భార్య పొగాకు నములుతోంది.. విడాకులు కావాలి
ముంబై: బాంబే హై కోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందుకు వెరైటీ కేసు ఒకటి వచ్చింది. ‘‘నా భార్య పొగాకు నములుతుంది.. అది నాకు నచ్చడం లేదు. మాకు విడాకులు ఇప్పించండి’’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోదన్న కోర్టు.. అతడి అభ్యర్థనను తోసి పుచ్చింది. కేసు వివరాలు.. నాగపూర్‌కు చెందిన ఈ దంపతులకు 2003 జూన్ 15న వివాహం అయ్యింది. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్ది కాలం తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో భార్యభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కూతురు తండ్రి దగ్గర ఉండగా.. కొడుకు తల్లి దగ్గర ఉంటున్నాడు.
ఈ క్రమంలో భర్త తన భార్యకు విడాకులు ఇవ్వాలని భావించాడు. ఈ నేపథ్యంలో ‘‘నా భార్య ఇంటి పని ఏది సరిగా చేయదు.. కారణం లేకుండానే చీటికి మాటికి నన్ను, నా కుటుంబ సభ్యులను దూషిస్తోంది. నా మాట వినదు.. నా అనుమతి లేకుండానే పుట్టింటికి వెళ్లి 15-30 రోజుల పాటు అక్కడే ఉంటుంది. అన్నింటికి మించి ఆమెకు పొగాకు నమిలే అలవాటు ఉంది. ఫలితంగా ఆమె కడుపులో సిస్ట్ ఏర్పడింది. తన వైద్య ఖర్చుల్ని భరించడం నా వల్ల కాదు. కనుక నాకు విడాకులు ఇప్పించండి’’ అని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.
భార్య వాదన..
భర్త తనపై చేసినవన్ని అసత్యపు ఆరోపణలే అని భార్య వెల్లడించింది. భర్త తన తల్లి మాటలు విని తనను దారుణంగా హింసిస్తాడని తెలిపింది. భర్త, అతడికి బైక్ కావాలని.. తన పుట్టింటి నుంచి దాన్ని తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడని సదరు భార్య కోర్టుకి తెలిపింది. ఈ క్రమంలో తల్లి మాటలు విని తనను దారుణంగా హింసిస్తున్నాడని వెల్లడించింది. అత్తింటి వారి ఆగడాల మీద గతంలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇందుకు సంబంధించిన రిపోర్టులను కోర్టులో సమర్పించింది.
కోర్టు తీర్పు
ఈ కేసుకు సంబంధించి నాగపూర్ ఫ్యామిలీ కోర్టు 2015లోనే తీర్పు వెల్లడించింది. భార్య, భర్తలిద్దరి వాదనలు విన్న కోర్టు.. విడాకుల పిటిషన్‌ని రద్దు చేసింది. దాంతో అతడు బాంబే హై కోర్టు నాగపూర్ బెంచ్‌ను ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరుతూ భర్త సమర్పించిన ఆధారాలు సరిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమస్యలు ప్రతి సంసారంలోనూ ఉంటాయని తెలిపింది. అన్నింటికి కన్నా ముఖ్యంగా భార్య పొగాకు నములుతుందనే కారణం మీద విడాకులు మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.
అంతేకాక విడాకులు కోరుతున్న భర్తకు 2008లో హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలినప్పటికి అతడి భార్య రెండేళ్ల పాటు అతడితోనే ఉందని.. పైగా శారీరక, మానసిక హింసకు సంబంధించి అతడి భార్య కోర్టుకు సమర్పించిన ఆధారాలు చాలా బలంగా ఉన్నాయిని కోర్టు స్పష్టం చేసింది.
చదవండి: విడాకుల వివాదం.. మోడల్ దారుణ హత్య
నేను ‘గే’ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు