఒక రెమ్మ; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను

తయారీ: ముందుగా బ్రెడ్‌ స్లయిసెస్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బ్రెడ్‌ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తురుము వరుసగా వేసి వేయించాలి ∙సెనగ పప్పు బంగారు వర్ణంలోకి వచ్చాక ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో తరుగు, మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙టొమాటో ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక, బ్రెడ్‌ ముక్కలు వేసి అన్నీ కలిసేవరకు జాగ్రత్తగా కలియబెట్టి దింపేసి, వేడివేడిగా అందించాలి.

అవలక్కి ఉప్మా
కావలసినవి: అటుకులు – 2 కప్పులు; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత
పోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను

తయారీ:  అటుకులను తగినన్ని నీళ్లల్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా ఒంపి, పావు గంటసేపు పక్కన ఉంచాలి  వేయించిన సెనగ పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి  కొబ్బరి తురుము జత చేసి తడిపోయే వరకు వేయించాలి ∙కడిగిన అటుకులను జత చేసి బాగా కలపాలి ∙చివరగా వేయించిన సెనగపప్పు పొడి, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙ఆవకాయ లేదా మాగాయలో నంచుకుని తింటే రుచిగా ఉంటుంది.

పోరి ఉప్మా
కావలసినవి: మరమరాలు – 5 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – చిటికెడు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత
పోపు కోసం ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను

తయారీ:  ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, మరమరాలు వేసి సుమారు మూడు నిమిషాలు నానబెట్టాక, మరమరాలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి వేయించాక, కొత్తిమీర వేసి కలియబెట్టాలి ∙వేయించిన పల్లీలు, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙మరమరాలు జత చేసి రెండు మూడు నిమిషాలు వేయించి వేడి వేడిగా అందించాలి. (దీనినే మరమరాల ఉప్మా అని కూడా అంటారు).

రాగి సేమ్యా ఉప్మా
కావలసినవి: రాగి సేమ్యా – పావు కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; నూనె – తగినంత; ఉప్పు – తగినంత

తయారీ: రాగి సేమ్యాను తగినన్ని నీళ్లల్లో సుమారు రెండు మూడు నిమిషాలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, సేమ్యాను ఇడ్లీ ప్లేట్‌లో ఉంచి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండు మిర్చి వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙చివరగా ఉడికించిన సేమ్యా జత చేసి బాగా కలిపి వేడివవేడిగా అందించాలి.

పెరుగు ఉప్మా
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; కొబ్బరి తురుము – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్‌లు; పుల్ల పెరుగు – ముప్పావు కప్పు; సెనగ పప్పు –  టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – తగినంత
పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూన్‌; మినప్పప్పు–అర టీ స్పూన్‌; కరివేపాకు – రెమ్మ

తయారీ:  బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ మిశ్రమం తయారుచేసుకోవాలి (మరీ చిక్కగాను, మరీ పల్చగాను ఉండకూడదు) ∙ఒక గిన్నెలో సెనగ పప్పును రెండు గంటలసేపు నానబెట్టుకొని, బియ్యప్పిండి మిశ్రమంలో కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙మినప్పప్పు, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙బియ్యప్పిండి, పెరుగు మిశ్రమం వేసి బాగా కలపాలి ∙మిశ్రమం ఉప్మాలా విడివిడిలాడే వరకు సుమారు అరగంట సేపు ఉడికించి దించేసుకుని వేడివేడిగా అందించాలి.

ఉప్మా.. ఉత్తమం...
కాలాలు మారినా, తరాలు మారినా, మానవుని శక్తికి యుక్తికి మూలాధారం ఆహారమే. నాగరికత పరిణామ క్రమంలో ప్రకృతి ప్రసాదించిన అపక్వ (వండని) ఆహార సేవన నుండి, పదార్థాలను కాల్చి, ఉడికించి తినటం, అనంతరం వివిధ ద్రవ్యాలతో పచనం (వండి) చేసి తినటం వరకు మార్పు చోటుచేసుకుంది. అంతవరకు ‘ప్రగతి’గానే భావించవచ్చు. కాని ప్రస్తుతం మితిమీరుతున్న ‘క్షణాల్లో వంటలు, అధిక కాలం నిల్వచేసిన భక్ష్యాలు’ పరిశీలిస్తే అర్ధరహితమైన వ్యాపారకోణం మాత్రమే ప్రస్ఫుటమౌతోంది. పోషక విలువలు లేని, శరీరానికి హానికరమైన ఆహారాలకు, ఆ రుచులకు సమాజం బానిసైపోతోంది. ఈ నేపథ్యంలో సనాతన వంటకాలకు ఆదరణ పెరుగుతోందనేది నిర్వివాదం. విజ్ఞులంతా ఆ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వాటిలో అత్యంత ఉత్తమమైనది ‘ఉప్మా’.
రోజులో ప్రధాన ఆహారాన్ని ‘భోజనం’అనీ, ఇతర సమయాల్లో తక్కువ పరిమాణాలలో తినేవాటిని ‘ఉపాహారం లేదా అల్పాహారం’ అనీ పిలుస్తుంటాం. ఉప్మా మనం ఉదయం పూట తినే అల్పాహారాలలో ప్రధానమైనది. దీనికి కారణం అప్పటికప్పుడు సునాయాసంగా తయారుచేసుకోగలగటం. కొంతమంది రాత్రిపూట భోజనానికి బదులు ఉప్మాను ఆస్వాదిస్తారు. దీనిని ‘బోంబే రవ్వ’గా పిలవబడే ‘నూక’ లేదా ‘మొరుము’ తో తయారుచేస్తారు. దీని మూలం గోధుమలు. వాస్తవానికి పాత రోజుట్లో వరి నూక (రవ్వ)తో ఉప్పుడు పిండిని తయారుచేసుకునేవారు. ఈ రెండింటి తయారీలో చాలా సారూప్యత ఉంది. రుచి భేదం కూడా సుస్పష్టం.

బొంబాయి రవ్వ ఉప్మా:గోధుమల పై పొట్టు తీసేసి పాలిష్‌ చేసి మిల్లులో ఆడి రవ్వ తయారుచేస్తారు. (పూర్తిగా మెత్తగా చేస్తే పిండి అంటాం). ఈ రవ్వ అతి సన్నం, కొంచెం పెద్ద సైజులలో రెండు రకాలుగా ఉంటుంది. ఈ పెద్ద సైజునే ‘సెమోలినా’ అంటారు. హిందీలో ‘సూజీ’ అంటారు.

తయారీ విధానం: ఇది అందరికీ తెలిసిందే. ముందుగా రవ్వను పొడిగా (తడి తగలకుండా) వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంత పప్పులు, కరివేపాకు, ఆవాలు, మిర్చిలతో కూడిన పోపును తైల సంస్కారంతో (నూనెలో వేయించి) తయారుచేసుకుని, దానిలో కావలసిన నీరు పోసి, మరిగించి, ఈ రవ్వను మెల్లమెల్లగా కలుపుతూ (తగినంత ఉప్పుతో సహా) ఉడికిస్తే ఉప్మా సిద్ధమౌతుంది. చివరి దశలో కొంతమంది ‘నేతిని’ కలుపుతారు. ఇవి ఉప్మాకు కావలసిన ప్రాథమిక ద్రవ్యాలు. అభిరుచిని బట్టి వేగిన పోపులో జీడిపప్పు, వేరుసెనగ పలుకులు కొందరు కలుపుకుంటారు. మరికొందరు వీటికి తోడు రకరకాల కూరముక్కలు (క్యారట్, మటర్, బంగాళదుంప, క్యాబేజీ, బిరియానీ బీన్సు వంటివి) కూడా జత చేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం సాధారణమైపోయింది. 
కొన్ని ప్రాంతాలలో (ఉత్తర భారతంలో) తయారైన పోపులో వేయించిన రవ్వను కలిపి, అనంతరం మరిగించిన నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతారు. దీనివలన ఉండలు కట్టదు.

