Indian Railway Catering and Tourism Corporation
-
IRCTC scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి: సీబీఐ
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. ‘తేజస్వీ యాదవ్ సాదాసీదా వ్యక్తి కాదు. బాగా పలుకుబడి కలిగిన వాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులను దూషిస్తూ, బెదిరిస్తూ బహిరంగ హెచ్చరికలు చేశారు. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు’ అని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. కోర్టులను కూడా తక్కువ చేస్తూ ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారని తెలిపింది. దీనిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ శనివారం తేజస్వీ యాదవ్‌కు నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు. రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలపై నమోదైన కేసులో యాదవ్‌కు 2018 అక్టోబర్‌లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!
న్యూఢిల్లీ: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ప్రయాణికుల డేటాపై దృష్టి సారించింది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలకు ఈ డేటాను అందించే వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల వరకూ ఆదాయం సమకూర్చుకోవచ్చని (మానిటైజేషన్) అంచనా వేస్తోంది. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సర్వీసులను మరింత మెరుగుపర్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు విధి విధానాలను రూపొందించడానికి కన్సల్టెంట్ సర్వీసులను ఐఆర్సీటీసీ వినియోగించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెండరు ప్రకటన జారీ చేసింది. ఆతిథ్య, ఇంధన, మౌలిక, వైద్య తదితర రంగాల సంస్థలకు ఈ తరహా డేటా ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నట్లు టెండరు ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు ట్రావెల్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ఆయా సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు వివరాలను పంపే అవకాశముంది. ‘‘భారతీయ రైల్వేస్ తన కస్టమర్/వెండార్ యాప్‌లు, అంతర్గత యాప్‌లలో ఉండే డేటాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హోటల్, ట్రావెల్, బీమా, వైద్యం, ఏవియేషన్ తదితర విభాగాల సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా మానిటైజ్ చేయదల్చుకుంది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని .. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సేవలను మరింత మెరుగుపర్చవచ్చని భావిస్తోంది’’ అని వివరించింది. దీనికోసం ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ .. వినియోగదారు డేటాను ఈ విధంగా ఉపయోగించుకోవడంలో గోప్యతా నిబంధనలపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించవచ్చనే అంశంపై తగు సూచనలు చేయాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీ విషయంలో చట్టాలు, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అమలు చేసేందుకు నిబంధనలను క్షుణ్నంగా అధ్యయం చేయా ల్సి ఉంటుంది. ప్రయాణికులు, రవాణా సేవలు ఉపయోగించుకునే కస్టమర్లు మొదలైన వర్గాల ప్రాథమిక డేటాను విశ్లేషించాలి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అయితే దీన్ని అమలు చేయాలంటూ రైల్వే బోర్డు నుంచి ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవసీకి రిస్కులపై సందేహాలు... ప్రయాణికుల వ్యక్తిగత డేటాను ఇలా ఎవరికిపడితే వారికి ఇవ్వడమనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయ్యే అవకాశాలు ఉన్నా యని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అమోల్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాధారణంగా డేటాను క్రోడీకరించి, ఏ వివరాలు ఎవరివి అనేది బైటపడకుండా గోప్యంగాను, భద్రంగానూ ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, గోప్యనీయతను