దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది. ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం.
క్యూ3 హైలైట్స్:
- గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి.
- సేవల శాతం ప్రకారం ఆఫ్‌షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది.
- డాలర్ ఆదాయం 2.66 బిలియన్ డాలర్లు
- ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది.
- మొత్తం బుకింగ్‌లు 3.8 బిలియన్ డాలర్లు
- అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది.
విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment