ఉప్పు నుంచి నోటు వరకు.. ఫేక్ ఫేక్ ఫేక్!
ఈ ఏడాది టాప్ -10 ఫేక్ కథనాలు ఇవే
కాదేది కవిత్వానికి అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇప్పుడు కాదేది ఫేక్ ప్రచారానికి అనర్హం అంటున్నారు నెటిజన్లు. 2016లో నోట్ల నుంచి ఉప్పు వరకు దొరికిన ప్రతి దానిపై ఫేక్ కథనాలు సృష్టించి.. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ప్రచారం చేశారు. పేరుకు ఇవి బూటకపు కథనాలే అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇవి చోటు సంపాదించిన సందర్భాలు ఉన్నాయంటే.. వీటి ధాటి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫేక్ కథనాల ధాటికి భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), యూనెస్కో వంటి ప్రఖ్యాత సంస్థలు ఇవి నిజం కాదు బాబోయ్ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆఖరికీ ఇంటర్నెట్ దిగ్గజాలైన ఫేస్ బుక్, గూగుల్ కూడా వివరణలు ఇవ్వక తప్పలేదు.
సోషల్ మీడియాకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ మనదేశమే. దేశంలో వాట్సాప్ కు 16 కోట్లమంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్ బుక్ ను 14.8 కోట్లమంది వాడుతుండగా.. ట్విట్టర్ ను 2.2 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సహజంగానే సోషల్ మీడియాలో పుట్టే ఏ చిన్న ఫేక్ కథనమైనా కలకలం రేపుతోంది. నిజానికి ఫేక్ కథనాల ధాటి ఏమిటో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రుజువైంది. ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత వార్తాసంస్థలు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, ఎన్బీసీ న్యూస్ లో వచ్చిన టాప్ కథనాల కంటే కూడా ఫేక్ కథనాలపైన ఫేస్ బుక్ లో, ఇతర సోషల్ మీడియా వేదికల్లో అత్యధికంగా చర్చ జరిగింది.
ఇక 2016లో దేశంలో హల్ చల్ చేసిన టాప్ 10 ఫేక్ కథనాలు ఇవే.
ఉత్తమ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీని ప్రకటించిన యూనెస్కో
దేశంలో హల్ చల్ చేసిన చాలా బూటకపు కథనాలకు మూలంగా నిలిచింది ఐక్యరాజ్యసమితికి చెందిన సాంస్కృతిక సంస్థ యూనెస్కో. గత జూన్ లో ఈ బూటకపు కథనం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఇప్పటికే మోదీకి బెస్ట్ పీఎంగా యూనెస్కో పురస్కారం అందిందన్న బూటకపు వార్త వాట్సాప్ లో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను ఎంపిక చేసిన యూనెస్కో
ఈ ఫేక్ కథనం కూడా వాట్సాప్ యూజర్లు ప్రతి ఒక్కరికీ చేరి ఉంటుంది. ప్రపంచంలోనే ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను యూనెస్కో ప్రకటించిందంటూ ఈ కథనం 2008 నుంచి ఈమెయిళ్లలో చక్కర్లు కొడుతోంది. అప్పట్లోనే యూనెస్కో స్పందించింది. దేశంలోని పలు బ్లాగుల్లో ప్రచురించినట్టు భారత జాతీయగీతం గురించిగానీ, ఇతర దేశం గురించిగానీ తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇచ్చింది. అయినా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొట్టింది.
ప్రపంచంలోనే ఉత్తమ కరెన్సీగా రూ. 2000 నోటును ప్రకటించిన యూనెస్కో
నోట్ల రద్దు సంక్షోభంతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో చక్కర్లు కొట్టిన మరో ఫేక్ న్యూస్ ఇది. రూ. 2000 నోటును యూనెస్కో ఉత్తమ కరెన్సీగా ప్రకటించిందంటూ వాట్సాప్ లో విపరీతంగా వ్యాప్తి చెందింది ఈ కథనం. విశేషమేమిటంటే ఏకంగా బీబీసీ కూడా ఈ వదంతి గురించి స్పందించి ఓ కథనాన్ని ఇచ్చింది. భారతీయులు మరీ మురిసిపోతూ ఈ ఫేక్ కథనాన్ని షేర్ చేసుకుంటున్నారని పేర్కొంది.
కొత్త నోట్లలో జీపీఎస్ చిప్.. నల్లధనానికి చెక్!
