చెరగని తీపిగుర్తు ‘తెలుగు గంగ’
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: సత్యసాయిబాబాను తిరువళ్లూరు ప్రజలు తమ అరాద్యదైవంగా స్మరించుకుంటారు. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. శనివారం ఆయన జయంతి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ..
తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య 1977లో జల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా 15 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ మేరకు ప్రతి ఏటా ఆంధ్రా నుంచి కృష్ణా జలాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరువళ్లూరు జిల్లా పూండి రిజర్వాయర్‌ను 35 అడుగుల నీటి సామర్థ్యం నిల్వ ఉండేలా నిర్మించారు.
కృష్ణా జలాలను పూండికి తరలించడానికి కండలేరు-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఊత్తుకోట జీరో పాయింట్ వరకు 160 కిలోమీటర్ దూరంలోనూ, జీరోపాయింట్ నుంచి పూండి వరకు 25 కిలోమీటర్ వరకు కాలువలను నిర్మించారు. తర్వాత 1996లో కండలేరు నుంచి నీటిని విడుదల చేశారు. కొంత కాలం పాటు నీరు పూండికి చేరిన తర్వాత కాలువ పూర్తిగా కుంగిపోయింది. దాని మరమ్మతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిది సత్యసాయి ట్రస్టును ఆశ్రయిం చారు. కాలువ మరమ్మతుల కోసం సాయం అందించాలని సాయి బాబాను అభ్యర్థించారు. స్పందించిన బాబా రూ.150 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో పూండి కాలువను పూర్తిగా మరమ్మతు చేశారు. ఆయన కృషిని చెన్నై ప్రజలు నెటికీ స్మరించుకుంటున్నారు. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.