మూతపడ్డ మున్సిపల్ దుకాణాలు
* మున్సిపాలిటికీ భారీగా నష్టం
* అద్దెలను పెంచడంతోనే సమస్య
తిరువళ్లూరు: తిరువళ్లూరు బస్టాండులో మున్సిపాలిటీకి చెందిన షాపులకు అద్దెలను విపరీతంగా పెంచారు. దీంతో సంవత్సరం నుంచి దుకాణాలు మూతపడి నగర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. తిరువళ్లూరు మున్సిపాలిటీకి బస్టాండులో 36 షాపులు ఉన్నాయి. వీటిలో 20 సంవత్సరాల నుంచి పండ్లు, పూల వ్యాపారులు, స్వీట్స్, కూల్డ్రింక్స్ షాపులను నిర్వహించే వారు.
అప్పట్లో ఒక్కో దుకాణానికి రెండు వేలు నుంచి మూడు వేల రూపాయల వరకు చెల్లించేవారు. దీంతో ప్రతి నెలా ఎంతో కొంత ఆదాయం ము న్సిపాలిటీకి వచ్చేది. అయితే నగర కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శరవణకుమార్ అప్పట్లో నిబంధనలను మార్చి ఓపెన్ టెండర్ ద్వారా అద్దెలను నిర్ణయించారు. ఒక్కో షాపు అద్దె మూడు వే ల రూపాయల నుంచి 40 వేల రూపాయలకు పెరగడంతో వ్యాపారులు అద్దె కు తీసుకోవడానికి ముందుకు రాలేదు.
దీంతో గత ఏడాది నుండి 36 షాపులు మూతపడడంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడింది. షాపులు సైతం మూతపడడంతో వ్యాపారులు బస్టాండులో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా షాపులను ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూత పడిన షాపులకు రీటెండర్ నిర్వహించి వ్యాపారులకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.