‘లింగ’ చిత్రీకరణ అనుమతి రద్దు చేయండి
శివమొగ్గ :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదం రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతోంది. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వద్ద షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. మంగళవారం పర్యావరణ ప్రేమికుల ఒక్కూట ఆధ్వర్యంలో షూటింగ్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని అదనపు కలెక్టర్ నాగరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త నా.డిసౌజా మాట్లాడుతూ... ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగనమక్కి వద్ద లింగ షూటింగ్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. లింగనమక్కి డ్యాం సమస్యాత్మక ప్రదేశం కావడంతో పాటు పర్యాటకాన్ని పూర్తిగా నిషేధించారని, అదే విధంగా వీడియోలు, ఫొటోలు తీయడం నిషిద్ధమన్నారు. అలాంటి ప్రదేశంలో షూటింగ్ అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం లింగనమక్కి డ్యాం పరిసరాల్లో ఎటువంటి సినిమాలకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని డిసౌజా సలహా ఇచ్చారు. డ్యాం రక్షణ దృష్ట్యా నిబంధనలు పాటించాలని ప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఒక్కూట సంఘం నాయకులు పరిసర రమేశ్, డాక్టర్ శేఖర్ గౌళర్, అశోక్ యాదవ్, మహదేవ ప్ప, ఆన ంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.