జాలీ.. జాలీ జర్నీ!
* ఐఆర్‌సీటీసీ బెజవాడ డివిజన్ అసిస్టెంట్ మేనేజర్ మధుసూదనరావు వెల్లడి
* రైల్వే శాఖ ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలు
* ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ సౌకర్యం
ఒంగోలు: ప్రకృతి అందాలు.. దర్శనీయ క్షేత్రాలకు వెళ్లాలనుకొనేవారికి ఇది శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక యాత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో శనివారం బెజవాడ రైల్వేడివిజన్ ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ కే మధుసూదనరావు విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీలు సరికొత్తవని చెప్పారు.
వివిధ దర్శనీయ క్షేత్రాలను తక్కువ ఖర్చుతో చూడవచ్చన్నారు. పూర్తి వివరాలకోసం ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ (ఫోన్ 97013 60620) లేదా గుంటూరు స్టేషన్ ఐఆర్‌సీటీసీ అధికారి గురవారెడ్డి (ఫోన్ నంబర్ 9701360628)లను సంప్రదించవచ్చని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెరల్ ఆఫ్ ది ఓరియంట్
గోవాతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో పర్యటించేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. సౌత్‌గోవా, నార్త్‌గోవాలోని బీచ్‌లు, చర్చిలు, దేవాలయాలు చూడవచ్చు. స్లీపరు తరగతిలో ప్రయాణం చేస్తూ పర్యాటక ప్రదేశాల్లో ఆహారం తీసుకోవచ్చు. నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం, వసతి, గైడు, ప్రమాద బీమా కల్పించారు. 17016 ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రత్యేక బోగీ ఈనెల 19న కాచిగూడ నుంచి బయల్దేరి మహబూబ్‌నగర్-కర్నూలు-డోన్-గుంతకల్లు-బళ్లారి మీదుగా గోవాకు చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24వ తేదీ ఉదయం 5 గంటలకు కాచి గూడకు వస్తుంది. ఒక్కో టికెట్ ధర రూ. 10669గా చేశారు.
గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఒడిస్సా
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్-పరి-చిల్కా-ధౌళి-లింగరాజ్-పిల్పి- రఘురాజ్‌పూర్-కోనార్క్- చంద్రభాగ-భువనేశ్వర్ మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకునే విధంగాఈ యాత్ర ఉంటుంది. ఒక్కో టికెట్ ధర రూ. 9675. స్లీపర్ తరగతిలో రిజర్వు చేస్తారు. పర్యాటక ప్రాంతాల్లో భోజన సదుపాయం, నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం, వసతి, గైడు, ప్రయాణాన్ని బట్టి రూ. 1 నుంచి 3 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17016)లో ప్రత్యేక బోగీలో సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 29వ తేదీ సికింద్రాబాద్‌లో బయల్దేరి నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్‌కు చేరుకుంటుంది. వచ్చే నెల 5వ తేదీన ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
శబరిమలై (నాలుగు రాత్రులు, అయిదు పగళ్లు)
ఈ నెల 15వ తేదీ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో 15 స్లీపర్ క్లాస్, 6 థర్డ్ ఏసీ బెర్త్‌లను యాత్రికుల కోసం కేటాయించారు. ప్రతి శనివారం స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక కోచ్ శబరిమలై వెళుతుంది. 40 నుంచి 50 మంది ప్రత్యేక బోగీ కావాలని కోరుకుంటే ఏర్పాటు చేస్తారు. వీరికి కూడా వసతి, భోజన సదుపాయం, గైడు, ప్రమాదబీమా ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ. 4178, ఏసీ టికెట్ ధర రూ. 6698గా నిర్ణయించారు.