పుస్తక సమీక్షణం
పుస్తకం : వెన్నెల్లో మంచుపూలు (కవిత్వం)
రచన : తిరువాయపాటి రాజగోపాల్
పేజీలు: 100 వెల: 60
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
విషయం : నువ్వు ఇప్పటికీ చిగురు వేస్తున్నావా? జీవన సాఫల్యం జుర్రుకుంటున్నావా? అవునో కాదో తేల్చుకోవాలంటే రాజగోపాల్ ‘వెన్నెల్లో మంచుపూలు’ పరిమళాన్ని ఆస్వాదించాల్సిందే. ‘అంతర్ముఖత్వం అన్ని ఔన్నత్యాలకూ ఆది మూలం’ అని విశ్వసిస్తారు కవి. ‘నా అనామకత్వానికి, నేను విసిరే సవాలు, నా కవిత్వం’ అంటారు. మనం ‘అభినయిస్తున్న విజయాలన్నీ, అప్రకటిత పరాజయాలు’ అని ఆక్షేపిస్తారు. బాల్యజ్ఞాపకాల్లోంచి ‘బతికున్న క్షణాలు’ ఏరుకుంటారు. గాలిసవ్వడిలో గాంధర్వం వింటారు. అధికారాంతం, వాడూ నేనూ, ఇలా కూడా వీలౌతుంది... ప్రతి కవితా దేనికదే ప్రత్యేకం. స్ఫూర్జితశరం, అక్షతగాత్రయోధుడు, నక్షత్ర వృక్షజాలం, దీర్ఘచతురస్రీకరణ... రాజగోపాల్ సొంత పదసామగ్రిని సృష్టించుకుంటారు. ‘రాసిన పంక్తులు, జవనాశ్వాలై, జగత్తును రంగస్థలి చేసుకుని, కవాతు చెయ్యాలి’ అన్న కవి కల నెరవేరాలని ఆశిద్దాం.
- ఎమ్వీ రామిరెడ్డి
లోతుగా వెంటాడే కలలు
పుస్తకం : ఊదారంగు మధ్యాహ్నం (కథలు)
రచన : ఎమ్మెస్ సూర్యనారాయణ
పేజీలు: 98
వెల: 50
ప్రతులకు: ఎం.రత్నమాల, ఆదిత్య కుటీర్, పొదలాడ, రాజోలు, తూ.గో. -533 242
9298950941
విషయం : కవిత్వం, కథలు వేర్వేరు కావచ్చు. కానీ సూర్యనారాయణ కథలు చదివితే, కవిత్వం మారువేషంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. కోనసీమ కొబ్బరినీళ్లంత స్వచ్ఛమైన, చిక్కనైన కవిత్వం ఎమ్మెస్ది. అదే తరహా మ్యాగ్నటిజమ్ ఈ కథల్లోనూ టచ్ అవుతుంది. ఓ పట్టాన అర్థం కాని మోడ్రన్ ఆర్ట్లాంటి కథలివి. ఆయన కన్న కలలు, మెలకువలు, కలవర పాటలు, కలత నిదురలో రాసుకున్న స్వర్ణాక్షరాలు... వీటన్నిటి కలగలపుతో పుట్టిన కథలివి. గోదావరి నదిలో ఉండే గాంభీర్యంతో పాటు గలగల పారే చమత్కారం కూడా ఆవిష్కృతమవుతాయి. ఏదో భావజాలం, అంతర్మథనం వెంటాడీ వెంటాడనట్టుగా అనిపిస్తాయి. జన్మాంతరం, పడమటి ఉత్తరం, చిదంబర స్వప్నం, ఊదారంగు మధ్యాహ్నం, ఆత్మవస్త్రం... చదువుతుంటే, మనసుకున్న కొత్త లోతులు తెలుసుకోవాలనే తహతహ పెరుగుతుంది. ఒక్క ముక్కలో, ఇది స్లో మోషన్లో వెంటాడే కల.
