Tour Packages
-
ఆదాయం బాటలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, కొవ్వూరు: నష్టాలను అధిగమించి అదనపు ఆదాయ ఆర్జనపై ఆర్టీసీ దృష్టి సారించింది. కార్గో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజిలు ప్రవేశపెట్టడం, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆదాయం సమకూరే ఏమార్గాన్నీ వీడకుండా సంస్థ అధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా విపత్తులో 50 నుంచి 60 శాతం మేర సంస్థ ఆదాయం కోల్పోయింది. కరోనా సద్దుమణిగాక కొన్నాళ్లుగా పూర్వపు పరిస్థితిని సంతరించుకోగలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు,గోకవరంలలో సంస్థకు డిపోలున్నాయి. వీటి పరిధిలో 56 రూట్లలో 301 బస్సులు నడుస్తున్నాయి. కార్గో సేవలతో ఊపు ఆర్టీసీకి కార్గో సేవలు బాగా కలిసొస్తున్నాయి. ఈ సేవల ద్వారా సంస్థకు విశేష ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్గో సేవల ఆదాయం విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.8.90 కోట్ల మేరకు ఆదాయం ఆర్జించింది. ఈనెలాఖరుకు రూ.9.50 కోట్ల మేర సగటు ఆదాయం లభించనుందని అధికారులు లెక్కగట్టారు. 2016 జూన్ నుంచి కార్గో సేవలు ప్రారంభమమైనా ఆరంభంలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సరైన ప్రొత్సాహం..ప్రణాలిక లేకపోవడం ఇందుకు కారణం. టీడీపీ హయాంలో 2018–19లో కేవలం రూ.3.30 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. ఇప్పుడు దానికి రెండు రెట్లు మించి ఆదాయం పెరిగింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ లక్కీ కూపన్ల విధానం ప్రవేశపెట్టింది. నెలనెలా డ్రా తీస్తోంది. విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తోంది. పంచభూత లింగదర్శిని పేరుతో కంచి, చిదంబరం, జంబుకేశ్వరం,అరుణాచలం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. త్రివైకుంఠ దర్శిని పేరుతో భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం క్షేత్రాలకు ప్యాకేజి తరహాలో బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నవజనార్ధన పారిజాతాలుగా గుర్తింపు పొందిన తొమ్మిది క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్ర బస్సు నడుతుతోంది. కార్తికమాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలై, విజయవాడలకూ బస్సులు నడపుతూ ఆదాయం పెంచుకుంటోంది. సుమారు 50 మంది ముందుకు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2018–19లో ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.156.23 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.197 కోట్ల వరకు ఆదాయం రానుందని అంచనా. ఇతర ఆదాయ వనరుల ద్వారా.. అవకాశమున్న ఏ ఆదాయ వనరునూ ఆర్టీసీ విడిచిపెట్టడం లేదు. డిపోల్లోని సైకిల్ స్టాండ్లు, దుకాణాల అద్ధెలతో పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా ఆదాయం పెంచుకుంటోంది. 2018–19లో నాలుగు డిపోలకు ఇతర మార్గాల ద్వారా రూ.34.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.38.83కోట్లు ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి.. మార్చి నెలల ఆదాయం కూడా అంచనా వేసుకుంటే సుమారు రూ.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2018–19లో నిడదవోలు డిపోకు ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.2.40 కోట్లు వస్తే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3.51 కోట్లకు చేరుకుంది. అలాగే రాజమహేంద్రవరంలో రూ.20.22 కోట్ల నుంచి రూ.25.55 కోట్లకు, కొవ్వూరు డిపోలో రూ.3.86 కోట్ల నుంచి రూ.5.37కోట్లకు రాబడి సాధించింది. -
ఐఆర్సీటీసీ భారత్ దర్శన్; గంగా రామాయణ్ యాత్ర
గంగా రామాయణ్ యాత్ర (SHA10A). ఇది ఐఆర్సీటీసీ భారత్ దర్శన్‌లో భాగంగా ఏప్రిల్‌లో నిర్వహిస్తున్న టూర్ ప్యాకేజ్. ఈ ఐదు రోజుల (నాలుగు రాత్రులు) పర్యటన... ఏప్రిల్ ఏడవ తేదీన మొదలై పదకొండవ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అయోధ్య, లక్నో, నైమిశారణ్యం, ప్రయాగరాజ్(అలహాబాద్), వారణాసిలను చూడవచ్చు. సింగిల్ ఆక్యుపెన్సీ 30,200 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 24,700 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23, 550 రూపాయలవుతుంది. ► ఏప్రిల్ ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు హైదరాబాద్‌లో బయలుదేరిన ఇండిగో విమానం పది గంటల యాభై నిమిషాలకు వారణాసికి చేరుతుంది. వారణాసి