సందడే సందడి
సినిమా సమష్టి కృషి అన్న విషయం తెలిసిందే. ఒక్క చిత్రం ప్రారంభమైందంటే దానికి సంబంధించిన కనీసం వంద కుటుంబాలకు కొంత కాలం జీవనోపాధి లభించినట్లే. అలాంటిది ఒకే రోజు ఒకటికి మించిన చిత్రాలు ప్రారంభం అయితే పరిశ్రమ వర్గాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. బుధవారం అలాంటి సంఘటనే జరిగింది. ఏకంగా మూడు చిత్రాలు పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. అందులో ప్రముఖ నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్న తానా సేర్న్ద కూటం ఒకటి. ఎస్ 3 చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య తాజాగా తానా సేర్న్ద కూటమి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన సరసన నటి కీర్తీసురేశ్ నటించనున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్నారు.
నానుమ్ రౌడీదాన్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్శి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం మహాబలిపురం సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.నటుడు పూర్తిగా కొత్తగా కనిపించనున్న ఈ చిత్ర షూటింగ్ ఇదే నెల తొమ్మిదో తేదీ నుంచి జరుగనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా నటుడు సత్యరాజ్ సమర్పణలో ఆయన సొంత బ్యానర్ నందాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ 3 చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఇందులో సిబిరాజ్, రమ్యానంబీశన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
నటుడు సతీష్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మూడో చిత్రం తిరుట్టుప్పయలే 2.సుమారు 10 ఏళ్ల క్రితం తిరుట్టుప్పయలే చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఆ చిత్ర దర్శకుడు సుశీగణేశన్నే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్, వివేక్, రోబోశంకర్, ముత్తురామన్, ఎంఎస్.భాస్కర్, ఓఏకే.సుందర్ ప్రధాన భూమికల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశ్, కల్పాత్తి ఎస్.సురేశ్ నిర్మిస్తున్నారు.