ఒకప్పుడు సరదా కోసం పులుల్ని వేటాడేవారు. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు పులుల్ని బలి తీసుకున్నాయి. ప్రకృతి సమతుల్యతకి పులులెంత విలువైనవో ఆ తర్వాత మనకి తెలిసి వచి్చంది. 50 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన టైగర్ ప్రాజెక్టు వల్ల పులుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రపంచంలోనే పులుల సంరక్షణ అంశంలో భారత్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకొకసారి అభయారణ్యాలలో పులుల్ని లెక్కించే ప్రక్రియ ఆసక్తికరంగా మారి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది.
మన దేశంలో పులుల సంరక్షణ కోసం 50 ఏళ్ల క్రితమే టైగర్ ప్రాజెక్టు మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకి పులులు ఎంత ముఖ్యమో గ్రహించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. అప్పట్లో దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో పులులు చేరిపోయాయి. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య లక్ష ఉంటే, మన దేశంలో 40 వేలు ఉండేవి.
అలాంటిది 1970 నాటికి పులుల సంఖ్య దాదాపుగా 1,800కు పడిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అభివృద్ధి పేరిట అడవులకి, వన్యప్రాణులకి ఎంత నష్టం జరుగుతోందో గ్రహించి టైగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది. తొలిదశలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లు ఉండేవి. ప్రస్తుతం 75 వేల చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4%) విస్తీర్ణంలో 53కి పైగా టైగర్ రిజర్వులున్నాయి. ప్రపంచంలో మొత్తం పులుల్లో మన దేశంలో 70% ఉన్నాయంటే ఈ టైగర్ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తోంది.
పులులను ఎలా లెక్కిస్తారంటే!
- దేశంలో పులుల సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి గణన చేపట్టినప్పుడు అదో పెద్ద సవాల్‌గా నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో తొలినాళ్లలో అటవీ సిబ్బంది అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వన్యప్రాణులు కనిపిస్తే వాటి గుర్తులతో సహా ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొని లెక్కించేవారు.
- ఆ తర్వాత పగ్ మార్క్ విధానం అమల్లోకి వచ్చింది. పులుల పాద ముద్రలనే వాటిని లెక్కించడానికి వాడేవారు. మనుషుల వేలిముద్రలన్నీ ఎలా ఒక్కలా ఉండవో పులుల పాద ముద్రలు కూడా ఒకేలా ఉండవు. అలా పాదముద్రల్ని బట్టి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేవారు. బటర్ పేపర్‌పై స్కెచ్‌పెన్‌తో పాద ముద్ర ఆకారాన్ని గీస్తారు. గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చేస్తారు. నేలపై ఉన్న ముద్రల మీద చాక్‌పౌడర్ చల్లి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని కలిపేవారు. ఆ మిశ్రమం గడ్డ కట్టి పులి పాదం అచ్చు లభించేది. ఆ పాద ముద్ర ఆధారంగా ఎన్ని పులులు తిరిగాయి, వాటి వయసు వంటివి తెలుసుకునేవారు.
- ఒక దశలో వన్యప్రాణుల గోళ్లు, మలం సేకరించి దాని ఆధారంగా కూడా గణన జరిగేది.
- కొన్నేళ్లు గడిచాక మరో కొత్త విధానాన్ని మొదలు పెట్టారు. పులులు చేతికి చిక్కినప్పుడు వాటిపై ప్రత్యేకమైన ముద్ర వేసేవారు. మళ్లీ వాటిని అడవుల్లో వదిలేసి ఆ తర్వాత లెక్కించే సమయంలో ముద్ర ఉందో లేదో చూసేవారు. ముద్ర లేని పులులు కనిపిస్తే కొత్తగా జాబితాలో వచ్చి చేరేవి.
- గత కొన్నేళ్ల నుంచి అత్యాధునిక కెమెరాలు వినియోగించి పులుల సంఖ్యని గణిస్తున్నారు. ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అధికారులు చెప్పారు. అడవుల్లో ఇరువైపులా ఉన్న చెట్లకు కెమెరాలు ఫిక్స్ చేయడం వల్ల పులులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణుల గురించి కూడా తెలుస్తుంది. ఇక పులుల ఎత్తు, వాటి నడక, వాటి శరీరంపై ఉండే చారల ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు.
గిన్నిస్ రికార్డుల్లోకి పులుల గణన
మన దేశంలో పులుల గణన రికార్డులు తిరగరాసింది. కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డులకెక్కింది. 2018–2019 పులుల గణన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది. 141 ప్రదేశాల్లో 26,838 చోట్ల మోషన్ సెన్సర్లున్న కెమెరాలు అమర్చారు. ఈ ప్రక్రియలో 44 వేల మంది అధికారులు, జీవ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 రాష్ట్రాల్లో రహస్య కెమెరాలు, ఇతర పద్ధతుల్లో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల్ని లెక్కించడం రికార్డు సృష్టించింది.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మోదీ
ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటించారు. పశి్చమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్ జీపులో దాదాపుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. కాకీప్యాంట్, షర్టు, నెత్తిన టోపి ధరించిన ప్రధాని మోదీ బందిపూర్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి రమణీయతను, వన్యప్రాణుల్లో వైవిధ్యాన్ని ఆస్వాదించాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బైనాక్యులర్స్ ద్వారా వన్యప్రాణుల్ని చూస్తూ, కెమెరాలో వాటిని బంధిస్తూ గడిపారు.
గజరాజులతో ఆప్యాయంగా
తర్వాత బందీపూర్ రిజర్వ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో మదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని మోదీ సందర్శించారు. ఏనుగులతో సరదాగా గడిపారు. ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన మావటి దంపతులు బొమ్మన్, బెళ్లిలను సన్మానించారు. వారితో కలిసి ఏనుగులకు చెరుకులు తినిపించారు. వారిని ఢిల్లీకి ఆహా్వనించారు.
బుక్‌లెట్ విడుదల..
పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ కలసికట్టుగా ముందుకు వెళ్లడానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియెన్స్’’ (ఐబీసీఏ) ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో ‘‘అమృత్ కాల్ కా టైగర్ విజన్’’ బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచదేశాలు చేపట్టాల్సిన అతి ముఖ్యమైన అంశమని చెప్పారు. దేశంలో పులుల తాజా గణాంకాలను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ‘‘పులుల సంరక్షణ ద్వారా భారత్ ప్రకృతి సమతుల్యత సాధించింది. ఇది ప్రపంచానికే గర్వకారణం. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. వాటి సంతతిని విజయవంతంగా పెంచుతున్నాం’’ అని చెప్పారు. పులులు, సింహాలు, చిరుతపులులు, మంచు చిరుతలు, ప్యూమా, జాగ్వార్, చీతా వంటి వన్యప్రాణుల్ని సంరక్షించడానికే ఐబీసీఏ ప్రాజెక్టుకు తెర తీసినట్టు చెప్పారు.
Some more glimpses from the Bandipur Tiger Reserve. pic.twitter.com/uL7Aujsx9t
— Narendra Modi (@narendramodi) April 9, 2023
చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్
Comments
Please login to add a commentAdd a comment