నల్లమలలో చెంచుల వేట!
ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితం మరణ శాసనం కాదా? నల్లమలలో పులుల జనాభాను పెంచి ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమల చెంచులు మన కళ్లముందే కాలగర్భంలోకనుమరుగైపోయేలా చూడటం విచిత్రం. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం మొదలవుతుంది. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో!
ఏనాటిదో నల్లమల! ఆ కొండలు, దట్టమైన అడవుల పుట్టుక ఎప్పటిదో? ఆ లోయల్లో పలువంపులు తిరుగుతూ పరుగులు తీసే కృష్ణవేణమ్మ అక్కడికె ప్పుడు చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా తన ఉనికిని కాపాడుకుంటున్న పెద్దపులి జాతి ఎన్నాళ్లుగా నల్లమలను ఏలుతు న్నదో?... ఎక్కడా దొరకని అరుదైన దివ్యౌషధం సరస్వతి ఆకు (నాగరికులు పెట్టిన పేరు) అక్కడే ఎందుకు దొరుకుతున్నదో? రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మకు నీడనిచ్చిన సరాక అశోకవృక్షం లంకకు ఆవల కేవలం నల్ల మలలోనే ఎందుకు విస్తారంగా కనబడుతున్నదో? మరెక్కడాలేని ఓ బుల్లి రకం (అతి చిన్న జింకజాతి) ‘బుర్రజింక’ ఇక్కడ మాత్రమే ఎందుకు గంతు లేస్తున్నదో? సాలీడు రాకాసి సాలీడుగా, జెర్రిపురుగు రోకలిబండగా, ఉడుత బెట్టుడుతగా భారీగా ఆకారాలు పెంచుకొని ఎందుకలా ఉంటాయో? ఈ అడవిలోని చెట్లతో స్నేహం చేస్తూ, పశుపక్ష్యాదులతో కలియ దిరుగుతూ అనాదిగా సహజీవనం చేస్తున్న ఓ ఆదిమ తెగ ‘చెంచులు’ పేరుతో ఇక్కడెప్పుడు వెలిసిందో?
నల్లమల చెంచులు ఇప్పటికీ ఆహార సేకరణ దశను పూర్తిగా దాటలేదు. ఒక పర్యావరణ చక్రాన్ని నిర్దేశించుకున్న ప్రకృతి సహజ సూత్రాలకు అనుగుణంగానే వారి జీవితం ఉంటుంది. చెట్ల నుంచి రాలిపడే కాయలు, పళ్లను తింటారు. కాలానుగుణంగా దుంపలను తవ్వుకుంటారు. వంట చెరకు కోసం చెట్లను కొట్టరు. ఎండిపోయిన కొమ్మలను, పుల్లలను వినియోగిస్తారు. ఎండిపోయిన పేడను వెలిగిం చుకొనే పాలు కాచుకోవడం ఆచారం. సాధారణంగా ఉడుతలు, ఉడుములు, ఎలుకలు, కుందేళ్లు, పక్షులను వేటాడుతారు. జింకల వేట మాత్రం అరుదు. ఏ రోజు అవసరానికి ఆరోజే వేట. రేపటి కోసం దాచుకొనే అలవాటు చెంచులకు లేదు. వేలయేళ్లుగా ఇదే జీవనశైలితో అటవీ ఆహార చక్రంలో చెంచులు ఇమిడిపోయారు. ఈ చక్రం నుంచి బయటపడి బతకలేని స్థితికి చెంచు జీవితం చేరుకుంది. వ్యవసాయం నేర్పించి వీరిని ఆ చట్రం నుంచి బయటపడేయడానికి గతంలో జరిగిన కొన్ని ప్రయత్నాలు ఏవీ సత్ఫలితాలను ఇవ్వలేదు.
భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్డార్ఫ్ సిఫారసు మేరకు నల్లమల అడవి అంచున మైదాన ప్రాంతాల్లోని లక్ష ఎకరాల భూమిని గుర్తించి చెంచుల వ్యవసాయం కోసం కేటాయిస్తూ నైజాం సర్కార్ 1940వ దశకంలో ఫర్మానా జారీ చేసింది. స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. బ్రిటిష్ పాలకులు కూడా కర్నూలు జిల్లా పెచ్చెరువు ప్రాం తంలో చెంచుల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను, ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు. చెంచులకు ఉపాధి కల్పించడం కోసం వేల సంఖ్యలో టేకు చెట్లను నాటించారనేందుకు ఆధారాలున్నాయి. ఇదంతా ఎందుకంటే చెంచుల పట్ల బ్రిటిష్, నిజాం పాలకులు చూపినపాటి శ్రద్ధ మన ప్రజాప్రభుత్వాలకు లేకపోయిందని చెప్పడానికి. గిరిజనాభివృద్ధి కోసమే ఏర్పాటుచేసిన ఐటీడీఏ ఆచరణలో అటవీ సంపద దోపిడీకి ఉపయోగపడినంతగా గిరిజన జీవితాల్లో మార్పునకు ఉపకరించలేదు. నల్లమలలో ఈ సత్యం మరింత నగ్నంగా కనబడుతుంది. అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ, వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలనీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఆ ప్యాకేజీ ప్రకారం చెంచు పెంటలను(ఆవాసాలను) తరలించే హడావుడి మొదలైంది. మొదటి దశ కింద తరలించాలని ప్రకటించిన పల్లెల్లో మహబూబ్నగర్ జిల్లా లోని వట్వార్లపెల్లి, సార్లపెల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచున బఫర్ జోన్లోనే ఉన్నాయి.
పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న మల్లెల తీర్థానికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుల తరలింపును అమలు చేయడానికి వన్యప్రాణులు ఒక సాకు మాత్రమే అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ. పైగా వందలు, వేలయేళ్లుగా వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ అటవీ సంపదకు రక్షణగా నిలబడిన గిరిజనుల తరలింపువల్ల అటవీ సంపద దోపిడీకి, వన్యప్రాణుల విధ్యంసానికి ఇక ఎదురేముంటుంది? అడవిలోకి నాగరికుల చొరబాటు పెరిగిన దగ్గర్నుంచే అటవీ సంపద తరుగుతోందని చెప్పేందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఐటీడీఏ ఏర్పాటైన తర్వాత గిరిజనుల నుంచి ఈ సంస్థ అటవీ ఉత్పత్తులను సేకరించి, వారికి ప్రతిఫలం ముట్టజెప్పడం ప్రారంభించింది.
క్రమేపీ బినామీ పేర్లతో నాగరి కులు ఈ పనుల్లోకి చొరబడ్డారు. మన్ననూర్ గిరిజన సహకార కేంద్రానికి 2006లో 13 క్వింటాళ్ల నరమామిడి చెక్క అమ్మకానికి వస్తే 2010లో ఒక క్వింటాల్ మాత్రమే వచ్చింది. అరుదైన నరమామిడి చెట్ల నుంచి గిరిజనులైతే చెట్టు మొదలును ముట్టుకోకుండా పైభాగానున్న కొమ్మల నుంచి జాగ్రత్తగా చెక్కను తీస్తారు. మైదాన ప్రాంత బినామీలు డబ్బు కక్కుర్తితో చెట్లను మొద లంటా నరికిపారేసి, నాలుగేళ్లలో ఆ ప్రాంతంలో నరమామిడి చెట్టన్నదే లేకుం డా చేశారు. అడవిలో పెరిగే అడ్డాకు తీగలు చెట్ల మొదళ్లను అల్లుకుంటూ కొమ్మలమీదగా వ్యాపిస్తాయి. విస్తళ్ల తయారీకి ఉపయోగించే ఈ అడ్డాకులను గిరిజనులు ఒడుపుగా చెట్ల పెకైక్కి తీగకు గాయం కాకుండా సేకరిస్తారు. మైదానం నుంచి వచ్చే కిరాయి మనుషులు చెట్లను కూల్చి, తీగల్ని తెంపి మరీ అడ్డాకును సేకరిస్తారు. చెట్టుపైనే పాకానికి వచ్చి, ఎండి రాలిపోయిన కుంకు ళ్లను మాత్రమే గిరిజనులు సేకరిస్తారు. మైదాన వాసులు కొమ్మలను నరికి మరీ కుంకుళ్లను సేకరిస్తారు. వన్యప్రాణుల విషయంలోనూ అంతే. గిరిజను డికి అడవి తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమి స్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? కనుక, ఈ తరలింపు వెనుక ఏదో మతలబు ఉంది.
