సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్. విమానంలో ఉన్న మాదిరి సౌకర్యాలు ఉండే ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలు కచ్చితత్వం విషయంలో ప్రయోగాత్మకంగా ఓ నిబంధన విధించారు. రైలు నిర్దేశించిన సమయానికి వెళ్లకపోతే ఎంత ఆలస్యమైతే అంత పరిహారం చెల్లిస్తామని భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించడంతో దానికి సంబంధించిన పరిహారం ప్రయాణికులకు అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఎప్పుడూ చార్జీల వసూళ్లు చేయడమే తప్పా పరిహారం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ శని, ఆదివారం (ఆగస్ట్ 21, 22)లో రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. ఆలస్యంగా ప్రయాణించడంతో రైలులో ప్రయాణించిన వారికి రూ.నాలుగున్నర లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం 2,035 మంది ప్రయాణికులకు పరిహారం అందించనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సిగ్నల్ ఫెయిల్ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రెండున్నర గంటలు ఆలస్యంగా రైలు చేరింది. ఆదివారం కూడా గంట ఆలస్యమైంది.
చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్..
దీంతో గంట ఆలస్యమైన వారికి రూ.100 చొప్పున, రెండున్నర గంటలు ఆలస్యమైన వారికి రూ.250 చెల్లించనుంది. మొత్తం రూ.4,49,600 పరిహారం ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అందించనుంది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనల మేరకు రైలు గంట ఆలస్యమైతే రూ.వంద చెల్లించాలనే నిబంధన ఉందని, ఆ మేరకు తాజాగా ఆలస్యమైన వారికి అంతే చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వివరించారు.
చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment