క్విటోవా, హలెప్ అవుట్
అదే దారిలో కెర్బర్, వీనస్
- యూఎస్ ఓపెన్
న్యూయార్క్: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మూడో రౌండ్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల విభాగంలో టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్న రెండో సీడ్ సిమోన హలెప్, మూడో సీడ్ పెట్రా క్విటోవాతో పాటు ఆరో సీడ్ ఆంజెలిక్ కెర్బర్, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ (19వ సీడ్) టోర్నీ నుంచి నిష్ర్కమించారు. దీంతో టాప్-10 సీడెడ్ క్రీడాకారిణుల నుంచి ఐదుగురు ఇంటిముఖం పట్టినట్లయింది. ఇప్పటికే రద్వాన్‌స్కా, ఇవనోవిచ్ కూడా ఓడారు.
లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో క్విటోవా 4-6, 3-6 తేడాతో అలెగ్జాండ్రా క్రూనిక్ (సెర్బియా) చేతిలో ఓడింది. ఈ ఏడాది వింబుల్డన్ గెలుచుకున్న క్విటోవా... కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న 143వ ర్యాంకర్ క్రూనిక్పై తన స్థాయికి తగ్గ ఆటతీరును చూపలేకపోయింది. ఇక శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హలెప్ (రొమేనియా) 6-7 (6/8), 2-6తో 32 ఏళ్ల క్వాలిఫయర్ మిర్జానా లూసిక్-బరోని (క్రొయేషియా)పై వరుస సెట్లలో ఓడింది.
17 ఏళ్ల స్విస్ సంచలనం బెలిండా బెన్సిక్ 6-1, 7-5తో ఆరో సీడ్ కెర్బర్ (జర్మనీ)ను కంగుతినిపించింది. 13వ సీడ్ సారా ఎర్రానీ 6-0, 0-6, 7-6 (7/5)తో వీనస్ విలియమ్స్‌ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో రష్యా బ్యూటీ షరపోవా 6-2, 6-4తో లిసికి (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-0 లార్సన్ (స్వీడన్)పై, 10వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-3, 6-2తో పెట్కోవిక్ (జర్మనీ)పై నెగ్గారు.
మూడో రౌండ్‌కు జకోవిచ్, ఫెడరర్
ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విస్) తమ జోరును కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో మాజీ చాంప్ ఫెడరర్ 6-4, 6-4, 6-4తో గ్రోత్ (ఆసీస్)పై గెలిచి మూడో రౌండ్లో ప్రవేశించాడు. ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్) 6-3, 4-6, 6-2, 3-6, 6-3 కిజాన్ (స్లొవేకియా)పై, ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-1, 6-2, 6-2తో సేల (ఇజ్రాయిల్)పై గెలిచారు. జకోవిచ్ 6-1, 6-3, 6-0 మథియు (ఫ్రాన్స్)పై, ఆండీ ముర్రే 6-3, 6-3, 6-4 బాచింగర్ (జర్మనీ)పై, ఐదో సీడ్ రవోనిక్ (కెనడా) 7-6 (7/4), 5-7, 6-4, 7-6 (7/3) గోజోవిజిక్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4 నెడొవ్యెసోవ్ (కజకిస్థాన్)పై పైచేయి సాధించారు.
పేస్, స్టెఫానెక్ ముందంజ
పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, స్టెఫానెక్ (చెక్) జోడి 7-6, 6-3 తేడాతో లు (తైపీ), వెసెలీ (చెక్)పై నెగ్గింది.
మూడో రౌండ్‌కు సానియా జోడి
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి మూడో రౌండ్లోకిప్రవేశించింది. రెండో రౌండ్లో ఈ మూడో సీడ్ జంట 6-1, 6-2 తేడాతో గార్సియా (ఫ్రాన్స్)-నికోలెస్క్యూ (రొమేనియా)పై సునాయాసంగా నెగ్గింది. రెండు సెట్లలోనూ ప్రత్యర్థి నుంచి సానియా జోడికి ఏమాత్రం ప్రతిఘటన ఎదురులేదు.