దేశంలోని వివిధ అరణ్యాల గర్భాన దాగి ఉన్న అపార ఖనిజ సంపదల పైకి బహుళజాతి కంపెనీలు ఎన్నాళ్లుగానో గురిని ఎక్కుపెట్టాయి. యథాశక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సహకరిస్తున్నాయి. నల్లమల అడవుల్లోనూ, కృష్ణాతీరం వెంట అత్యంత విలువైన కింబర్లైట్ రకం వజ్రాల నిక్షేపాలు, బంగారం, విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. నల్ల మల కేంద్రంగా కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ‘డీబీర్స్’ అనే బహుళ జాతి సంస్థ ఖనిజాన్వేషణ పర్మిట్ (ఆర్.పి.) తీసుకుంది. ఏ ప్రాం తంలో ఎంత పరిమాణంలో వజ్రాలు, బంగారం నిక్షేపాలు ఉన్నాయనే అం శంపై ఈ సంస్థ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఇక మైనింగ్ లెసైన్స్లు తీసుకొని వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తవ్విపోసుకోవాలి. కానీ, ఇందుకోసమే అంతరించిపోతున్న అతి పురాతనమైన, అరుదైన చెంచు జాతిని అడవి నుంచి వెళ్లగొట్టారన్న అపవాదు వస్తుందన్న భయంతో ప్రభు త్వాలు కొత్త నాటకాన్ని ప్రారంభించాయి. దీని ప్రకారం ముందుగా వన్య ప్రాణుల రక్షణ పేరిట చెంచులు అడవుల నుంచి బయటకు తరలి పోయేట్టు చేయాలి. అనంతరం గనుల తవ్వకం లెసైన్స్లతో బహుళ జాతి సంస్థలు అడవిలోకి ప్రవేశించాలి.
మన దేశ చరిత్రను ఆర్యుల ఆగమనంతో మొదలుపెట్టి చదువు కోవడం పరిపాటి. కానీ వారి రాకకు వేల ఏళ్లకు ముందు నుంచే ఇక్కడ స్థిరపడ్డ వారు చెంచులు. లక్షల ఏళ్ల క్రితమే ఆఫ్రికా ఖండం నుంచి సాగిన మానవ మహా విస్తరణలో భారతావనిపై స్థిరపడ్డ అతి పురా తన తెగల వారసులు చెంచులు. అందుకు నిదర్శనం వారికి కొన్ని ఆఫ్రికా తెగలతో ఉన్న పోలికలే. ఈ ఆదిమ మానవ జాతి వారసులు మన అరుదైన జాతీయ సంపద. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాల పాలనలోనే వారు మరీ నిర్లక్ష్యానికి గురికావడం పెద్ద విషాదం. వారిప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరారు. ఐటీడీఏ లెక్కల ప్రకారం మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు నాలుగు జిల్లాల్లో కలిసి 40 వేల జనాభా ఉన్నట్టు అధికారిక అంచనా. అయితే ఈ లెక్క తప్పులతడక. వాస్తవానికి చెంచు జనాభా అందులో 60 శాతం కూడా ఉండదు. గతంలో కూడా పునరావాసం పేర అడవి నుంచి చెంచులను బయటకు తరలించారు. వారిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు ప్యాకేజీ పేరిట ఇంటికో పది లక్షల రూపాయలు ఇస్తారు. రేపటికి ఆహారం దాచుకోవడమే తెలియని చెంచు పది లక్షలు దాచుకొని నాగరిక ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తాడు? ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితమంటే మరణ శాసనం కాదా? నల్లమలను పులుల అభయారణ్యాన్ని చేసి, వాటి జనాభాను పెంచి అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థల ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమలలోని దేశంలోనే అతి పురాతన తెగలలో ఒకరైన చెంచులు మన కళ్లముందే క్రమక్రమంగా చరిత్ర కాలగర్భంలోకి కనుమరుగై పోయేలా చూడటమే విచిత్రం. తప్పదు. డాలర్లు, రూపాయల వేటలో వెనుకా ముందూ కానక పరుగులు తీస్తూ మనం అనుసరిస్తున్న అభివృద్ధి మార్గం ఇది. నల్లమల నుంచి చెంచుల నిష్ర్కమణతో పాటే చాపకింది నీరులా బహుళజాతి సంస్థల ప్రవేశం జరగబోతోంది. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను అత్యంత ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం కోసం ఆ పురాతన అరణ్యాలనే అంతరింపజేయవచ్చు. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో!
(muralivardelli@yahoo.co.in)