దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు.