ప్రేమ నిరాకరించిందని.. తగలబెట్టి చంపేసిన దుర్మార్గుడు!
ఖమ్మం : మృగాడి దారుణానికి ఓ బాలిక మృత్యువుతో పోరాడి తానువు చాలించింది. ఖమ్మం జిల్లా గార్ల మండలం తిర్లాపురానికి చెందిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1.30 గంటలకు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.... ప్రభుత్వ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల కిరణ్మయిని అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి బాబురావు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అతనిని చాలాసార్లు హెచ్చరించారు.
దసరా సెలవులకు ఇంటికొచ్చిన కిరణ్మయిని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఇంటికి వచ్చి తన ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడు. కిరణ్మయి ససేమిరా అనడంతో ఈ నెల 18న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. బాలిక కేకలు విన్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాలిన శరీరంతో పది రోజులు నరకయాతన అనుభవించిన కిరణ్మయి సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది.
నిందితుడు బాబురావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అంతకు ముందు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలిక మృతితో అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వరంగల్ యాసిడ్ దాడి నిందితులకు విధించిన 'తక్షణ శిక్ష' లాంటివే అన్నిచోట్లా అమలుచేయాలని, అప్పుడే అమ్మాయిలకు ఈ సమాజంలో రక్షణ లభిస్తుందని బాలిక తండ్రి వాపోయారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి సంఘటననే చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక ఓ బాలిక వంటిపై కిరోసిన్ పోసుకుని మృతి చెందింది. దాంతో తల్లిదండ్రులు ఆ బాలికను ఖననం చేశారు. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు జరుపుతున్నారు.