Tirupati Revenue Division
-
నిబంధనలకు పాతర.. కబ్జాల జాతర
తిరుపతి రెవెన్యూ డివిజన్లో కబ్జాల పర్వం సాగుతోంది. ప్రభుత్వ, డీకేటీ, పోరంబోకు భూములే లక్ష్యంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 11,785 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జారాయుళ్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 15 మండలాలున్నాయి. ఆయా మండలాల్లో ప్రభుత్వ, కాలువ పోరంబోకు, డీకేటీ, నది పోరంబోకు భూములు 2,48,664 ఎకరాలున్నాయి. ఇందులో సుమారు 23,744 ఎకరాలను గత ప్రభుత్వాలు ఏడు విడతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంపిణీ చేశాయి. మిగిలిన2,24,920 ఎకరాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. కానీ టీడీపీ ఐదేళ్ల పాలనలో ఇందులోని 11,785 ఎకరాలు కబ్జాకు గురైంది. టీడీపీ అధిష్టానం అభివృద్ధి పేరుతో అనుచరులు, బినామీలకు ఉదాసీనంగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆక్రమణలు ఇలా.. తిరుపతి డివిజన్ పరిధిలో సెంటు భూమిలేని నిరుపేదలు సుమారు 30 శాతం మంది ఉన్నారు. ఇందులో ఏడు విడతల్లో 5 శాతం మందికి కూడా ప్రభుత్వ భూమి దక్కలేదు. వేల ఎకరాల భూమి ఖాళీగా ఉన్నా పేదలకు పంచలేదు. ఆందోళనలు చేసినా కనీసం వారి గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు కొందరు భూ మాఫియాగా ఏర్పడ్డారు. ఖాళీజాగా కనిపిస్తే కబ్జాలకు తెగబడ్డారు. వీరికి లంచాలు మరిగిన కొందరు అధికారుల సహకారం ఉండడం కొంత కలిసివచ్చింది. వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకుని విక్రయాలు సాగించారు. కొందరు ఆక్రమిత భూమిలో మామిడి తోటలు, పంటలు పండిస్తున్నారు. మరికొందరు రియల్ దందా పేరుతో పేదలకు అంటగడుతున్నారు. కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. తీరా అవి ప్రభుత్వ భూములని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాజకీయ అండదండలతోనే.. తిరుపతి పరిధిలో భూ మాఫియా రాజకీయ అండదండలతో రెచ్చిపోతోంది. అధికార పార్టీ నాయకులే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అధికారులు సైతం వారికి వంతపాడుతున్నారు. పబ్లిక్‌గా వేల ఎకరాల భూములు కబ్జా చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ మాఫియా అమాయక జనాన్ని మభ్యపెట్టి రోడ్డున పడేస్తోంది. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. –నవీన్‌కుమార్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ పోరాట సమితి కఠిన శిక్ష విధించాలి కబ్జాదారులపై కఠిన చర్యలు ఉండాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అధికారులు ఆదిలోనే ఆక్రమణకు గురైన భూములను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. ఎంతటివారైనా ఉపేక్షించకూడదు. – భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ బోర్డ్ మాజీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర నేత వారే కబ్జాకోరులు తిరుపతి అర్బన్ జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలే కబ్జారాయుళ్లుగా మారుతున్నారు. అధికార అహంతో రెచ్చిపోతున్నారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. జిల్లావ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. దోచుకున్నోడికి దోచుకున్నంత.. చందంగా వీరు వ్యవహరిస్తున్నారు. దీనికితోడు కొందరు అధికారులు లంచాలకు బానిసై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. – కందారపు మురళి, సీఐటీయూ జిల్లా నాయకులు ప్రభుత్వ భూములను రక్షించాలి తిరుపతి రెవెన్యూ డివిజన్లో వేల ఎకరాలు భూములు కబ్జాకు గురయ్యాయి. అధికార పార్టీ అండతో కొందరు రెచ్చిపోయా రు. అడ్డదిడ్డంగా ఆక్రమించేసి విక్రయాలు సాగిస్తున్నారు. వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన బాధ్యత అధి కారులపై ఉంది. ప్రభుత్వ భూముల సమాచారం కోసం డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. – పెంచలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఒక ఎకరా కూడా మిగలదు. కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాలు సైతం కబ్జాకు గురయ్యాయి. దీనికి ప్రధాన కారకులు అధికార పార్టీ నాయకులే. పేదలకు తలదాచుకోవడానికి సెంటు భూమిని ఇవ్వడానికి అధికారులు, అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – వి.లక్ష్మణ్‌రెడ్డి, అధ్యక్షుడు జనచైతన్య వేదిక -