పోషక విలువలు: రవ్వలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు తగినంతగాను, కొవ్వులు అత్యంత తక్కువగాను ఉంటాయి. పీచు సమృద్ధిగా ఉంటుంది. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింకులు కూడా ఉంటాయి. బి కాంప్లెక్సు విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ – ఇ, సెలీనియం కూడా ఉంటాయి.

ఆరోగ్య ఫలితాలు:ఉప్మా చాలా నిదానంగా అరుగుతుంది కనుక వేరే చిరుతిళ్ల మీద ధ్యాస ఉండదు. రక్తహీనతను తగ్గించి, ఎముకల బలాన్ని పెంచి, వ్యాధినిరరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. సుఖవిరేచనం జరుగుతుంది. మూత్రపిండాలకు, గుండెకు కూడా బలకరం. మనం కలుపుకునే జీడిపప్పు లేదా వేరుసెనగ పలుకులు, ఇతర కూరగాయల యొక్క పోషకవిలువ వలన అధిక ప్రయోజనం ఉంటుంది. మితంగా సేవిస్తే బరువును కూడా తగ్గించే గుణం గోధుమకు ఉంది. పిల్లలకైనా, పెద్దలకైనా నీరసాన్ని తగ్గిస్తుంది.

ఇతర ద్రవ్యాలతో ఉప్మాలు: వరి రవ్వ (నూక): ఇది అసలైన సనాతన సాంప్రదాయక అల్పాహారం. దీని పేరు ఉప్పుడు పిండి. దీనిలో ఉండే ప్రధాన ప్రత్యేక ఇంగువను పోపులో తగినంత వేస్తారు. స్వచ్ఛమైన నువ్వులనూనెను వాడతారు. ఉప్మాలో మాదిరి ఇతరమైన అధికపదార్థాలను కలపరు. మిగిలిన తయారీ విధానం సమానమే. ఈ నూకను దంపుడు బియ్యం నుండి కూడా తయారుచేస్తారు. వరిలో ఉండే అన్ని పోషకవిలువలూ లభిస్తాయి. ఇంగువ జీర్ణాశయాన్ని శుద్ధి చేసి, ఆకలి పెంచుతుంది.

దలియా: ఇది పొట్టు తీయని గోధుమల నుండి తయారయ్యే కొంచెం పెద్ద సైజులో ఉండే రవ్వ. పొటాషియం, విటమిన్‌ బి 6 సమృద్ధిగా లభిస్తుంది.
అటుకులు: వరి ధాన్యం నుండి తయారవుతాయి. సన్నని, దⶠసరి రకాలు లభిస్తాయి. గోధుమలలో ఉండే గ్లూటెన్‌ దీంట్లో ఉండదు. ఐరన్, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై బలాన్ని సమకూరుస్తుంది.

మొక్కజొన్న రవ్వ: ఇది బజారులో లభిస్తుంది. దీని పోషక విలువలను అనుగుణంగా ప్రయోజనం సమకూరుతుంది.
కొర్ర బియ్యం: ఇవి చాలా సన్నగా చిన్న పరిమిణంలో ఉంటాయి కనుక దీనిని ర్వగా చేయనవసరం లేదు. ఓ గంటసేపు నీటిలో నానబెట్టిన తరువాత ఆ నీటిని తొలగింఇచ ఉప్మాను తయారుచేసుకోవచ్చు.
దీనిలో పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక మధుమేహం ఉన్నవాళ్లకి కూడా చాలామంచిది, బలకరం కూడా.

