టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తిప్పవాసుల దాడి
ఒకరికి బులెట్ గాయం.. ఐదుగురు పోలీసులకు గాయాలు
బిట్రగుంట/కావలి, న్యూస్‌లైన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రచందనం కేసు విచారణలో భాగంగా జువ్వలదిన్నెకు వచ్చిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులపై కప్పరాళ్లతిప్ప వాసులు దాడి చేయడంతో పరిస్థితి కాల్పులకు దారి తీసింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ బృందానికి చెందిన ఎస్సైలు అన్వర్ బాషా, ప్రేమ్ సాగర్ ఎర్రచందనం అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా తమ అదుపులో ఉన్న నిందితుడు బాలరాజు, తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఫారెస్ట్ రేంజర్ కేఎల్ హేమచంద్, నలుగురు కానిస్టేబుళ్లతో మహీంద్రా జైలో వాహనంలో జువ్వలదిన్నెకు చేరుకున్నారు. నిందితుడు బాలరాజు ఇచ్చిన సమాచారం మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధముందని భావిస్తున్న పూర్వ నేరస్థుడైన పీట్ల మహేష్ కోసం ఆరా తీశారు. సెల్‌టవర్ ఇంజనీర్ల వేషంలో స్థానికంగా ఉన్న వోడాఫోన్ సెల్ టవర్ వద్దకాపు కాశారు.
7.15 గంటల ప్రాంతంలో అటుగా వస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ పీట్ల మహేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అతను ప్రతిఘటించాడు. ఈ విషయాన్ని స్థానికులు మహేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహేష్ కుటుంబ సభ్యులు పీట్ల సంపత్, పీట్ల మోజేష్, పీట్ల రవి జువ్వలదిన్నె చేరుకుని దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. సంపత్ కాలికి బులెట్ గాయం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసుల నుంచి ఒక పిస్టల్, 303 రైఫిల్‌ను లాక్కొని వారిని చితకబాదారు. ఎస్సై ప్రేమ్‌సాగర్, ఫారెస్ట్ రేంజర్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు కావడంతో పోలీసులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. కావలి డీఎస్పీ బాలవెంకటేశ్వర్లు, సీఐలు గాయపడిన వారిని 108 వాహనాల్లో కావలికి తరలించారు. పోలీసులు వచ్చిన వాహనం దాడిలో పూర్తిగా ధ్వంసమైంది.