విప్రో లాభం 30 శాతం అప్
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రూ.2,103 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,623 కోట్లతో పోలిస్తే లాభం 29.5 శాతం ఎగబాకింది. ఆదాయం కూడా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 15.5 శాతం వృద్ధితో రూ.11,246 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.9,733 కోట్లుగా నమోదైంది.
సీక్వెన్షియల్‌గా...: గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం(క్యూ4)లో ఆర్జించిన రూ.2,226 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా నికరలాభం 9.5 శాతం తగ్గింది. ఆదాయం(క్యూ4లో 11,703 కోట్లు) కూడా 3.91 శాతం తక్కువగా నమోదైంది.
ఐటీ సేవల పనితీరు...
క్యూ1లో విప్రో ఐటీ సేవల విభాగం నుంచి రూ.10,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. డాలరు రూపంలో చూస్తే కంపెనీ క్యూ1 నికర లాభం 35.1 కోట్ల డాలర్లుగా, ఆదాయం రూ.1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఐటీ సేవల ఆదాయం 1.74 డాలర్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా 1.2 శాతం, వార్షిక ప్రాతిపదికన 9.6 శాతం వృద్ధి సాధించింది.
విప్రో గతంలో ఇచ్చిన ఆదాయ అంచనా(గెడైన్స్) 1.715-1.755 బిలియన్ డాలర్లు కాగా.. ఈ స్థాయిలోనే ఫలితాల్లో నమోదుకావడం గమనార్హం. కాగా, ప్రస్తుత జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు ఆదాయం 1.77-1.81 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని విప్రో పేర్కొంది. అప్లికేషన్, ఇన్ఫ్రా రంగాల్లో కుదుర్చుకున్న భారీ డీల్స్ కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసిందని.. తాజాగా కెనడా కంపెనీ ఆట్కోతో అతిపెద్ద అవుట్సోర్సింగ్ డీల్ కుదరడం తమ కంపెనీ సామర్థ్యానికి, ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. ఉత్తరఅమెరికా దేశాల్లో ఐటీ వ్యయాలు మళ్లీ పుంజుకుంటుండటం కలిసొస్తున్న అంశమని ఆయన చెప్పారు. ప్రస్తుత క్వార్టర్ ఆదాయాల్లో 20 శాతం వృద్ధి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, విప్రో ఫలితాలపై మార్కెట్ విశ్లేషకులు పెదవివిరిచారు.
ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ1లో 35 మంది క్లయింట్లు జతయ్యారు.
జూన్ 30 నాటికి ఐటీ సేవల విభాగంలో 1,47,452 మంది సిబ్బంది ఉన్నారు.
ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం జూన్ క్వార్టర్లో 6 శాతం తగ్గి.. రూ.770 కోట్లుగా నమోదైంది.
ఇక ఆదాయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగం(బీఎఫ్ఎస్ఐ) నుంచి అత్యధిక వాటా లభించింది. తర్వాత స్థానంలో తయారీ, హైటెక్, ఇంధనం, సహజవనరులు-యుటిలిటీస్, గ్లోబల్ మీడియా-టెలికం, రిటైల్, కన్సూమర్ ట్రాన్స్పోర్ట్ హెల్త్‌కేర్-లైఫ్ సెన్సైస్‌లు నిలిచాయి.
ప్రాంతాల వారీగా ఆదాయాల్లో అమెరికా టాప్‌లో ఉండగా.. యూరప్, మిగతా దేశాలు(భారత్‌సహా) ఉన్నాయి.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 1.31 శాతం లాభపడి రూ.577 వద్ద స్థిరపడింది.