మనిక: ఓట్సు, సేమ్యాలతో కూడా ఉప్మా చేస్తారు. ఇవి కడుపులో వాయువును వృద్ధి చేస్తాయి. శరీరానికి మైదా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి భారతీయుల ఉప్మాలలో ఇవి అంత శ్రేష్ఠం కావు. 
తినేటప్పుడు పైన చెప్పిన ఏ రకం ఉప్మా లేక ఉప్పుడుపిండిలోనైనా కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే రుచి పెరుగుతుంది. విటమిన్‌ ‘సి’ సమకూరుతుంది.గుర్తుంచుకోవలసిన సారాంశం:ఉప్మ చేయుట సులభమ్ము ఉత్తమమ్ముపాత ఉప్పుడుపిండియున్‌ బలకరమ్ముఅటుకులు దలియ గోధుమల్‌ పటుతరమ్మెఅన్ని వయసులవారికిన్‌ ఆప్తబంధు
– డాక్టర్‌ వి.ఎల్‌.ఎన్‌. శాస్త్రి, 
ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు

జై ఉప్మా .. జై సేమ్యా ఉప్మా 

జనాలు ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి 
ఏడుస్తుంటారు కానీ అసలూ ... 
ఉప్మా ఎంత బావుంటుందో తెల్సా!

మండే ఎండల్లో వండివార్చలేని పూట 
ఆకలితో మాడకుండా ఆదుకునే 
అమృతమేరా ఉప్మా అంటే

అన్నంపప్పుకూరలు
ఇప్పుడేం చేస్తామని బద్ధకించే ప్రాణానికి
అప్పటికప్పుడు దొరికే 
అన్నపూర్ణేరా ఉప్మా అంటే

ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడు ఎక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే

కూరముక్కలేసినా పొంగిపోక
వేయకపోతే కుంగిపోక
స్ధితప్రజ్ఞతతో మన కడుపులో 
సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే

ఎర్రరవ్వైనా ఏడిపించక
తెల్లరవ్వైనా పోజుకొట్టక
చిటికెలో తయారై 
చింత తీర్చేదేరా ఉప్మా అంటే

సేమ్యాతో చేస్తే సూపర్‌ హిట్‌గా
బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్‌ బస్టర్‌ గా 
నిలిచే మినిమం గ్యారంటీ వున్న 
ఏకైక డిష్‌రా ఉప్మా అంటే ..

నేతితో చేసినా.. నూనెతో చేసినా
రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా
చట్నీ లేకపోయినా చింతించక, 
ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది ..

ఊరగాయ అందుబాటులో లేకపోయినా..
నిమ్మచెక్క పిండితే చాలు 
నోరూరించేలా సిద్ధమైపోతుంది

జీడిపప్పు వేయకున్నా ఏమనుకోదు
కరివేపాకు వేయకున్నా కలవరపడదు
కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి 
ఘుమఘుమలాడే 
ఆత్మీయ నేస్తమురా ఉప్మా అంటే ...

అకాల క్షుద్బాధకు చెక్‌ చెబుతూ... 
సకాలంలో తయారైపోయే డిష్‌... 

ఉదయమైనా సాయంత్రమైనా...
అర్ధరాత్రైనా .. ఉన్నట్టుండి బంధువులొస్తే...
ఉప్మారవ్వ ఉంటే ఇంట్లో కొండంత నిశ్చింత
ఉన్నమాట ఒప్పుకోవాలి 
ఎప్పుడో ఒకప్పుడు తప్పదు... 

అందుకే మరి చెప్పేదేంటంటే .,,
ఉప్మాని ఆరగిస్తూ వుంటే 
మీకు అన్నీ ఇట్టే కలిసొచ్చేస్తాయి...
(చాలా బాగా టేస్టీగా వచ్చిందన్న ఆనందంతో )
– కాత్యాయని
ఇటీవల కొంతకాలంగా వాట్సాప్‌లో వీరవిహారం చేస్తోన్న కొన్నింటికి ఉపమాలంకారమిది.

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌. 
mail: familyvantakalu@gmail.com   పోస్టు ద్వారా పంపండి. 
మా చిరునామా: సాక్షి వంటలు,  సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement