అంతరిస్తున్న ప్రకృతి నేస్తాలు
– పక్షిజాతికి ప్రాణాంతకంగా మారుతున్న సెల్ టవర్లు
సందర్భం : నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
ఒకప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలకు సంకేతం పక్షులు, పిచ్చుకల కిలకిలరావాలు అంటే ఈ తరం వారికి నమ్మశక్యంగా ఉండదేమో! ఎందుకంటే ఈ తరం పిల్లలకు స్వేచ్ఛగా విహరించే పక్షులు.. పిచ్చుకలు కంటికి కనిపించవు. ఫలితంగా వాటి గురించి ఆలోచించే తీరిక వారికీ ఉండదు. ఒకప్పుడు కొమ్మలపై, ఇళ్ల వాసరాల్లో తమ రెక్కల చప్పుడుతో జనం దృష్టిని ఆకర్షిస్తూ.. కిలకిల రావాలతో పలకరిస్తున్నట్లుండే పిచ్చుకలు.. జీవావరణ సమతుల్యతకు అత్యంత ఆప్త మిత్రులుగా వెలుగొందాయి. జనారణ్యాలు పెరగడం.. చెట్లు నరికి వేయడం.. శబ్ధ కాలుష్యం... సెల్టవర్ల రేడియేషన్ కారణంగా పక్షుల జాతి క్రమంగా కనుమరగవుతూ వస్తోంది. ప్రకృతి నేస్తాలైన పక్షిజాతులను కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
- అనంతపురం కల్చరల్
పర్యావరణ సమతుల్యత లోపించి రోజురోజుకూ వేడెక్కుతున్న భూగోళం కారణంగా మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి తరుణంలో పక్షుల జాతులు పిట్టల్లా రాలిపోతున్నాయి. జిల్లాలోని వీరాపురం ప్రపంచంలోని వివిధ రకాల పక్షులకు స్థావరంగా నిలుస్తోంది. అరబ్, నైజీరియా, సైబీరియా, న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల పక్షులను ఇక్కడి ప్రకృతి సూదంటురాయిలా ఆకర్షిస్తుంటే.. మన ఇంటి ముంగిళ్లలో, లోగిళ్లలో వాలే పిచ్చుకలను దూరం చేసుకోవడం స్వయంకృతాపరాధమే అవుతోంది. ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే శుభం జరుగుతుందని పూర్వీకులు భావించి, వాటిని మురిపెంగా పిలుస్తూ ధాన్యాలను మూలలో వెదజల్లేవారు.
పక్షులను కాపాడుకోవాలి
ఒకప్పుడు ఇళ్లలో గువ్వలు గూళ్లు కట్టుకునేవి. వాటిని చూస్తూంటే మనసు ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు పిచ్చుకలను టీవీల్లోనో, సినిమాల్లోనే చూడాల్సిన గతి పట్టింది. మా చిన్నప్పుడు మా ఇంట్లో పిచ్చుకల కోసం చిన్నపాటి గూడు ఏర్పాటు చేసే వాళ్లం. వాటితో ఉన్నామన్న ఫీలింగే.. ఎంత ఒత్తిళ్లు ఉన్నా మనసు తేలికగా మారిపోయేది. అతి ప్రమాదకరమైన రేడియేషన్ వెలువరిచే సెల్ టవర్స్ నిర్మాణాలు డబ్బు కోసం ఇంటిపైనే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశమిస్తున్నాం. ఇది మంచిది కాదు. పిచ్చుకజాతి ప్రాధాన్యతను తెలిజేస్తూ జనంలో అవగాహన పెంచుతున్నాం.
– మఠం నాగరాజు, ప్రకృతి ప్రేమికుడు, అనంతపురం