పాటించకుండా ఐఆర్సీటీసీ గానీ ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు డేటాను ఇచ్చిన పక్షంలో ప్రైవసీ హక్కులకు భంగం కలగడంతో పాటు సదరు డేటా దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు. అయితే, ఇలా డేటాను షేర్ చేసుకోవడం అక్రమం అనేందుకు తగిన చట్టాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డేటాను షేర్ చేసుకుంటే దాన్ని తాను భద్రంగా ఉంచడంతో పాటు థర్డ్ పార్టీలు కూడా పటిష్టమైన ప్రమణాలు పాటించేలా ఐఆర్సీటీసీ చూడాల్సి ఉంటుందని కులకర్ణి చెప్పారు. రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు.. రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు ఏకైక మార్గంగా ఈ విషయంలో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫాం ద్వారా 43 కోట్ల పైచిలుకు టికెట్లు బుక్ అయ్యాయి. రోజువారీ దాదాపు 63 లక్షల లాగిన్స్ నమోదయ్యాయి. 8 కోట్ల మంది పైగా యూజర్లు ఐఆర్సీటీసీ ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 46 శాతం వాటా మొబైల్ యాప్‌దే ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర భారీ స్థాయిలో ప్రయాణికుల డేటా ఉంటోంది. -
తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి సీజన్లో పర్యాటకులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్( ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–అరకు–విశాఖపట్నం (రైల్ కం రోడ్ ప్యాకేజీ): ఈ టూర్ ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ(ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, థింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరుతారు. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలను చూపించి తిరిగి అరకు నుంచి రోడ్ మార్గం ద్వారా అదేరోజు రాత్రి విశాఖపట్నం చేరుస్తారు. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలు విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్ కోచ్‌లో వెళ్లాలనుకుంటే పెద్దలకు రూ.3,060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ కోచ్ అయితే పెద్దలకు రూ.2,385, పిల్లలకు రూ.2,015, సెకండ్ సిటింగ్ పెద్దలకు రూ.2,185, పిల్లలకు రూ.1,815(ఈ చార్జీలు సైట్‌సీయింగ్, రానుపోను ప్రయాణఖర్చులు, అల్పాహారం, మ«ధ్యాహ్నం భోజనం, సాయంత్రం హై టీ, బోర్రా ప్రవేశచార్జీలు, అన్ని పన్నులు కలుపుకుని) తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. థర్డ్ ఏసీ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.17,860, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 11,720, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.10,495, స్లీపర్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.15,765, డబుల్ ఆక్యుపెన్సీ రూ.9,625, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.9,400.. వసతి, రవాణా, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం చార్జీలు, కాణిపాకం, తిరుచానూర్ టికెట్ చార్జీలు, టోల్ గేట్స్, పార్కింగ్, జీఎస్టీ వంటి అన్ని చార్జీలతో కలిపి ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నెంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 0891–2500695, 8287932318 నెంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. (చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలే టార్గెట్) -
ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్. విమానంలో ఉన్న మాదిరి సౌకర్యాలు ఉండే ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలు కచ్చితత్వం విషయంలో ప్రయోగాత్మకంగా ఓ నిబంధన విధించారు. రైలు నిర్దేశించిన సమయానికి వెళ్లకపోతే ఎంత ఆలస్యమైతే అంత పరిహారం చెల్లిస్తామని భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించడంతో దానికి సంబంధించిన పరిహారం ప్రయాణికులకు అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఎప్పుడూ చార్జీల వసూళ్లు చేయడమే తప్పా పరిహారం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ శని, ఆదివారం (ఆగస్ట్ 21, 22)లో రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. ఆలస్యంగా ప్రయాణించడంతో రైలులో ప్రయాణించిన వారికి రూ.నాలుగున్నర లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం 2,035 మంది ప్రయాణికులకు పరిహారం అందించనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సిగ్నల్ ఫెయిల్ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రెండున్నర గంటలు ఆలస్యంగా రైలు చేరింది. ఆదివారం కూడా గంట ఆలస్యమైంది. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. దీంతో గంట ఆలస్యమైన వారికి రూ.100 చొప్పున, రెండున్నర గంటలు ఆలస్యమైన వారికి రూ.250 చెల్లించనుంది. మొత్తం రూ.4,49,600 పరిహారం ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అందించనుంది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనల మేరకు రైలు గంట ఆలస్యమైతే రూ.వంద చెల్లించాలనే నిబంధన ఉందని, ఆ మేరకు తాజాగా ఆలస్యమైన వారికి అంతే చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
జోరుగా ఐఆర్సీటీసీ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓఎఫ్‌ఎస్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీలో 20 శాతం వాటాను ఆఫర్ ఫర్‌సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తోంది. గురువారం ఇష్యూ మొదలైన రోజునే ఈ ఓఎఫ్ఎస్ 1.98 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు (శుక్రవారం) రిటైల్ ఇన్వెస్టర్లు తమ బిడ్లను దాఖలు చేసుకోవచ్చు. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ధరను రూ.1,367గా కంపెనీ నిర్ణయించింది. రూ.4,374 కోట్ల నిధులు.... ఓఎఫ్ఎస్లో భాగంగా 15% వాటాకు సమానమైన 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. అదనంగా సబ్‌స్క్రైబ్ కావడంతో మరో 5% వాటా(80 లక్షల షేర్లను) గ్రీన్ షూ ఆప్షన్(అదనంగా బిడ్లు వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు)గా అట్టేపెట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,374 కోట్లు సమకూరుతాయని అంచనా. ప్రస్తుతం ఐఆర్సీటీసీలో కేంద్ర ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ నిబంధనలను పాటించాలంటే ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంటుంది. భారత రైల్వేలకు ఐఆర్సీటీసీ కంపెనీ కేటరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను విక్రయిస్తోంది. ఈ కంపెనీ 2019, అక్టోబర్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.645 కోట్లు సమీకరించింది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 10 శాతం నష్టంతో రూ.1,452 వద్ద ముగిసింది. -
ఉపవాసం చేసే వారికోసం ప్రత్యేక ఆహారం
న్యూఢిల్లీ: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న రైలు ప్రయాణికుల కోసం ‘వ్రత్ కా ఖానా’ పేరిట కొత్త మెనూ సిద్ధంచేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్(ఐఆర్సీటీసీ) తెలిపింది. సాత్వికాహారం అయిన సగ్గుబియ్యం, సైంధవ లవణం, కూరగాయాలతో తయారుచేసిన ఆహారపదార్ధాలను రైల్వే మెనూలో అక్టోబర్ 10 నుంచి 18వ తేదీవరకు రైళ్లలో అందిస్తామని ఐఆర్సీటీసీ వెల్లడించింది. రైళ్లో భోజనం కోసం ఉపవాస దీక్షలో ఉన్న వారు ఇబ్బందిపడకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అని తెలిపింది. సగ్గుబియ్యం కిచిడి, లస్సీ, తాలి, ఫ్రూట్ చాట్స్‌లనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. జర్నీ మొదలవడానికి రెండు గంటలముందుగా పీఎన్ఆర్ నంబర్ సాయంతో కొత్త మెనూలోని ఆయా ఆహారపదార్ధాలను ఠీఠీఠీ.్ఛఛ్చ్టి్ఛటజీnజ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn ద్వారా ఆర్డర్ చేయొచ్చని తెలిపింది. -
చలో... లంకను చూసొద్దాం!
