Tipu Sultanbirth anniversary
-
రసాభాసగా టిప్పు జయంతి వేడుకలు
బెంగళూరు: బీజేపీ, ఇతర హిందూ సంస్థల ఆందోళనల నడుమ 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు శనివారం కర్ణాటకలో రసాభాసగా జరిగాయి. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర రాలేదు. సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ముస్లిం వర్గాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. అధికారిక కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలు డుమ్మాకొట్టడంపై ముస్లిం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన పార్టీకి పట్టున్న మైసూరు ప్రాంతంలో ఓటర్లను దూరం చేసుకోకూడదనే సీఎం ఈ కార్యక్రమానికి గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. కానీ టిప్పు గొప్ప పాలకుడని, ఆయన సేవలు కొనియాడుతూ కుమారస్వామి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. టిప్పు మతఛాందసవాది అని పేర్కొన్న బీజేపీ ఆయన జయంతి వేడుకల్ని నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరింది. బెంగళూరు, మంగళూరు, చిక్మగ్లూర్, బళ్లారి, కార్వార్ తదితర ప్రాంతాల్లో నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిప్పు రాజేసిన టిప్పు జయంతి
కర్ణాటకలో ఘర్షణలు.. ఒకరి మృతి ♦ సీఎం వైఫ్యల్యం వల్లే: బీజేపీ ♦ బీజేపీయే వల్లే: సిద్ధ్దరామయ్య సాక్షి, బెంగళూరు: మైసూరు పులి టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో కన్నడ గడ్డపై మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొడుగు జిల్లా మడికేరిలో తిమ్మయ్య సర్కిల్ వద్ద జరిగిన ఇరువర్గాల ఆందోళనలో ఓ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నేత మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మైసూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టిప్పు జయంతిని కన్నడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటాన్ని వ్యతిరేకిస్తూ వీహెచ్పీ కొడగు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. జిల్లాలోని మడికేరిలో వీహెచ్పీ కార్యకర్తలు, ప్రత్యర్థులు ఓ కూడలిలో రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో వీహెచ్పీ కొడగు జిల్లా ముఖ్యకార్యదర్శి కుట్టప్ప(60) మృతిచెందారు. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ.. ‘ఓ గొప్ప వ్యక్తి జయంతిని నిర్వహిస్తుంటే ఓర్వలేకే కొందరు ఆందోళన చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం’ అని అన్నారు. టిప్పు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ఎవరూ అడగలేదని.. కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ప్రభుత్వం దీనికి తెరలేపి వివాదాలకు కారణమైందని మాజీ సీఎం, బీజేపీ నేతయడ్యూరప్ప విమర్శించారు. ‘టిప్పు హిందువు అయ్యుంటే’ టిప్పు హిందువే అయి ఉంటే మహారాష్ట్రలో శివాజీకి ఉన్నంత పేరుప్రఖ్యాతులు వచ్చి ఉండేవని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ అన్నారు. బెంగళూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన టిప్పుజయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘బెంగళూరు నిర్మాణ కర్తగా కెంపేగౌడ అంటే నాకు గౌరవం ఉంది. అయితే ఆయన స్వాతంత్య్రసమరయోధుడు కాదు. దేవనహళ్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కెంపేగౌడ పేరు బదులు టిప్పుపేరు పెట్టడమే సమంజసం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.