- శ్రీబాబు
ఆలోచింపజేయటం ఒక సవాలు
పుస్తకం : సవాళ్లతో సంఘర్షణ (ఉపన్యాసాలు)
రచన : సీతారాం ఏచూరి
పేజీలు: 228; వెల: 100 ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని ప్రజాశక్తి బ్రాంచీలు
విషయం : ఒకప్పటి ప్రజానాయకుల ఉపన్యాసాలు విని, ఉద్యమ కారులుగా మారినవారు ఎందరో! ఇప్పటికీ ప్రజా ఉద్యమాల్లో పనిచేసేవారు కొందరు మాట్లాడితే జనం కదలిపోతారు. ఉపన్యాసాల ద్వారా తమ రాజకీయ భావజాలాలను వారు విస్తృతంగా ప్రచారం చేస్తారు. వామపక్ష ఉద్యమాల్లో జాతీయ నాయకుడిగా ఎదిగిన సీతారాం ఏచూరి మంచి వక్త. ఆయన తాత్విక భావజాలాన్ని, రాజకీయ అంశాలను అందరూ ఒప్పుకోవచ్చును లేదా వ్యతిరేకించవచ్చును. కానీ ఏచూరి తమ పార్టీ విధానాన్ని చెప్పేటప్పుడు, జాతీయ అంతర్జాతీయ అంశాలను విశ్లేషించేటప్పుడు ఇతరులను ఆకట్టుకునే శక్తి ఉంది. అందుకే చాలామంది మాట్లాడిన ఉపన్యాసాలు అప్పటికప్పుడు విని చప్పట్లు కొట్టి వదిలేయవచ్చును. కానీ ఏచూరి మాటలు ఆలోచింపజేసే దశకు తీసుకుపోతాయి. వామపక్ష దారిలో దేశానికి సోషలిజం వస్తుందా అన్నది సవాలక్షల సవాళ్ల ప్రశ్న అనుకోకండి. ఈ పుస్తకం ద్వారా వామపక్ష ఉద్యమదారి ఎటు పోతుందో తెలుస్తుంది.
- జూలూరు గౌరీశంకర్
కొత్త పుస్తకాలు
అక్షరమాల కథలు
రచన: తల్లాప్రగడ రవికుమార్
పేజీలు: 134; వెల: 80
ప్రతులకు: రచయిత, 21-10-87, శ్రీనగర్ మొదటివీధి, సత్యనారాయణపురం, విజయవాడ-520011.
ఫోన్: 9397831065
అంతర్భ్రమణం
రచన: శ్రీ అరుణం
పేజీలు: 214; వెల: 100
ప్రతులకు: విక్టరీ పబ్లిషర్స్, 30-17-18, వారణాశివారి వీధి, సీతారాంపురం, విజయవాడ-2. ఫోన్: 0866-2444156
1.వియోగి నాటికలు
రచన: కోపల్లె విజయప్రసాదు
పేజీలు: 200; వెల: 150
2. ఆత్మావలోకనం (నవల)
రచన: శ్రీరాగి
పేజీలు: 154; వెల: 120
3. సగటు ఉద్యోగి (నవల)
రచన: శ్రీరాగి
పేజీలు: 346; వెల: 200
ప్రతులకు: టి కె విశాలాక్షిదేవి, 87/395, కమలానగరు, బి క్యాంపు, కర్నూలు-518002. ఫోన్: 9502629095
శ్రీ గాయత్రీ శంకర భాష్యము (ఆంధ్ర వివరణ సహితము)
రచన: శ్రీ శ్రీ చిదానంద భారతీ స్వామి
పేజీలు: 112; వెల: 100
ప్రతులకు: బండారు శివరామకృష్ణశర్మ, శ్రీ చిదానంద భారతీస్వామి ఫౌండేషన్, 11-17-32/1, రామిరెడ్డిపేట, నరసరావుపేట.
ఫోన్: 9247897994
ముక్తకములు
రచన: డా.వై.బాలరాజు
పేజీలు: 96; వెల: 90
ప్రతులకు: రచయిత, 2-9-12, బస్టాండ్ రోడ్, జనగాం, వరంగల్-506167.
ఫోన్: 8500040827