తిరుపతికి సబ్‌కలెక్టర్
ఇమామ్‌సు శుక్లా నియామకం మదనపల్లెకు క్రిటిక భత్రా ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ తిరుపతి మంగళం/మదనపల్లె రూరల్: తిరుపతి రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవో స్థానంలో ఇమామ్‌సు శుక్లాను సబ్‌కలెక్టర్‌గా నియ మిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మదనపల్లె సబ్‌కలెక్టర్ మల్లికార్జునను బదిలీచేసి ఆయన స్థానంలో ఢిల్లీకి చెందిన మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రాను నియమించింది. తిరుపతి నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న నేపధ్యంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్డీవో కేడర్ లేకుండా ఏకంగా సబ్‌కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆర్డీవోగా పనిచేస్తున్న వీరబ్రహ్మయ్యను తిరుపతి నుంచి బదిలీ చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. మదనపల్లెకు క్రిటిక భత్రా మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రా నియమితులయ్యారు. -
97 వేల ఎకరాల గుర్తింపు
25లోపు నివేదిక ఇవ్వాలని గ్రామ కమిటీలకు ఆదేశం నేటి నుంచి కమిటీల పర్యటన తిరుపతి తుడా: తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 97,076 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. జిల్లాలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలి సిందే. ఈ మేరకు తిరుపతి డివిజన్ మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య తూర్పు మండలాల్లో భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా మండలాల తహశీల్దార్లు ప్రభుత్వ భూములను గుర్తించారు.ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లో మొత్తం 97,076 ఎకరాలను గుర్తించి ఆర్డీవో కార్యాలయానికి నివేదికలు పంపించారు. అటవీ భూముల గుర్తింపు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండే అటవీ భూములను అధికారులు గుర్తించారు. అటవీ శాఖ భూములను డీనోటిఫై చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉండే అటవీ భూములను గుర్తించారు. ఏర్పేడులో 958.28 ఎకరాలు, శ్రీకాళహస్తిలో 3999.66 ఎకరాలు, సత్యవేడులో 11,331.47 ఎకరాలను గుర్తించారు. అదేవిధంగా 55,714.94 ఎకరాల ప్రభుత్వ భూములు( చెరువులు, కుంటలు, వాగులు, వివిధ రకాల భూములు) గుర్తించారు. ఏర్పేడులో 784.56 ఎకరాలు, శ్రీకాళహస్తిలో 35,119.62 ఎకరాలు, సత్యవేడులో 19,810.76 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. అయితే నీరు నిల్వ ఉండే చెరువులు, వాగులు, కుంటలను కాకుండా మిగిలిన ప్రభుత్వ భూములను మాత్రమే గుర్తించాలని మళ్లీ ఆయా మండల అధికారులకు ఆదేశించారు. ఈ మూడు మండలాల్లో 25,072.03 ఎకరాల డీకేటీ భూములు ఉన్నాయని తేల్చారు. ఏర్పేడులో 7,043.34, శ్రీకాళహస్తిలో 15,019.66, సత్యవేడులో 3,009.03 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక అందజేశారు. 25వ తేదీ కల్లా భూముల వివరాల నివేదిక గ్రామ స్థాయిలో ప్రభుత్వ, డీకేటీ, అటవీ భూములను మరింత స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను వేశారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాలతో పాటు అదనంగా మరో మూడు మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఎన్ కండ్రిగ, కేవీబీ పురం, చంద్రగిరి మండలాల్లో ప్రభుత్వ, డీకేటీ, అటవీ భూములను గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామస్థాయి కమిటీలు శనివారం నుంచి భూములను గుర్తించనున్నాయి. ఈ నెల 28న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఈలోపు భూములను గుర్తించి నివేదికను సమర్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25 లోపు గ్రామ స్థాయిలో ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములను గర్తించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.