వంటరి లక్ష్మి | How much food is needed on the carts? | Sakshi
Sakshi News home page

వంటరి లక్ష్మి

Published Wed, Apr 4 2018 12:06 AM | Last Updated on Wed, Apr 4 2018 12:06 AM

 How much food is needed on the carts? - Sakshi

అవసరం అన్నీ నేర్పిస్తుందని అంటారు. భర్తకు యాక్సిడెంట్‌ అయినప్పుడు ఆమెకు సంపాదించవలసిన అవసరం ఏర్పడింది. భర్తకు తోడుగా ఆసుపత్రిలో ఉన్నప్పుడుకాస్త ఎంగిలి పడదామని రోడ్డు మీదకు వెళ్లినప్పుడు బండ్ల మీద ఫుడ్డుకు ఎంత డిమాండ్‌ ఉందోఆమె గ్రహించింది!  అలా.. ఫుడ్డుకు ఉన్న డిమాండ్‌ను తనకు ఉపాధిగా ఆమె మార్చుకుంది. ఇంటావంటా లేని పనేంటని తల్లిదండ్రులు మందలించినా చిన్నబుచ్చుకోకుండాభర్త, అత్తమామల ప్రోత్సాహంతో కుటుంబాన్ని నిలబెట్టుకుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏడాది దాదాపు పది లక్షలు సంపాదిస్తోంది.

సెక్టార్‌ 14.. గుర్‌గావ్, ఎన్‌సీఆర్‌.. మధ్యాహ్నం రెండు గంటలు.. అక్కడున్న చోళే, కుల్చా బండీ చాలా బిజీగా ఉంది. 35 ఏళ్ల ఒకావిడ.. ఇంగ్లిష్‌లో మాట్లాడే వాళ్లకు ఇంగ్లిష్‌లో.. హిందీలో మాట్లాడే వాళ్లకు హిందీలో.. హర్యానీ మాట్లాడేవాళ్లకు హర్యానీ లో మాట్లాడుతూ ఆర్డర్‌ తీసుకుంటోంది. సింగిల్‌ హ్యాండ్‌తో యాభై మందికి సర్వ్‌ చేస్తోంది... చెదరని చిరునవ్వుతో! ఆమె పేరు ఊర్వశి యాదవ్‌.

ఈ బండీ ఎందుకు పెట్టింది?
2016లో ఆమె భర్త అమిత్‌ యాదవ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.  ఆయన ‘ఓరిస్‌’ ఫెసిలిటీ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఊర్వశి కిడ్స్‌ స్కూల్లో టీచర్‌గా చేసేది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కొన్నాళ్లదాకా బెడ్‌రిడెన్‌గానే ఉంటాడని తేల్చారు డాక్టర్లు.   కుటుంబాన్ని పోషించే బాధ్యత అంతా ఆమె మీదే పడింది. పైగా అత్తామామతో కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం. భర్త ఆసుపత్రి బిల్లు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువు .. అన్నిటినీ  తనకొచ్చే 13 వేల రూపాయల జీతంతో సర్దడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఒకరోజు.. భర్త ఆసుపత్రిలో ఉన్నప్పుడే మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో ఊర్వశికి బాగా ఆకలైంది. ఆసుపత్రికి దగ్గర్లో ఉన్న ఒక చోళే, కుల్చా బండి దగ్గరకు వెళ్లింది. అక్కడ రద్దీ చూసి నేటివ్‌ ఫుడ్డుకు ఇంత డిమాండా? అని ఆశ్చర్యపోయింది. ఆ విషయమే బండీ ఓనర్‌నూ అడిగింది. ఆ వ్యాపారం వల్ల వచ్చే లాభం గురించి విని నోరెళ్లబెట్టింది. తన ఆర్థిక బాధ్యతను నెరవేర్చే అద్భుతమైన మార్గం చూపించినందుకు ఆ బండీ ఓనర్‌కు థ్యాంక్స్‌ చెప్పి వెనుదిరిగింది ఊర్వశి.

