Shimoga
-
కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం.. మోదీకి వ్యతిరేకం కాదు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ కార్యకర్త కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. తన కుమారుడు కేఈ కాంతేశ్‌కు హవేరీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్పపై ఈశ్వరప్ప మండిపడ్డారు. వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా, హిందుత్వ కోసం పోరాడతానని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. షిమోగా మద్దతుదారులతో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ పార్టీని, దాని సిద్ధాంతాలను కాపాడటానికి ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమైనట్లు, నరేంద్ర మోదీని మరో సారి ప్రధానిని చేసేందుకు నేను చేస్తున్న పోరాటమని ఈశ్వరప్ప అన్నారు. ప్రస్తుతం ఈ చర్యకు పూనుకోవడం వల్ల బీజేపీ తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది లేదా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నేను గెలిస్తే.. తప్పకుండా బీజేపీకి మద్దతు ఇస్తానని ఆయన అన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీ వై రాఘవేంద్ర మరోసారి షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తెలుస్తుంది. -
ఐదు నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే నవ్యశ్రీ..
శివమొగ్గ: వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5 క్రాస్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటి వద్ద తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కారు షెడ్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నవ్యశ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కర్ణాటకలో హిజాబ్ ఆందోళన: 58 మంది విద్యార్థుల సస్పెన్షన్
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. హిజాబ్ ఆందోళనలో పాల్గొన్న 58 మంది విద్యార్థులను శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు. అయితే తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హైకోర్టు సూచించింది. అయినప్పటికీ కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 58 మందిని సస్పెండ్ చేసింది. అలాగే హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిపై 144 సెక్షన్ ఉల్లంఘన కింద శివమొగ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..) మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫామ్ ధరించాలన్న గవర్నమెంట్ ఆర్డర్స్ రాజ్యాంగంలోని మత స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చకు వ్యతిరేకం కాదని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. -
కన్నబిడ్డలాంటి ఆమెపై అకృత్యం
శివమొగ్గ: భార్య చెల్లెలు.. పైగా మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. శివమొగ్గ జిల్లాలోని కుంసి పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటనలోకి వెళ్తే.. సదరు బాధితురాలు.. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఆ బాలికను.. కామంతో చూడడం మొదలుపెట్టాడు. భార్య కళ్లు గప్పి మాయమాటలు చెప్పి ఆ బాలికపై లైంగికవాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి గొడవ లేకుండా ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం పోలీసుల దృష్టికి రావడంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరె స్టు చేశారు కుంసి పోలీసులు. తీర్థహళ్లిలో మరో కేసు: తీర్థహళ్ళి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది. తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు. -
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా కర్ణాటకలో మంకీ ఫీవర్ మరోసారి కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది. -
దారుణం.. మూడున్నర రూపాయల కోసం
బెంగళూరు: వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. దేశాలు దాటి పోతున్న బడా బాబుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండే బ్యాంకులు.. రైతుల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా లేని రూల్స్ మాట్లాడతాయి. పాత బాకీ చెల్లించకపోతే.. కొత్తగా రుణం మంజూరు చేయవు. అప్పు వసూలు చేయడం కోసం నోటీసులు పంపడం.. చివరికి ఆస్తుల్ని వేలం వేయడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. కేవలం మూడున్నర రూపాయల(3రూపాయల 46 పైసలు) అప్పు తీర్చడం కోసం ఓ రైతును ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు బ్యాంకు అధికారులు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో జరిగింది. వివరాలు.. బారువే గ్రామానికి చెందిన అమాదే లక్ష్మీనారాయణ అనే రైతు వక్కలు పండిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సమీప పట్టణం నిత్తూరులో ఉన్న కెనరా బ్యాంక్‌లో రూ. 35 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రూ.32 వేలు మాఫీ అయ్యింది. మిగిలిన రూ.3 వేలు లక్ష్మీ నారాయణ చెల్లించాడు. రుణం మొత్తం తీరింది. మళ్ళీ అప్పు తీసుకోవచ్చు అనుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీ నారాయణకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అప్పు మొత్తం తీరలేదని వెంటనే బ్యాంక్‌కు రావాలని అధికారులు అతడికి ఫోన్ చేశారు. కంగారు పడిన లక్ష్మీ నారాయణ బ్యాంకుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన గ్రామానికి బస్సులు రావడం లేదు. దాంతో నడుచుకుంటూ 15కిలోమీటర్ల దూరానా ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లాకా బ్యాంకు అధికారి లక్ష్మీ నారాయణ పేరు మీద రూ. 3.46 పైసల అప్పు ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఈ మాత్రం అప్పు కోసం తనను ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బకాయి సొమ్ము చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎల్ పింగ్వా స్పందిస్తూ.. కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనే ఉద్దేశంతోనే బ్యాలెన్స్ రూ.3.46 పైసలు అడిగినట్లు తెలిపాడు. అయితే బ్యాంకు అధికారుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గర మాత్రమే కాక అందరి దగ్గర ఇలానే అప్పు వసూలు చేస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు. -
పాడుపడిన బావిని తవ్వితే..
