Tour Darshan
-
దసరాకు ఆర్టీసీ ‘ స్పెషల్’!
యాదాద్రి: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏటా స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 409 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకం తర్వాత వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుండగా.. రాఖీ సందర్భంగా సత్ఫలితాలు ఇచ్చిన గిఫ్ట్‌ల కార్యక్రమాన్ని ఈ పండుగకు ప్రవేశపెట్టనున్నారు. 10 మందికి రూ.9,900 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. 10 మంది ప్రయాణికులకు గిఫ్ట్‌లు ప్రయాణికుల ఆదరణ పొందడం.. తద్వారా మంచి ఆదాయాన్ని గడించేందుకు వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ ముందుకు వస్తోంది. రాఖీ సందర్భంగా చేపట్టిన బహుమతుల పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ దసరాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం రీజియన్ పరిధిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేయనున్నారు. పండుగకు ముందు ఈనెల 21 నుంచి 23 వరకు, పండుగ తర్వాత 28నుంచి 30వ తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్‌నంబర్ రాసి.. ఆర్టీసీ ఏర్పాటు చేసే బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను నల్ల గొండ, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్తబస్టాండ్, యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, భువనగిరి బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ రోజులను గుర్తించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నల్లగొండ, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లావాసులు ఉద్యోగాలు, ఇతర పనులు, విద్య కోసం రాజధాని హైదరాబాద్‌లోనే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు కావడంతో పెద్దఎత్తున జనం సొంత గ్రామాలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయా డిపోలకు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు, తర్వాత సాధారణ జనం రద్దీ కారణంగా 19నుంచి 22వ తేదీ వరకు.. ఇలా మొత్తంగా ఏడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి ఆయా తేదీల్లో రాజధానికి అదనపు బస్సులు నడపనున్నారు. 409 బస్సులు.. సాధారణ చార్జీలు పండుగ నేపథ్యంలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలో మొత్తం 409 బస్సులతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొదటిరోజు శుక్రవారం ఏడు డిపోల నుంచి 56 బస్సులను నడిపారు. ఇక 14వ తేదీన 36 బస్సులు నడపనున్నారు. 15వ తేదీన 35 బస్సులు తిప్పుతారు. తిరిగి ఈనెల 19న 71 బస్సులు, 20వ తేదీన 56 బస్సులు, 21వ తేదీన 75 బస్సులు, 22వ తేదీన 80 బస్సులు నడపనున్నారు. అయితే గతంలో స్పెషల్ బస్సులను నడిపితే 20 శాతం మేర చార్జీలు అదనంగా వసూలు చేసేవారు. 2022లో బస్ చార్జీలు రెండుసార్లు పెంచడం, చిల్లర సమస్యతో మరోసారి పెంచడంతో గతేడాది దసరా స్పెషల్ బస్సులకు చార్జీలను పెంచలేదు. ఈ సారి కూడా రోజువారీగా వసూలు చేసే చార్జీలనే తీసుకోనున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ రీజియన్ పరిధిలో 409 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు స్పెషల్ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనంగా సర్వీసులు నడుపుతాం. ఈ పండుగకు నగదు బహుమతులు అందిస్తున్నాం. – ఎస్.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
అగుంబే... అద్భుతః
టూర్‌దర్శన్ నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి. అందుకే, కర్ణాటకలోని అగుంబేను ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమల్లో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రకృతి ప్రేమికులకు సాక్షాత్తు స్వర్గధామమే. నింగిని తాకే కొండలు, దట్టమైన అడవులతో నిండిన లోయలు, అడుగడుగునా తారసపడే జలపాతాలు... అద్భుతః అనిపిస్తాయి. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కిలోమీటర్ల చిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు మాత్రమే. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణలేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది. ఏం చూడాలి? అగుంబే చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి జలపాతం వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ జలపాతాల వద్ద చాలామంది పిక్నిక్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. * అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్‌సెట్ వ్యూపాయింట్ నుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది. * ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. * అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి. * ఇక్కడి చేరువలోనే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబేలో విహార యాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించుకోవచ్చు. * ఇక్కడి జీవవైవిధ్యాన్ని తిలకించాలనుకునే వారు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, కుద్రేముఖ్ జాతీయ పార్కులను తిలకించవచ్చు. ఈ రెండు చోట్ల రకరకాల వన్యప్రాణులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి. ఏం చేయాలి? * అగుంబేలోని ఎత్తయిన కొండలు పర్వతారోహకులకు సవాలుగా ఉంటాయి. సరదాగా ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే తరచు కురిసే వానల వల్ల నిత్యం తడిగా ఉండే ఈ కొండలపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది. * వాహనాల రద్దీ తక్కువగా ఉండే ఇక్కడి వీధులు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామ కాలక్షేపాలకు అనువుగా ఉంటాయి. * ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో వనవిహారాలకు వెళ్లవచ్చు. జలపాతాల వద్ద జలక్రీడలు ఆడవచ్చు. పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * అగుంబే చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడి రక్షాకవచ చేనేత సహకార పరిశ్రమలో స్థానిక చేనేత కళాకారులు నేసిన దుస్తులను సరసమైన ధరలకు కొనుక్కోవచ్చు. * ఇక్కడి బజారులోని చిన్న చిన్న దుకాణాల్లో వనమూలికలు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు కూడా చౌకగా దొరుకుతాయి. * అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల విరివిగా జలపాతాలు ఉండటంతో ఇక్కడి రెస్టారెంట్లలో దొరికే చేపల వంటకాలను ఆస్వాదించవచ్చు. ఎలా చేరుకోవాలి? * ఇక్కడకు దగ్గర్లోని రైల్వేస్టేషన్ ఉడిపిలో ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు ఉడిపి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. * ఉడిపి నుంచి అగుంబే వరకు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. * విమానాల్లో వచ్చేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు రావాల్సి ఉంటుంది.