శ్రీలంక పర్యటనకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ జూన్ 4 నుంచి 8 వరకు షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: వేసవి సందర్భంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) మరో విదేశీ పర్యటనకు ప్యాకేజీని సిద్ధం చేసింది. శ్రీలంకలోని పలు ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రణాళికను రూపొందించింది. గతంలో ఏర్పాటు చేసిన థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, దుబాయ్ పర్యటనలు విజయవంతం కావడంతో తాజాగా శ్రీలంక యాత్రకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. శాంకరీదేవి శక్తిపీఠ్ సందర్శనతోపాటు, ఈ పర్యటనలో పలు దేవాలయాల సందర్శన ఉంటుంది. జూన్ 4వ తేదీ ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం ఎస్జీ-1042 విమానంలో బయలుదేరి 11.45 గంటలకు మదురై చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్జీ-3 విమానంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 1.50 గంటలకు కొలంబో చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం జూన్ 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎస్జీ-4 విమానంలో కొలంబో నుంచి బయలుదేరి 2.55 గంటలకు మదురై చేరుకుంటారు. అదేరోజు సాయంత్రం 4.10 గంటలకు మదురై నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. సందర్శనీయ స్థలాలు... ఈ పర్యటనలో పూంచి కటార్గమా టెంపుల్, మనవారి టెంపుల్, మున్నేశ్వరం, ట్రింకోమలి, శాంకరీదేవి (పాత, కొత్త శక్తిపీఠం)ఆలయం, నిలవేలి బీచ్, లక్ష్మీనారాయణ టెంపుల్, కణ్ణయ వేడినీటి ప్రదేశం, సిగారియారాక్ డ్రైవ్, కాండి సిటీటూర్, కల్చరల్ షో, టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్, టీ ఫ్యాక్టరీ, రాంబోడ హనుమాన్ టెంపుల్, గాయత్రీపీఠం, సీత అమ్మాన్ టెంపుల్, అశోక టెంపుల్, కొలంబో సిటీటూర్ తదితర ప్రాంతాలు ఈ పర్యటనలో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ఐఆర్‌సీటీసీయే అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. త్రీస్టార్ హోటల్లో బస, ఏసీ సదుపాయంతో కూడిన వాహనాల్లో రోడ్డు రవాణా, గైడ్స్, భద్రతా సిబ్బంది, ఇండియన్ రెస్టారెంట్లలో భోజన సదుపాయం, వీసా చార్జీలు, ట్రావెలింగ్ బీమా, పర్యటనలో భాగంగా మినరల్వాటర్తో సహా అన్ని సదుపాయాలను కల్పిస్తారు. చార్జీలు... హైదరాబాద్-శ్రీలంక పర్యటన చార్జీ ఒక్కొక్కరికి రూ.43,836 చొప్పున ఉంటుంది. అన్ని సదుపాయాలతో కలిపి ఈ చార్జీని నిర్ణయించారు. ఈ పర్యటనకు సంబంధించిన బుకింగ్, ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్లు 040-2770 2407,040-2380 0580, 97013 60605 నంబర్లలో సంప్రదించవచ్చు. -
జాలీ.. జాలీ జర్నీ!
* ఐఆర్సీటీసీ బెజవాడ డివిజన్ అసిస్టెంట్ మేనేజర్ మధుసూదనరావు వెల్లడి * రైల్వే శాఖ ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలు * ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం ఒంగోలు: ప్రకృతి అందాలు.. దర్శనీయ క్షేత్రాలకు వెళ్లాలనుకొనేవారికి ఇది శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక యాత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో శనివారం బెజవాడ రైల్వేడివిజన్ ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ కే మధుసూదనరావు విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీలు సరికొత్తవని చెప్పారు. వివిధ దర్శనీయ క్షేత్రాలను తక్కువ ఖర్చుతో చూడవచ్చన్నారు. పూర్తి వివరాలకోసం ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ (ఫోన్ 97013 60620) లేదా గుంటూరు స్టేషన్ ఐఆర్సీటీసీ అధికారి గురవారెడ్డి (ఫోన్ నంబర్ 9701360628)లను సంప్రదించవచ్చని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెరల్ ఆఫ్ ది ఓరియంట్ గోవాతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో పర్యటించేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. సౌత్‌గోవా, నార్త్గోవాలోని బీచ్‌లు, చర్చిలు, దేవాలయాలు చూడవచ్చు. స్లీపరు తరగతిలో ప్రయాణం చేస్తూ పర్యాటక ప్రదేశాల్లో ఆహారం తీసుకోవచ్చు. నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం, వసతి, గైడు, ప్రమాద బీమా కల్పించారు. 