అగుంబే... అద్భుతః | Tour Darshan to Cherrapunji of South | Sakshi

అగుంబే... అద్భుతః

Published Sun, Aug 21 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

అగుంబే... అద్భుతః

అగుంబే... అద్భుతః

నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి.

టూర్‌దర్శన్
నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి. అందుకే, కర్ణాటకలోని అగుంబేను ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమల్లో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రకృతి ప్రేమికులకు సాక్షాత్తు స్వర్గధామమే. నింగిని తాకే కొండలు, దట్టమైన అడవులతో నిండిన లోయలు, అడుగడుగునా తారసపడే జలపాతాలు... అద్భుతః అనిపిస్తాయి.

 
కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కిలోమీటర్ల చిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు మాత్రమే. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణలేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది.
 
ఏం చూడాలి?
అగుంబే చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి జలపాతం వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ జలపాతాల వద్ద చాలామంది పిక్నిక్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు.
* అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్‌సెట్ వ్యూపాయింట్ నుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది.
* ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
* అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
* ఇక్కడి చేరువలోనే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబేలో విహార యాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించుకోవచ్చు.
* ఇక్కడి జీవవైవిధ్యాన్ని తిలకించాలనుకునే వారు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, కుద్రేముఖ్ జాతీయ పార్కులను తిలకించవచ్చు. ఈ రెండు చోట్ల రకరకాల వన్యప్రాణులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి.
 
ఏం చేయాలి?
* అగుంబేలోని ఎత్తయిన కొండలు పర్వతారోహకులకు సవాలుగా ఉంటాయి. సరదాగా ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే తరచు కురిసే వానల వల్ల నిత్యం తడిగా ఉండే ఈ కొండలపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది.
* వాహనాల రద్దీ తక్కువగా ఉండే ఇక్కడి వీధులు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామ కాలక్షేపాలకు అనువుగా ఉంటాయి.
* ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో వనవిహారాలకు వెళ్లవచ్చు. జలపాతాల వద్ద జలక్రీడలు ఆడవచ్చు. పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు.
 
ఏం కొనాలి?
* అగుంబే చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడి రక్షాకవచ చేనేత సహకార పరిశ్రమలో స్థానిక చేనేత కళాకారులు నేసిన దుస్తులను సరసమైన ధరలకు కొనుక్కోవచ్చు.
* ఇక్కడి బజారులోని చిన్న చిన్న దుకాణాల్లో వనమూలికలు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు కూడా చౌకగా దొరుకుతాయి.
* అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల విరివిగా జలపాతాలు ఉండటంతో ఇక్కడి రెస్టారెంట్లలో దొరికే చేపల వంటకాలను ఆస్వాదించవచ్చు.
 
ఎలా చేరుకోవాలి?
* ఇక్కడకు దగ్గర్లోని రైల్వేస్టేషన్ ఉడిపిలో ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు ఉడిపి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు.
* ఉడిపి నుంచి అగుంబే వరకు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* విమానాల్లో వచ్చేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు రావాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement