విప్రో క్యూ3 లాభం 27 శాతం అప్
బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజం విప్రో అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి 27% అధికంగా రూ. 2,010 కోట్ల నికర లాభాన్ని అందుకుంది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో రూ. 1,589 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగపు ఐటీ సర్వీసుల బిజినెస్‌లో సాధించిన వృద్ధి, క్లయింట్ల నుంచి పెరిగిన డిమాండ్, మెరుగైన సామర్థ్యం వంటి అంశాలు ఉత్తమ పనితీరుకు కారణంగా నిలిచాయి.
ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం సైతం 18% ఎగసి రూ. 11,330 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 9,589 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం ఆదాయంలో ఐటీ ఉత్పత్తుల విభాగం నుంచి రూ. 1,020 కోట్లు సమకూరింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిలకడను సాధిస్తున్నదని, ఈ దశలో క్లయింట్ల నుంచి ప్రధానంగా పశ్చిమ దేశాల నుంచి ఆసక్తి కనిపిస్తున్నదని కంపెనీ చైర్మన్ అజీం ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ఈ క్వార్టర్‌లో 42 మంది కొత్త కస్టమర్లను జమ చేసుకున్నట్లు కంపెనీ సీఈవో టీకే కురియన్ చెప్పారు. వాటాదారుల వద్దనున్న ఒక్కో షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
ఇక డాలర్లలో చూస్తే...
- 180 కోట్ల డాలర్ల ఆదాయంపై 32.5 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది.
- ఐటీ సర్వీసుల ఆదాయం 6.4% వృద్ధితో 167 కోట్ల డాలర్లకు చేరింది.
- ఐటీ సర్వీసుల విభాగం 1,46,402 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
- క్యూ4కు 171-175 కోట్ల డాలర్ల ఐటీ సర్వీసుల ఆదాయాన్ని అంచనా(గెడైన్స్) వేస్తోంది.
బీఎస్‌ఈలో శుక్రవారం విప్రో షేరు ధర 3%పైగా క్షీణించి రూ. 552 వద్ద ముగిసింది.
మార్కెట్లు ముగిశాఖ ఫలితాలు వెల్లడయ్యాయి.