17016 ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రత్యేక బోగీ ఈనెల 19న కాచిగూడ నుంచి బయల్దేరి మహబూబ్‌నగర్-కర్నూలు-డోన్-గుంతకల్లు-బళ్లారి మీదుగా గోవాకు చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24వ తేదీ ఉదయం 5 గంటలకు కాచి గూడకు వస్తుంది. ఒక్కో టికెట్ ధర రూ. 10669గా చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఒడిస్సా సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్-పరి-చిల్కా-ధౌళి-లింగరాజ్-పిల్పి- రఘురాజ్‌పూర్-కోనార్క్- చంద్రభాగ-భువనేశ్వర్ మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకునే విధంగాఈ యాత్ర ఉంటుంది. ఒక్కో టికెట్ ధర రూ. 9675. స్లీపర్ తరగతిలో రిజర్వు చేస్తారు. పర్యాటక ప్రాంతాల్లో భోజన సదుపాయం, నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం, వసతి, గైడు, ప్రయాణాన్ని బట్టి రూ. 1 నుంచి 3 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17016)లో ప్రత్యేక బోగీలో సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 29వ తేదీ సికింద్రాబాద్‌లో బయల్దేరి నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్‌కు చేరుకుంటుంది. వచ్చే నెల 5వ తేదీన ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. శబరిమలై (నాలుగు రాత్రులు, అయిదు పగళ్లు) ఈ నెల 15వ తేదీ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో 15 స్లీపర్ క్లాస్, 6 థర్డ్ ఏసీ బెర్త్‌లను యాత్రికుల కోసం కేటాయించారు. ప్రతి శనివారం స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక కోచ్ శబరిమలై వెళుతుంది. 40 నుంచి 50 మంది ప్రత్యేక బోగీ కావాలని కోరుకుంటే ఏర్పాటు చేస్తారు. వీరికి కూడా వసతి, భోజన సదుపాయం, గైడు, ప్రమాదబీమా ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ. 4178, ఏసీ టికెట్ ధర రూ. 6698గా నిర్ణయించారు. -
‘రైల్వే టూరిజం’ కొత్త యాత్రలు
చంద్రశేఖర్‌కాలనీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ద్వారా ఈ సారి సరికొత్త తీర్థయాత్రల దర్శనీయ పుణ్యక్షేత్రాలతో కొత్త యాత్రలను ప్రారంభించిందని కార్పొరేషన్ మేనేజర్ కె. అమ్మారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూరిజగన్నాథ ఆలయం, భువనేశ్వర్, లింగరాజ రాజధాని, పిప్లి, రఘురాజ్వాల్ ఆలయాలకు, కొనార్క్ లోని సూర్య దేవాలయం, చంద్రబాగ బీచ్, చిల్యా లేక్ ఒరిస్సా గోల్డెన్ త్రైయాంగ్ల్ ఆరు రాత్రులు, ఏడు పగలు దినాలలో సాగే ఈ ప్రయాణంలో స్లీపర్ తరగతి రైలు ప్రయాణం, భోజన సదుపాయం,పర్యాటక ప్రదేశాలలో నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం,వసతి,గైడ్, ప్రయాణ బీచు సౌకర్యం కల్పించబడుతాయని వివరించారు. రైలు నంబర్ 17016 విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేక బోగిలో న వంబర్ 28 న సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ,గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మీదుగా భువనేశ్వర్‌కు చేరుతుందన్నారు. తిరిగి డిసెంబర్ 5 న సికింద్రాబాద్‌కు ఉదయం 7.30 గంటలకు చేరుకుంటామని, ఈ ప్రయాణం ఖర్చు ఒక్కొక్కరికి రూ. 9,675 ఉంటుందని ఆయన తెలిపారు. పూరి జగన్నాథ్ ధాం, గోవా బీచ్ రైలు ప్రయాణ యాత్రలకు 5 శాతం రాయితీ కూడా కల్పించి నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీ సీ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నా రు. 5 శాతం రాయితీ ఐఆర్సీటీసీ ఆఫీసులో బుక్ చేసుకొన్న వారికే వర్తిస్తుందన్నారు. ఇంకా వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఆర్‌సిటిసిటూరిజం.కామ్, 040 277702407, 9701360701 నుంచి చివరగా మూడు అంకెల గల 647, 653, 697,698, 707,729 సెల్‌ఫోన్ నంబర్లకు, లేదా నిజామాబాద్‌లోని 08462-225539, 94405 02075 సెల్‌నంబర్‌కు సంప్రదించవచ్చని ఆయన సూచించారు.