నవంబర్ 8న పెద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేసిన తర్వాత ఈ విషయంలో ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. కొత్త రెండువేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉందని, ఎవరైనా పెద్దమొత్తంలో ఈ నోట్లను దాచిపెడితే.. సులువుగా దొరికిపోతారని, భూమిలో 120 మీటర్ల లోతులో నోట్లు దాచిపెట్టినా.. రాడర్ నిఘా నుంచి తప్పించుకోలేరంటూ ఈ వదంతి బాగా హల్ చల్ చేసింది. నోట్లరద్దుపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన గంటలోపే తెరపైకి వచ్చిన ఈ రూమర్ ఎంత వేగంగా పాకిపోయిందంటే.. ఏకంగా దీనిపై ఆర్బీఐ సైతం వివరణ ఇచ్చింది. నోటులో అనేక భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి కానీ, ఎలాంటి చిప్ లేదని తేల్చేసింది.
కొత్త నోట్లలో రేడియోయాక్టివ్ ఇంక్
దేశంలో భారీగా కొత్త నోట్లు అక్రమార్కుల వద్ద దొరికిపోతుండటంతో తెరపైకి వచ్చిందీ ఈ వదంతి. ఆర్బీఐ రేడియోయాక్టివ్ ఇంక్ తో కొత్త రూ. 500, రెండువేల నోట్లను ముద్రించిందని, దీనితో ప్రజలకు ఎలాంటి హాని ఉండదని, కానీ ఎవరైనా వీటిని పెద్దమొత్తంలో దాచుకుంటే ఐటీ అధికారులు ఇట్టే పట్టేయగలరంటూ ఈ ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. ఈ ఇంక్ వల్లే పెద్ద ఎత్తున అక్రమార్కులు దొరికిపోతున్నారంటూ ఊహాగానాలు జోడించింది.
వాట్సాప్ ప్రొఫెల్ పిక్చర్లతో..
మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు తొలగించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సూచించినట్టు వచ్చిన ఒక రూమర్ హల్ చల్ చేసింది. ఈ ప్రొఫైల్ చిత్రాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దుర్వినియోగం చేయవచ్చునని, ఈ చిత్రాల ద్వారా ఇస్లామిక్ స్టేట్ హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం దొంగలించి.. దానిని ఉగ్రవాద కార్యక్రమాల్లో దుర్వినియోగం చేయవచ్చునంటూ, మహిళల అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వదంతి చక్కర్లు కొట్టింది. అయితే, ఢిల్లీ పోలీసు కమిషనర్ ఏకే మిట్టల్ ఈ ప్రకటన చేశారని ఈ వదంతి పేర్కొనగా.. అసలు ఢిల్లీ సీపీ ఏకే వర్మ కావడంతో ఇది ఫేక్ అని తేలిపోయింది.
పది రూపాయల నాణెలు రద్దుచేసిన ఆర్బీఐ
నోట్ల రద్దుకు ముందు ఆగ్రా, ఢిల్లీ, మీరట్ ప్రాంతాల్లో ఈ ఫేక్ వార్త బాగా హల్ చల్ చేసింది. పదిరూపాయల నాణెలను ఆర్బీఐ రద్దు చేసిందంటూ కథనాలు రావడంతో స్థానిక వ్యాపారులు, రిక్షా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి ఇది ఈ వార్త వట్టి బూటకమని తేల్చింది.
జయలలిత రహస్య కూతురు!
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత ఆమెకు రహస్యంగా కూతురు ఉన్నారని, ఆమె అమెరికాలో నివసిస్తున్నారని ఓ మహిళ ఫొటోతో బూటకపు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలు ఖండిస్తూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వివరణ ఇచ్చింది. సదరు ఫొటోలో ఉన్న మహిళతో జయలలితకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఆస్ట్రేలియాలో నివసిస్తున్నదని చిన్మయి తెలిపింది.
ఉప్పు కొరత!
నోట్ల రద్దు తర్వాత ఉప్పు కొరత వదంతి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద దుమారమే రేపింది. దేశానికి 7,517 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా ఉప్పు కొరత వస్తుందంటూ వార్తలు రాగా.. సామాన్యులు అది నమ్మి అర్ధరాత్రి దుకాణాలకు పోటెత్తారు. ఉప్పు ధర నాలుగు రెట్లు పెరిగిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరాబాద్ లో ఈ రూమర్ల ప్రభావం పడింది. ఉప్పు కోసం జనాలు పోటెత్తడంతో కాన్పూర్ లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
నెహ్రూ ప్రభుత్వం మర్రిచెట్టులా నిలిచింది
దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం మరిచెట్టులా నీడ పరిచిందని, ఆయన కుటుంబం వల్ల ఇతరులు ఎదిగే అవకాశమే లేకుండా పోయిందని విమర్శిస్తూ బీబీసీ ఇండియా మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టుల్లీ అన్నట్టు వదంతులు వచ్చాయి. ప్రధాని మోదీని పొగుడుతూ.. ఆయన వ్యాఖ్యలు చేశారని ఈ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ తాను అలా అనలేదని మార్క్ టుల్లీ స్వయంగా వివరణ ఇచ్చారు.