ప్రభావితం చేసే ఆ 11 పుస్తకాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పైకొచ్చిన వారు, అంటే వాణిజ్యవేత్తలు, రాజకీయవేత్తలు, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు తీరిక వేళల్లో ఎలాంటి పుస్తకాలు చదువుతారు, 2016 సంవత్సరంలో వారు ఏయే పుస్తకాలు చదివారు? వాటిలో వారిని ప్రభావితం చేసిన పుస్తకాలేవి? చదవాల్సిందిగా పాఠకులకు వారు సిఫార్సు చేసే పుస్తకాలేవి? 62 మంది అలాంటి ప్రముఖులను సోషల్ మీడియా ఫేస్బుక్ ప్రశ్నించగా 236 పుస్తకాలను వారు సూచించారు. వాటిలో 11 పుస్తకాలను చాలా ఎక్కువ మంది సూచించారు. అవి..
1. సెపియన్స్ (మానవులు):మానవుల పుట్టు పూర్వోత్తరాలు, మానవ జాతుల గురించి వివరించే ఈ పుస్తకాన్ని ఎక్కువ మంది చదివారు. చదవాల్సిందిగా సూచించారు. దీన్ని యువల్ నోవా హరారీ రాశారు.
2. ఆరిజనల్స్: ప్రపంచంలో మార్పులకు దోహదపడిన సంప్రదాయేతర సజనశీలురు గురించి ఈ నవల వివరిస్తుంది. దీన్ని న్యూయార్క్ టైమ్స్ రైటర్ ఆడమ్ గ్రాంట్ రచించారు.
3. టీమ్ ఆఫ్ టీమ్స్: ఈ సంక్లిష్ట ప్రపంచంలో ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజయం సాధించవచ్చో వివరించే పుస్తకం. అటు ఆర్మీపరంగా, ఇటు వ్యాపారం పరంగా మంచి పుస్తకమని మన్ననలందుకున్న ఈ పుస్తకాన్ని జనరల్ స్టాన్లీ మ్యాక్క్రిస్టల్ రాశారు.
4. హిల్‌బిల్లీ ఎలిగి: అమెరికాలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున సమయంలో ఒహాయో రాష్ట్రంలో ఓ కుటుంబం జీవనం, వారి సంస్కతికి సంబంధించిన జ్ఞాపకాలను కళ్లకుకట్టే ఈ నవలను జేడీ వాన్స్ రచించారు.
5. ది ఇండస్ట్రీస్ ఆఫ్ ది ఫ్యూచర్: రానున్న పదేళ్లలో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో వచ్చే వప్లవాత్మక మార్పుల వల్ల భవిష్యత్ పరిశ్రమలు ఎలా ఉండబోతున్నాయో అవిష్కరించే ఈ పుస్తకాన్ని అలెక్స్ క్రాస్ రాశారు. ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి చూడాల్సిన అవసరం లేదని చెప్పే థీమ్.
6. ఫ్రీకానామిక్స్: పదేళ్లక్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ పారిశ్రామికవేత్తలను, పలు రంగాలకు చెందిన ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధునిక ప్రపంచానికి కొత్త నిర్వచనం ఇచ్చే ఈ పుస్తకాన్ని స్టీఫెన్ డూబ్నర్, స్టీఫెన్ లెవిట్ రచించారు.
7. రైటింగ్ మై రాంగ్స్: ఓ హత్య కేసులో జైలుకెళ్లిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని నేరం కారణంగా అంచనా వేయలేమని, క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలు రావాలని అభిలషించే ఈ పుస్తకాన్ని శాకా షెంగార్ రచించారు.
8. ది జీన్: జన్యువలపై ఆధారపడే మానవులు వాటిని జయించి ఎలా జీవించవచ్చో వివరించి శాస్త్రవిజ్ఞాన నవల. దీన్ని ‘క్యాన్సర్’ పుస్తకానికి పులిట్జర్ అవార్డు అందుకున్న సిద్ధార్థ ముఖర్జీ రచించారు.
9. ఎడ్యూరెన్స్: అట్లాంటిక్ సముద్రాన్ని పశ్చిమ తీరం నుంచి ఉత్తర తీరానికి షాకల్టన్ పడవలో సాగించే సాహస యాత్రకు సంబంధించిన కథ. ధైర్య సాహసాలకు, నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తిగా నిలిచే ఈ పుస్తకాన్ని ఆల్ఫ్రెడ్ లాన్సింగ్ రాశారు. 1954లో తొలి ముద్రణ వెలువడింది.
10: డెలివరింగ్ హ్యాపినెస్: వ్యాపారంలో ఎలా విజయాలు సాధించారో, ఆ తర్వాత జీవితాన్ని ఎలా అందంగా మలుచుకున్నారో, మన చుట్టూ ఉన్న అందాలను ఎలా ఆస్వాదించాలో రచయిత టోనీ సై ఈ పుస్తకంలో వివరిస్తారు.
11:కాన్సియస్ బిజినెస్: వ్యాపారంలో కూడా విలువలుతో విలువలను ఎలా సష్టించవచ్చో తెలిపే పుస్తకం. మానసిక చేతనే గొప్ప నాయకత్వాన్ని ఇస్తుందని చెబుతున్న ఈ పుస్తకాన్ని ఫ్రెడ్ కోఫ్మన్ రాశారు.
ఈ ఫేస్బుక్ అభిప్రాయ సేకరణలో బిల్ గేట్స్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బిజినెస్‌కు సంబంధించిన పుస్తకాలనే కాకుండా టెన్నీస్, రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలను కూడా చదువుతారు.