బెంగళూరు : టిప్పు సుల్తాన్ భారతదేశ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి. ఆంగ్లేయులను గడగడలాడించిన ఈ యుద్ధ వీరునికి సంబంధించిన అరుదైన సంపద శిమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఒక పురాతన బావిలో వెలుగు చూసింది. క్రీస్తుశకం 18 వ శతాబ్దంలో మైసూర్ యుద్ధంలో వాడిన అరుదైన యుద్ధ సామగ్రి బయటపడింది. ఉప్పరివారు ఒక పురాతన బావిని తవ్వుతుండగా ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చినట్లు కర్ణాటక ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ విషయం గురించి ఆర్కియాలజి డిపార్ట్మెంట్ అధికారి ఆర్ రాజేశ్వర నాయక ఈ పురాతన బావి నుంచి గన్ పౌడర్ వాసన రావడంతో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ బావిలో ‘మైసురియన్ రాకెట్లు’గా ప్రసిద్ధి గాంచిన 1000 రాకెట్లు, గుళ్లు లభించాయి. వీటిని యుద్ధాలలో వినియోగించడం కోసం ఇక్కడ భద్రపరిచి ఉంటారు. ఈ రాకెట్ల పొడవు 23 - 26 సెంమీల పొడవు ఉన్నాయి. అంతేకాక ఇవి నెపోలియన్ చక్రవర్తి ఉపయోగించిన రాకెట్ల మాదిరిగానే ఉన్నాయి’ అని తెలిపారు. వీటిని వెలికి తీయడం కోసం 15 మంది ఆర్కియాలిజిస్ట్‌లు, పనివారు మూడు రోజుల పాటు శ్రమించారన్నారు. టిప్పు సుల్తాన్ 1799లో జరిగిన చివరి ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో వీర మరణం పొందారు. ఈ యుద్ధల సమయంలోనే టిప్పు సుల్తాన్ మైసూరియన్ రాకెట్లుగా ప్రసిద్ధి పొందిన ఈ ఆయుధాలను తయారు చేసి, వినియోగించేవారని చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. ఆర్కియాలజిస్టుల రికార్డుల ప్రకారం ప్రస్తుతం శిమొగ్గలో ఉన్న కోట టిప్పు సుల్తాన్ కాలానికి చెందినది. -
చికెన్ వండలేదని భార్యపై ఘాతుకం
శివమొగ్గ: చికెన్ వండటంలో ఆలస్యం చేసిందని ఆగ్రహిస్తూ ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్య చేయడానికి యత్నించిన ఘటన సోమవారం సాయంత్రం కర్ణాటక శివమొగ్గ నగరంలోని సోళేబైలూ లేఔట్లో ఉన్న ఈద్గా నగర్లో చోటు చేసుకుంది. బాధితురాలి ఇక్కడి మొగ్గాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తుంగా నగర పోలీసుల వివరాల మేరకు... సురేశ్, ఆశారాణి(33) దంపతులు నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన సురేశ్ సోమవారం సాయంత్రం చికెన్ తీసుకుని ఇంటికి వచ్చి కూర వండమని చెప్పి బయటకు వెళ్లాడు. కొద్దిసేపు అనంతరం ఇంటికి వచ్చాడు. భార్య చికెన్ వండకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సురేశ్ భార్యతో గొడవకు దిగాడు. చికెన్ వండకుండా ఏమీ చేస్తున్నావంటూ ఘర్షణ పడ్డాడు. ఆగ్రహంతో ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని భార్య గొంతుకోశాడు. దీంతో ఆశారాణి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కిందపడిపోయిన బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. -
అగుంబే... అద్భుతః
టూర్‌దర్శన్ నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి. అందుకే, కర్ణాటకలోని అగుంబేను ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమల్లో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రకృతి ప్రేమికులకు సాక్షాత్తు స్వర్గధామమే. నింగిని తాకే కొండలు, దట్టమైన అడవులతో నిండిన లోయలు, అడుగడుగునా తారసపడే జలపాతాలు... అద్భుతః అనిపిస్తాయి. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కిలోమీటర్ల చిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు మాత్రమే. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణలేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది. ఏం చూడాలి? అగుంబే చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి జలపాతం వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ జలపాతాల వద్ద చాలామంది పిక్నిక్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. * అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్‌సెట్ వ్యూపాయింట్ నుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది. * ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. * అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి. * ఇక్కడి చేరువలోనే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబేలో విహార యాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించుకోవచ్చు. * ఇక్కడి జీవవైవిధ్యాన్ని తిలకించాలనుకునే వారు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, కుద్రేముఖ్ జాతీయ పార్కులను తిలకించవచ్చు. ఈ రెండు చోట్ల రకరకాల వన్యప్రాణులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి. ఏం చేయాలి? * అగుంబేలోని ఎత్తయిన కొండలు పర్వతారోహకులకు సవాలుగా ఉంటాయి. సరదాగా ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే తరచు కురిసే వానల వల్ల నిత్యం తడిగా ఉండే ఈ కొండలపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది. * వాహనాల రద్దీ తక్కువగా ఉండే ఇక్కడి వీధులు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామ కాలక్షేపాలకు అనువుగా ఉంటాయి. * ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో వనవిహారాలకు వెళ్లవచ్చు. జలపాతాల వద్ద జలక్రీడలు ఆడవచ్చు. పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * అగుంబే చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడి రక్షాకవచ చేనేత సహకార పరిశ్రమలో స్థానిక చేనేత కళాకారులు నేసిన దుస్తులను సరసమైన ధరలకు కొనుక్కోవచ్చు. * ఇక్కడి బజారులోని చిన్న చిన్న దుకాణాల్లో వనమూలికలు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు కూడా చౌకగా దొరుకుతాయి. * అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల విరివిగా జలపాతాలు ఉండటంతో ఇక్కడి రెస్టారెంట్లలో దొరికే చేపల వంటకాలను ఆస్వాదించవచ్చు. ఎలా చేరుకోవాలి? * ఇక్కడకు దగ్గర్లోని రైల్వేస్టేషన్ ఉడిపిలో ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు ఉడిపి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. * ఉడిపి నుంచి అగుంబే వరకు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. * విమానాల్లో వచ్చేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు రావాల్సి ఉంటుంది. -
ఆరని చిచ్చు
శివమొగ్గలో అదుపులోకి రాని పరిస్థితి వైద్యుడిపై కత్తులతో దాడి మరో వ్యక్తి హత్య చుట్టుముట్టిన పోలీసు బలగాలు పరిస్థితిని పరిశీలించిన హోం మంత్రి మత పెద్దలతో చర్చలు జరిపిన కె.జె.జార్జ్ శివమొగ్గలో పరిస్థితి అదుపులోకి రాలేదు. రెండ్రోజుల క్రితం చెలరేగిన ఘర్షణలు మరింత ఉద్రిక్తతను నెలకొల్పాయి. నగరం మొత్తం పోలీసుల ఆధీనంలో ఉన్నా... మరో యువకుడి హత్య చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఎక్కడ చూసినా తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాలు, పండ్ల వ్యాపారుల పాకలు కాలుతునృ్న దశ్యాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొత్తం కంటి మీద కునుకు లేకుండా పోలీసులు పహారా కాసినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసుల ఎత్తుగడులను అసాంఘిక శక్తులు చిత్తు చేస్త్తూ విజృంభిస్తున్నాయి. స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. నగరం మొత్తం ఖాకీల మయమై ఉంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని బలగాలను రప్పిస్తున్నారు. శివమొగ్గ:శివమొగ్గలో ప్రశాంతత దూరమైంది. నగరంలో చెలరేగిన ఘర్షణలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గురువారం చెలరేగిన ఘర్షణల్లో మరణించిన విశ్వనాథ్ అంతిమ యాత్ర శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుండగులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసు లు తమ లాఠీలకు పనిచెప్పారు. నగరంలోని పలు ప్రాం తాల్లో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న తోపుడు బళ్లు, పాకలకు ఆగంతకులు నిప్పు పెట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో శనివారం మంటలు ఎగిసిపడ్డాయి. పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం బంద్‌కు విశ్వహిందూపరిషత్ పిలుపునిచ్చింది. కాగా, శుక్రవారం రాత్రి నగర శివారులోని తెవరచడ్నహళ్లి గ్రామంలో విధులు ముగించుకుని నగరానికి వస్తున్న పశువైద్యాధికారి జయకాంత్పై ముగ్గురు దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. వారి బారి నుంచి అతి కష్టంపై వైద్యుడు తప్పించుకుని చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. నగరంలోని టిప్పు నగర్లో ఉన్న పద్మా టా కీస్ వెనుక మంజునాథ్(35)ను కొందరు దారుణంగా కొట్టి హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం మృతదేహాన్ని గుర్తించి మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. హోం మంత్రి పర్యటన రెండ్రోజులుగా శివమొగ్గలో చోటు చేసుకుంటున్న అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రత్యేక హెలికాప్టర్లో నగరానికి శనివారం చేరుకున్నారు. నేరుగా ఆస్పత్రికి చేరుకుని హత్యకు గురైన మంజునాృ్ మతదేహాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. హోం మంత్రి వచ్చారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి కారును ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు అప్రమత్తమై గుంపును చెదరగొట్టారు. అనంతరం మతపెద్దలతో హోం మంత్రి సమావేశమయ్యారు. ఘర్షణల కారణంగా శివమొగ్గలో చోటు చేసుకున్న ఆస్తి నష్టానికి సంబంధించి రూ.50 లక్షల పరి హారాన్ని అందించనున్నట్లు మంత్రి కె.జె.జార్జ్ ప్రకటించారు. బీజేపీ ధర్నా శివమొగ్గలో అల్లర్లను అదుపు చేయడంలో పోలీసు ల వైఫల్యాన్ని నిరసిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డీసీఎం కె.ఎస్. ఈశ్వరప్ప, ఎంపీ అయనూరు మంజునాథ్ పాల్గొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయంటూ ఈ సందర్భంగా ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కారులతో ఏడీజీపీ అమర్‌కుమార్ పాండే చర్చించి ఆందోళనను విరమింపజేశారు. మరో వైపు నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది. పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. నగరం నిర్మానుష్యంగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు వాహనాలు లేక ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఎక్కడ చూసినా పోలీసులు మొహరించారు. నగరంలో ఏడీజీపీ అమర్‌కుమార్‌పాండే, ఐజీపీ నంజుండస్వామి, తుమకూరు ఎస్పీ రమణ్‌గుప్తా, హవేరి జిల్లా ఎస్పీ శశికుమార్, బీదర్ ఎస్పీ కార్తిక్‌రెడ్డి తదితరాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
‘లింగ’ చిత్రీకరణ అనుమతి రద్దు చేయండి
శివమొగ్గ :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదం రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతోంది. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వద్ద షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. మంగళవారం పర్యావరణ ప్రేమికుల ఒక్కూట ఆధ్వర్యంలో షూటింగ్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని అదనపు కలెక్టర్ నాగరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త నా.డిసౌజా మాట్లాడుతూ... ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగనమక్కి వద్ద లింగ షూటింగ్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. లింగనమక్కి డ్యాం సమస్యాత్మక ప్రదేశం కావడంతో పాటు పర్యాటకాన్ని పూర్తిగా నిషేధించారని, అదే విధంగా వీడియోలు, ఫొటోలు తీయడం నిషిద్ధమన్నారు. అలాంటి ప్రదేశంలో షూటింగ్ అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం లింగనమక్కి డ్యాం పరిసరాల్లో ఎటువంటి సినిమాలకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని డిసౌజా సలహా ఇచ్చారు. డ్యాం రక్షణ దృష్ట్యా నిబంధనలు పాటించాలని ప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఒక్కూట సంఘం నాయకులు పరిసర రమేశ్, డాక్టర్ శేఖర్ గౌళర్, అశోక్ యాదవ్, మహదేవ ప్ప, ఆన ంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
షిమోగాకు లింగా టీమ్
లింగా చిత్ర టీమ్ షిమోగాకు పయనం కానుందా? అవుననే అంటోంది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. రజనీకాంత్ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అనుష్క, ముంబాయి ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హాలు నాయకలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముత్తు, పడయప్పా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత రజనీకాంత్ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే మైసూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాల రూపకల్పన పూర్తి చేసుకుంటోంది. చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను షియోగాలో చిత్రీకరించాలని నిర్ణయించినట్టు యూనిట్ వర్గాల సమాచారం. ఈ నెల 18న రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హాలతో సహా యూనిట్ షిమోగా పయనం కానున్నట్లు తెలిసింది. అలాగే లింగా చిత్రం కోసం బ్రహ్మాండమైన శివుని శిలను ఒక డామ్ సెట్‌ను వేయనున్నట్లు సమాచారం. చిత్ర ఆడియోను దీపావళికి మార్కెట్లోకి విడుదల చేయూలని చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