ఎయిర్‌పోర్టులో రైల్వే టూర్ సిబ్బంది పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. చెక్ ఇన్ అయిన తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, గంగాతీరం సందర్శనం ఉంటాయి ► ఎనిమిదవ తేదీ తెల్లవారు జామున విశ్వనాథుని దర్శనం తర్వాత గదికి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి గదిని చెక్ అవుట్ చేయాలి. ప్రయాణం ప్రయాగరాజ్ వైపు సాగుతుంది. త్రివేణి సంగమం, అలోపీ దేవి దర్శనం తర్వాత హోటల్‌కు చేరడం, ఆ రాత్రి బస ప్రయాగ్‌రాజ్‌లోనే ► తొమ్మిదవ తేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి శృంగవర్‌పూర్‌ను చూసుకుంటూ ప్రయాణం అయోధ్య వైపు సాగుతుంది. ఆ రోజు అయోధ్యలోని పర్యాటక ప్రదేశాలను చూసి రాత్రి బస చేయాలి ► పదవతేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి నైమిశారణ్యం వైపు సాగిపోవాలి. స్థానిక ఆలయాలను చూసుకుంటూ సాయంత్రానికి లక్నో చేరుస్తారు. ఆ రాత్రి లక్నోలో బస ► పదకొండవ తేదీ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి బారా ఇమాంబారా సందర్శనం తర్వాత అంబేద్కర్ మెమోరియల్ పార్క్ చూపించి ఏడు గంటలకు ఎయిర్‌పోర్టులో దించుతారు. ఏడు గంటల పది నిమిషాలకు లక్నోలో బయలుదేరిన ఇండిగో విమానం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ చేరడంతో గంగా రామాయణ యాత్ర పూర్తవుతుంది. ప్యాకేజ్‌లో... విమానం టికెట్లు, హోటళ్లలో నాలుగు రాత్రుల బస, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. సైట్ సీయింగ్‌కి ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సర్వీస్ ఉంటాయి. -
ఫలితాలు రాకముందే క్యాంపు రాజకీయాలు
-
గో.. గోవా, దుబాయ్, శ్రీలంక
సాక్షి, హైదరాబాద్ : కొత్త ప్రదేశాలు చూసొద్దామనుకునేవారికి, సెలవులు ఎంజాయ్ చేద్దామనుకునేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తీపి కబురు మోసుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలోని ప్రాంతాలకు మాత్రమే అందిస్తోన్న టూరిజం ప్యాకేజీలను ఈసారి విదేశాలకు అందుబాటులోకి తెచ్చింది. దేశంతోపాటు శ్రీలంక, దుబాయ్ వంటి విదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం సరికొత్త టూరిజం ప్యాకేజీలు తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. విమాన టికెట్లతోపాటు, విదేశాల్లో వసతి తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీల వివరాలు ఇలా.. చలో గోవా..! హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే వారికి ఈ ప్యాకేజీ సౌకర్యంగా ఉంటుంది. 3 రాత్రులు, 4 పగళ్లకు టూర్ ఉంటుంది. విమాన టికెట్లు, ఏసీ ట్రాన్స్పోర్ట్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, మిరామర్ బీచ్, ఓల్డ్ గోవా చర్చి, మంగేశి టెంపుల్, డోనా పౌలా బీచ్, మండోవి నదిలో క్రూజ్‌లో ప్రయాణం ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తారు. నవంబర్ 11న ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.17,609 వసూలు చేస్తారు. దుబాయ్‌లో దూమ్ధామ్..! కొంతకాలంగా మన దేశం నుంచి దుబాయ్‌కు పర్యాటకులు పెరిగారు. ఇలాంటి వారికోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. 4 రాత్రులు, 5 పగళ్లకు ఈ ప్యాకేజీని రూపొందించింది. డో క్రూజ్‌లో డిన్నర్, రోజంతా దుబాయ్ పట్టణ విహారం, మిరాకిల్ గార్డెన్, బుర్జ్ ఖలీఫా, గ్లోబల్ విలేజ్, ఎడారి ప్రయాణం–బెల్లీడాన్స్, త్రీస్టార్ హోటల్ వసతి, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంగ్లిష్ మాట్లాడే గైడ్ వంటి సదుపాయాలు ఉంటాయి. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే ఈ యాత్రకు హైదరాబాద్ నుంచి విమానం ఉంటుంది. ఒక్కో యాత్రికుడికి రూ.61,285 వసూలు చేస్తారు. శ్రీలంకనూ చూసొద్దాం... శ్రీలంకలోని శాంకరీ శక్తి పీఠాలతోపాటు ప్రముఖ స్థలాలను చూపించే రామాయణ యాత్ర ప్యాకేజీ ఇది. 4 రాత్రులు, 5 పగళ్లకు కలిపి ప్యాకేజీని రూపొందించారు. కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువారా ఇలియా తదితర నగరాల సందర్శన ఉంటుంది. శాంకరీ శక్తి పీఠం, మనవారీ టెంపుల్, లక్ష్మీనారాయణ ఆలయం, రాంబోడ హనుమాన్ ఆలయం తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. డిసెంబర్ 7న మొదలయ్యే ఈ యాత్ర కోసం ఒక్కరికి రూ.47,540గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయం, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లలో సంప్రదించవచ్చు. -
జాలీ.. జాలీ జర్నీ!
* ఐఆర్సీటీసీ బెజవాడ డివిజన్ అసిస్టెంట్ మేనేజర్ మధుసూదనరావు వెల్లడి * రైల్వే శాఖ ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలు * ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం ఒంగోలు: ప్రకృతి అందాలు.. దర్శనీయ క్షేత్రాలకు వెళ్లాలనుకొనేవారికి ఇది శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక యాత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో శనివారం బెజవాడ రైల్వేడివిజన్ ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ కే మధుసూదనరావు విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీలు సరికొత్తవని చెప్పారు. వివిధ దర్శనీయ క్షేత్రాలను తక్కువ ఖర్చుతో చూడవచ్చన్నారు. పూర్తి వివరాలకోసం ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ (ఫోన్ 97013 60620) లేదా గుంటూరు స్టేషన్ ఐఆర్సీటీసీ అధికారి గురవారెడ్డి (ఫోన్ నంబర్ 9701360628)లను సంప్రదించవచ్చని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెరల్ ఆఫ్ ది ఓరియంట్ గోవాతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో పర్యటించేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. సౌత్‌గోవా, నార్త్గోవాలోని బీచ్‌లు, చర్చిలు, దేవాలయాలు చూడవచ్చు. స్లీపరు తరగతిలో ప్రయాణం చేస్తూ పర్యాటక ప్రదేశాల్లో ఆహారం తీసుకోవచ్చు. నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం, వసతి, గైడు, ప్రమాద బీమా కల్పించారు. 17016 ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రత్యేక బోగీ ఈనెల 19న కాచిగూడ నుంచి బయల్దేరి మహబూబ్‌నగర్-కర్నూలు-డోన్-గుంతకల్లు-బళ్లారి మీదుగా గోవాకు చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24వ తేదీ ఉదయం 5 గంటలకు కాచి గూడకు వస్తుంది. ఒక్కో టికెట్ ధర రూ. 10669గా చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఒడిస్సా సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్-పరి-చిల్కా-ధౌళి-లింగరాజ్-పిల్పి- రఘురాజ్‌పూర్-కోనార్క్- చంద్రభాగ-భువనేశ్వర్ మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకునే విధంగాఈ యాత్ర ఉంటుంది. ఒక్కో టికెట్ ధర రూ. 9675. స్లీపర్ తరగతిలో రిజర్వు చేస్తారు. పర్యాటక ప్రాంతాల్లో భోజన సదుపాయం, నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం, వసతి, గైడు, ప్రయాణాన్ని బట్టి రూ. 1 నుంచి 3 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17016)లో ప్రత్యేక బోగీలో సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 29వ తేదీ సికింద్రాబాద్‌లో బయల్దేరి నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్‌కు చేరుకుంటుంది. వచ్చే నెల 5వ తేదీన ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. శబరిమలై (నాలుగు రాత్రులు, అయిదు పగళ్లు) ఈ నెల 15వ తేదీ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో 15 స్లీపర్ క్లాస్, 6 థర్డ్ ఏసీ బెర్త్‌లను యాత్రికుల కోసం కేటాయించారు. ప్రతి శనివారం స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక కోచ్ శబరిమలై వెళుతుంది. 40 నుంచి 50 మంది ప్రత్యేక బోగీ కావాలని కోరుకుంటే ఏర్పాటు చేస్తారు. వీరికి కూడా వసతి, భోజన సదుపాయం, గైడు, ప్రమాదబీమా ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ. 4178, ఏసీ టికెట్ ధర రూ. 6698గా నిర్ణయించారు.