కొన్ని రోజులకే...
భర్త డిశ్చార్జ్‌ అయిన కొన్ని రోజులకు టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసింది. గుర్‌గావ్‌లో ఎలాంటి టిఫిన్‌ సెంటర్స్‌లేని చోటు వెదుక్కుంది. చోళే, కుల్చా బండీ పెట్టుకోవడానికి మున్సిపాలిటీ పర్మిషన్‌ తీసుకుంది. ఓ చోళే బండీని అద్దెకు తీసుకుంది. 2016, జూన్‌ 16న.. 25 వేల రూపాయాలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. వారం రోజులు పెద్దగా గిరాకీ లేదు. కాని తర్వాత రోజు నుంచి అంతకంతకు పెరిగిపోసాగింది. ఇప్పుడు యేడాదికి దాదాపు పదిలక్షల రూపాయల దాకా ఆర్జిస్తోంది. 

రోజు ఎలా మొదలవుతుంది?
పొద్దున ఏడింటికల్లా చోళే తయారు చేస్తుంది. తర్వాత గుర్‌గావ్‌లోని సదార్‌ బజార్‌కు వెళ్లి రెడీమేడ్‌ కుల్చాలు తెచ్చుకుంటుంది. తొమ్మిదిన్నర కల్లా బండీ దగ్గరకు చేరుకుంటుంది. పదింటికల్లా తెరుస్తుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడున్నరదాకా పీక్‌ అవర్స్‌. సాయంకాలం నాలుగున్నరకల్లా క్లోజ్‌ చేసి ఇంటికి బయలుదేరుతుంది. పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికొచ్చే సరికల్లా ఓ పరవ్‌న్యాప్‌ కూడా తీస్తుంది. తర్వాత ఇంటిని, పిల్లలను, అత్తామామనూ చూసుకుంటుంది.

ఖర్చులు.. ఆదాయం?
చోళేకు కావల్సిన సరుకులు, కుల్చాల కోసం రోజుకు ఆరువందల రూపాయలు వెచ్చిస్తుంది.  ఇతర అన్నీ ఖర్చులూ పోనూ మూడు వేల రూపాయల దాకా మిగుల్తుంది. ఇప్పుడు అద్దె బండి తీసేసి సొంత బండీ కొనుక్కుంది.  భర్త ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడింది. చోళే, కుల్చా సెంటర్‌కు కావల్సిన సరుకులు తెచ్చిపెడ్తూ తను చేయదగ్గ సహాయం చేస్తున్నాడు. ఆమె ఆదాయంతోనే గుర్‌గావ్‌లోని మంచి కాలనీలో మూడుకోట్ల రూపాయల విలువచేసే ఫ్లాట్‌నూ తీసుకుంది. మహేంద్రా ఎస్‌యూవీ కార్‌నూ కొన్నది. త్వరలోనే ఓ రెస్టారెంట్‌ను స్టార్ట్‌చేసే ప్రయత్నంలో ఉన్నది. 

ఎవరో ఏదో అనుకుంటారని.. 
ఢిల్లీ వాసి అయిన ఊర్వశి యాదవ్‌ అక్కడే చదువుకుంది. మాంటిస్సోరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసింది. ‘‘ఎంత తక్కువ జీతానికైనా నేను ఒక చోట పనిచేయడాన్నే గౌరవంగా భావించారు నా చుట్టూ ఉన్నవాళ్లు. అంతెందుకు నా తల్లిదండ్రులు కూడా. అంత తక్కువ సంపాదన నా కుటుంబానికి సరిపోక.. నేనిలా ఫుడ్‌ బిజినెస్‌ పెడితే చీప్‌గా చూసేవాళ్లే ఎక్కువ. నెలకు దాదాపు ఎనభైవేలు సంపాదిస్తున్నా.. చోళే బండి నడిపిస్తది అని నా వెనకాల కామెంట్‌ చేసుకుంటారు మా కాలనీ వాళ్లే. మనింటా వంటా లేని పనిచేస్తున్నావని మా అమ్మానాన్న నాతో మాట్లాడ్డమే మానేశారు. నేను అవేవీ పట్టించుకోవడం లేదు. 
ఈ వ్యాపారాన్ని ఎలా డెవలప్‌ చేసుకోవాలో ఆలోచిస్తున్నాను. నా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి. ఇంకో పదిమందికి ఉపాధి చూపించాలి... అదే నా ముందున్న లక్ష్యం. ఎవరేమనుకున్నా.. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఆత్మవిశ్వాసాన్ని మించిన బలంలేదని అర్థం చేసుకున్నా’’ అంటోంది ఊర్వశి యాదవ్‌.
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement