ఈ ఆలయాల సంపదతో.. పేదరికం హుష్‌కాకి!
ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయడంతో నల్లధన సంపన్నుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నల్లధనాన్ని సక్రమధనంగా మార్చేందుకు పలువురు ధనికులు నానా తంటాలు పడుతుండగా.. మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా గుళ్లు, గోపురాలకు భారీగా ముడుపులు సమర్పించుకుంటున్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత దేశంలోని ఆలయాలన్నింటికీ పాతకరెన్సీరూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏ దేవుడి హుండీ చూసినా పాతకరెన్సీ కట్టలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్-10 ఆలయాల సంపద జాతికి అందజేస్తే.. దేశంలో పేదరిక సమస్యే ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని టాప్-10 ఆలయాలు.. వాటి సంపద వివరాలు ఇవి.
పద్మనాభస్వామి ఆలయం - కేరళ
దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది. అనంతపద్మనాభుడి వద్ద ఎంతలేదన్న 20బిలియన్ డాలర్ల (రూ. Rs 13.60 లక్షల కోట్ల) సంపద ఉంటుందని అంచనా.
తిరుమల తిరుపతి దేవస్థానం - ఆంధ్రప్రదేశ్
అత్యంత ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకన్నకు ఏటా రూ. 650 కోట్లు విరాళాలరూపంలో అందుతున్నాయి. లడ్డూల అమ్మకం ద్వారానే ఏటా రూ. 75 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దేశంలో అత్యంత సంపన్నమైన రెండో దేవాలయంగా టీటీడీ విరాజిల్లుతోంది.
షిర్డీ సాయిబాబా - మహారాష్ట్ర
దేశంలో అత్యంత సంపన్నమైన మూడో ఆలయం షిరిడీ సాయినాథుడిదే. సాయిబాబా ఆలయం వద్ద రూ. 32 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు రూ. 6 లక్షల విలువైన నాణెలు ఉన్నాయి. విరాళాల రూపంలో ఆలయానికి ఏటా రూ. 360 కోట్లు అందుతున్నాయి.
వైష్ణోదేవి ఆలయం- జమ్మూ
దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో వైష్ణోదేవి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఏటా రూ. 500 కోట్లమేర విరాళాల రూపంలో అందుతున్నాయి.
సిద్ధి వినాయక ఆలయం-ముంబై
బాలీవుడ్ సెలబ్రిటీలు నిత్యం దర్శించుకునే ఈ ఆలయానికి ఏటా రూ. 48 కోట్ల నుంచి రూ. 125 కోట్ల వరకు విరాళాలు అందుతున్నాయి.
స్వర్ణ దేవాలయం- అమృత్సర్
బంగారుతాపడంతో చేయించిన ఆలయం ఇది. ఇందులో కొలువైన సిక్కుల పవిత్ర పుస్తకమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో వజ్రాలు, విలువైన మణులు పొదిగిఉన్నాయి.
మీనాక్షి ఆలయం- మధురై
ఈ ఆలయాన్ని ఏటా 30వేలమంది దర్శించుకుంటారు. ఏడాదికి రూ. ఆరు కోట్ల ఆదాయం ఈ ఆలయానికి వస్తున్నది.
జగన్నాథ ఆలయం-పూరి
ఈ ఆలయం పూర్తి విలువ ఎంత ఉంటుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆలయంలో 130 కిలోల బంగారం, 220 కిలోల వెండి ఉందని చెప్తారు. జగన్నాథ రథయాత్రకు పేరొందిన పూరి ఆలయానికి గతంలో ఓ యూరప్ భక్తుడు రూ. 1.72 కోట్ల విరాళం అందజేశాడు.
కాశీ విశ్వనాథ ఆలయం- వారణాసి
ఈ ఆలయానికి మూడు గుమ్మటాలు ఉండగా, అందులో రెండు బంగారుతాపడంతో చేయించినవి. ఈ ఆలయానికి ఏటా విరాళాల రూపంలో రూ. 4 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తుంది.
సోమ్‌నాథ్ ఆలయం- గుజరాత్
గుజరాత్‌లోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది. ఈ ఆలయానికి ఏటా రూ. 33 కోట్ల ఆదాయం వస్తుంది.