నాలుగేళ్ల మనవరాలిపై తాత దాష్టీకం
చీపురుగూడెం (నల్లజర్ల రూరల్) :అభం, శుభం తెలియని ఆ పసిపాప పేరు కీర్తన. వయసు నాలుగేళ్లు. తండ్రి వదిలేశాడు. గంగన్నగూడెంకు చెందిన తల్లి అచ్చమ్మ గల్ఫ్ వెళ్లిపోయింది. కొంతకాలంగా ఆ పాప చీపురుగూడెంలో తన తాత (తల్లి తండ్రి) కొల్లూరి అబ్బుల వద్ద ఉంటోంది. పగలు అంగన్వాడీ కేంద్రంలో, రాత్రి తాత ఇంటి వద్ద ఉంటోంది. ఆ ఇంట్లో కీర్తన తాత, అమ్మమ్మ, పిన్ని ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఆ పిల్లను కుటుంబ సభ్యులంతా హింసకు గురిచేస్తున్నారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ అకృత్యాలను చూడలేక వారంతా చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు.
మంగళవారం చైల్డ్‌లైన్ నోడల్ కోఆర్డినేటర్ బి.నరేంద్ర, జిల్లా కోఆర్డినేటర్ జే.వి.ఆర్.ఆల్ఫ్రెడ్, సిబ్బంది ఎస్.రవిబాబు, ఎస్.సునీత చీపురుగూడెం వచ్చి విచారణ చేశారు. విషయం వాస్తవమని తేలింది. బాలిక కట్టా కీర్తన వెళుతున్న నంబర్ 55 అంగన్వాడీ కేంద్రంలో టీచర్ కృష్ణకుమారి, పరిసర ప్రాంత వాసుల నుంచి వివరాలు సేకరించారు. వచ్చీరాని మాటలతో ఆ బాలిక కూడా తాతే తనను కొట్టినట్టు చెబుతోంది. బాలిక ఒంటిపైన, చేతిపైన, వీపు మీద గాయాలున్నాయి. బాలిక తాత కొల్లూరి అబ్బులను పిలిచి విచారించారు.
బాలికను కొట్టిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. ముద్దొచ్చి బుగ్గపై కొరికానంటున్నాడు. ‘మా అమ్మ మణెమ్మ కోపమొచ్చి కొట్టిన మాట వాస్తవమేనని అందుకే ఆమె వద్ద నుంచి పిల్లను తీసుకోచ్చి తన వద్ద ఉంచానని చెప్పాడు. ఇదంతా ఎప్పుడో జరిగిందని ఇప్పుడు బాగానే చూసుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.అప్పారావు రికార్డు చేశారు. బాలికను హింసించిన అబ్బులను అనంతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఏలూరులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సీహెచ్.పి.వి.ఎన్.లక్ష్మీ, వి.విజయనిర్మల వద్ద హాజరుపర్చారు. వారి సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం హోమ్‌కు తరలిస్తామని చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ తెలిపారు.