యడ్యూరప్ప గెలుపు, స్పెషల్ మైసూర్ పాక్
శివమొగ్గ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, షిమోగా బీజపీ లోక్‌సభ అభ్యర్థి యడ్యూరప్ప 75వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాంతో ఆయన ఇంటిలో ప్రత్యేక తీపి పదార్థాలు పెద్ద ఎత్తున తయారు చేశారు. యడ్యూరప్ప గెలుపు ఖాయమని సర్వేలు తేల్చి చెప్పటంతో ఫలితాలు వెలువడక ముందే విజయోత్సహాలకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శికారిపురలోని యడ్యూరప్ప నివాసంలో స్పెషల్ మైసూర్ పాక్ తయారీ చేసినట్లు సమాచారం. ఫలితాలు వెలువడటంతో స్వీట్లను అభిమానులు, కార్యకర్తలకు అందచేసారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కూడా విజయోత్సవాలకు రంగం సిద్ధం చేశాయి. యడ్యూరప్ప గెలుపు వార్త విన్నవెంటనే కార్యకర్తలు పెద్త ఎత్తున బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. -
శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్
బెంగళూరు, శివమొగ్గ పార్లమెంటు స్థానం నుంచి జేడీఎస్ పార్టీ తరఫున ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేయడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కువూరస్వామి స్పష్టం చేశారు. నెలమంగళ సమీపంలోని మల్లాపురలో రాయల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవ సంబరాలకు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ...శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేస్తున్నారని తెలిపారు. కాగా చిక్కబళ్లాపుర పార్లమెంటు స్థానానికి అనితా కువ ూరస్వామి పోటీ చేయడంపై పార్టీలో చర్చించి మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక చిక్కబళ్లాపురలో వీరప్ప మొయిలీని ఓడించేందుకు మీరు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారటకదా అన్న విలేకరుల ప్రశ్నకు కుమారస్వామి సమాధానమిస్తూ....రాష్ట్రంలోని ఏ పార్లమెంటు స్థానంలోనూ ఏ పార్టీతోనూ తమ పార్టీ పొత్తుపెట్టుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాల్లోనూ జేడీఎస్ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. 24న గీతా శివరాజ్‌కుమార్ నామినేషన్ శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ తరఫున తన సహోదరి, నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేయనున్నారని జేడీఎస్ చీఫ్ విప్ మధు బంగారప్ప వెల్లడించారు. శివమొగ్గ జిల్లాలోని సొరబ తాలూకాలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మధు బంగారప్ప మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఇప్పటికే ఈ విషయంపై నటుడు శివరాజ్‌కుమార్‌తో చర్చించారని, గీతా రాజకీయ ప్రవేశానికి శివరాజ్‌కుమార్ అంగీకారం తెలిపారని చెప్పారు. ఈనెల 17న శివమొగ్గలో నిర్వహించే జేడీఎస్ బృహత్ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు మధు బంగారప్ప తెలిపారు. ఈనెల 24న గీతా శివరాజ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారని పేర్కొన్నారు. -
షిమోగా నుంచి లోక్ సభ బరిలో యాడ్యూరప్ప
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యాడ్యూరప్ప పోటీ చేసే లోక్ సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగో లోక్ సభ నియోజక వర్గం నుంచి యాడ్యూరప్ప బరిలోకి దిగనున్నారని తాజా జాబితాలో వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ శనివారం లోక్ సభ బరిలో దిగే 52 మంది అభ్యర్థులతోపాటు యాడ్యూరప్ప స్థానాన్ని కూడా ఖరారు చేస్తూ రెండో జాబితాను విడుదల చేసింది. యాడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక జనాతా పార్టీ(కేజేపీ)ని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు యాడ్యూరప్ప సేవలను బీజేపీ వినియోగించుకోనుంది. నరేంద్ర మోడీని నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి సొంత గూటికి వెళుతున్నట్లు యాడ్యూరప్ప గతంలో స్పష్టం చేసి.. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.