కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఉద్యమాన్ని ఆపుతారా..?
హన్మకొండ, న్యూస్‌లైన్: సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సమైక్యవాద ఉద్యమాన్ని నిలిపివేస్తారా... అని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. హన్మకొండలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే ఉంటే తెలంగాణ ఉద్యమానికి అర్థమే లేదన్నారు. అక్రమ మార్గాల్లో డెప్యూటేషన్లు, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా వచ్చిన ఉద్యోగులు వెళ్లాల్సి ఉంటుందని మాత్రమే కేసీఆర్ అన్నారని వివరించారు. 610 జీవో కూడా అదే చెబుతోందన్నారు. పీఆర్సీ అమలు చేయాల్సిందేనని, అరవై శాతం ఫిట్మెంట్తో వేతనాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కిరణ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రకు అనుకూలంగా ఫైళ్లపై 80 సంతకాలు చేసినట్లు తెలుస్తోందన్నారు. దాదాపు 120ఉల్లంఘనలతో తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన లక్ష ఉద్యోగాలు కొల్లగొట్టారని గిర్గ్లాని కమిటీయే చెప్పిందని గుర్తు చేశా రు. ఇంకా ఆ ప్రాంత ఉద్యోగులు ఇక్కడే పట్టుకునే వేలాడితే ఎలా అని.. ప్రశ్నించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు పోరాట స్వరూపం మారినా ఉద్యమం కొనసాగుతుందన్నారు.