మొదట పళ్లు తోమింది ఎవరు? ఎప్పుడు?!
ఆవిష్కరణం
టూత్‌పౌడర్, టూత్ పేస్ట్‌ల వాడకాన్ని మానవ నాగరికత అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు.అలాంటి టూత్‌పేస్ట్, టూత్పౌడర్లకు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం ఎన్నో నాగరికతలు ఎన్నో ఫ్లేవర్స్‌లో టూత్‌పేస్ట్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ప్రాచీన ఈజిప్షియన్లు తొలిసారి పళ్లను తోముకోవడానికి ఒక పౌడర్‌ను ఉపయోగించారు. భారత్ వంటి దేశాల్లో కూడా తొలి నుంచి నోటిని శుభ్రం చేసుకోవడానికి వేర్లను, ఎండిన వేప కొమ్మల నుంచి తీసిన పౌడర్‌ను వాడిన దాఖలాలున్నాయి. రోమన్, గ్రీకు నాగరికతల్లో కూడా టూత్‌పౌడర్ ప్రస్తావన ఉంది. నాణ్యమైన మట్టిని కూడా టూత్పౌడర్లుగా ఉపయోగించారు. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో టూత్‌పౌడర్, పేస్ట్‌లు తయారు చేసే బాధ్యత తీసుకొన్నారు వైద్యులు.
ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఫార్ములాలతో, ఫ్లేవర్లలో దంతధావనానికి పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేల సంవత్సరాలు గడిచిపోయినా టూత్‌పేస్ట్‌ల ఉత్పాదన అనేది వ్యాపారంగా మారకపోవడం! క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరాల కిందట నుంచి టూత్‌పౌడర్, పేస్ట్‌లు వినియోగంలోనే ఉన్నప్పటికీ క్రీస్తు శకం 1873 వరకూ టూత్పేస్ట్లు పరిశ్రమలుగా అభివృద్ధి చెందలేదు. తొలిసారి టూత్‌పేస్ట్‌ను మాస్ ప్రొడక్షన్ గా మార్చింది కోల్గేట్! పెద్దపెద్ద జార్స్‌లో కోల్గేట్ టూత్‌పేస్ట్ మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది. 1892నాటికి ట్యూబ్‌ల రూపంలో పేస్ట్‌ను మార్కెట్ చేయసాగారు. అక్కడి నుంచి అనేక కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి.