ఎయిర్పోర్ట్ నుంచే గోల్డ్ కంటెయినర్ ఎత్తుకెళ్లారు
అట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడాలో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా ఎయిర్పోర్ట్ నుంచే బంగారంతో కూడిన ఓ కంటెయినర్‌ను మాయం చేశారు దుండగులు. కెనడా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అందులో 14.8 మిలియన్ డాలర్ల విలువైన బంగారంతో పాటు అదనంగా విలువైన కొన్ని వస్తువులు ఉన్నాయి.
ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం బంగారం, విలువైన వస్తువులతో కూడిన కంటెయినర్ టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కార్గో సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చోటుకి దీనిని తరలించారు. అక్కడి నుంచి దానిని గమ్యస్థానానికి భద్రంగా చేర్చాలని ఏర్పాట్లు చేయబోయారు. ఇంతలోనే అది మాయం అయ్యింది. ఈ కంటెయినర్ ఎవరికి చెందిందనే వివరాలను, ఎక్కడికి చేరుకోవాలనే వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఉత్తర అమెరికాలో ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న భారీ దోపిడీ ఇది. అలాగే.. కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీనిని అభివర్ణిస్తున్నారు అక్కడి అధికారులు. ఐదున్నర స్క్వేర్ ఫీట్స్‌తో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ కంటెయినర్‌ను అవలీలగా ఎత్తుకెళ్లిపోగా.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అన్ని చోట్లా గాలిస్తున్నట్లు పీల్ రీజినల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ దుయివెస్టెయిన్ ప్రకటించారు. ఇది లోకల్ గ్యాంగ్‌ల పనే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే..
అది ఇంకా కెనడాలోనే ఉందా? లేదా కంటెయినర్‌ను దేశం దాటించారా? అనే విషయంపైనా పోలీసులకు స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. గతంలోనూ కెనడా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనలే రెండు, మూడు జరిగాయి కూడా.