tejas express
-
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు, కారణం అదే!
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ రైళ్ల సేవలు కేవలం కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరు సంపాదించుకోవడంతో పాటు ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. అయితే కొన్ని రూట్లలో మాత్రం ఊహించినంత ఆదరణ వీటికి లభించనట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా తాజాగా ఓ రూట్లో వందేభారత్ రైలుని నిలిపివేసింది రైల్వే శాఖ. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్ వరకు ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆటంకం ఏర్పడింది. సరైన అక్యుపెన్సీ లేని కారణంగా ఈ రైలును ఇండియన్ రైల్వేస్ రద్దు చేసింది. రైల్వే శాఖ ఆశించినమేర ప్యాసింజర్లు వందే భారత్‌లో ప్రయాణించేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఈ రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు ప్రకటించింది. బిలాస్పూర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గత ఏడాది డిసెంబర్లో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాగ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్‌కు ప్రయాణ సమయాన్ని ఏడు-ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అధిక ధరల కారణంగా, ఆక్యుపెన్సీ సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ రైలుగా 2017లో ప్రారంభించారు. ఇది పూర్తిగా భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ద్వారా నిర్వహిస్తున్నారు. దీనిని తొలిసారిగా 2017లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఉంబై నుంచి గోవా మార్గంలో ప్రారంభించారు. -
ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్. విమానంలో ఉన్న మాదిరి సౌకర్యాలు ఉండే ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలు కచ్చితత్వం విషయంలో ప్రయోగాత్మకంగా ఓ నిబంధన విధించారు. రైలు నిర్దేశించిన సమయానికి వెళ్లకపోతే ఎంత ఆలస్యమైతే అంత పరిహారం చెల్లిస్తామని భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించడంతో దానికి సంబంధించిన పరిహారం ప్రయాణికులకు అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఎప్పుడూ చార్జీల వసూళ్లు చేయడమే తప్పా పరిహారం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ శని, ఆదివారం (ఆగస్ట్ 21, 22)లో రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. ఆలస్యంగా ప్రయాణించడంతో రైలులో ప్రయాణించిన వారికి రూ.నాలుగున్నర లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం 2,035 మంది ప్రయాణికులకు పరిహారం అందించనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సిగ్నల్ ఫెయిల్ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రెండున్నర గంటలు ఆలస్యంగా రైలు చేరింది. ఆదివారం కూడా గంట ఆలస్యమైంది. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. దీంతో గంట ఆలస్యమైన వారికి రూ.100 చొప్పున, రెండున్నర గంటలు ఆలస్యమైన వారికి రూ.250 చెల్లించనుంది. మొత్తం రూ.4,49,600 పరిహారం ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అందించనుంది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనల మేరకు రైలు గంట ఆలస్యమైతే రూ.వంద చెల్లించాలనే నిబంధన ఉందని, ఆ మేరకు తాజాగా ఆలస్యమైన వారికి అంతే చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
చుక్ చుక్ బండి.. దుమ్మురేపింది!
ఐఆర్సీటీసీ: 4 నెలలు... 5 రెట్లు ఐఆర్సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత ట్రేడింగ్‌లోనూ రికార్డ్ల మీద రికార్డ్‌లు సృష్టిస్తూ సాగిపోతోంది. ఈ రికార్డ్‌లకు, లాభాల పరుగుకు కారణాలు, షేరు భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు తదితర విశేషాలు సాక్షి బిజినెస్ పాఠకుల కోసం... ప్రస్తుతం ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) 4 విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం, రైల్వే కేటరింగ్ సర్వీసులు నిర్వహించడం, టూరిజం సర్వీసులు నిర్వహణ, రైల్ నీర్ బ్రాండ్ కింద ప్యాకేజ్డ్ వాటర్‌ను విక్రయించడం. టూరిజం సర్వీసులు కాకుండా మిగిలిన మూడు విభాగాల్లో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఇక రైల్వేయేతర కేటరింగ్ సర్వీసులు, ఈ–కేటరింగ్, బడ్జెట్ హోటళ్ల రంగంలోకి కూడా విస్తరిస్తోంది. ఈ బుధవారమే ఈ కంపెనీ క్యూ3 ఫలితాలను వెల్లడించింది. నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ.206 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ఇవ్వనుంది. దీనికి రికార్డ్ డేట్‌గా ఈ నెల 25ను నిర్ణయించింది. ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో ఐఆర్సీటీసీ షేర్ జోరుగా పెరిగింది. గురువారం ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,609ను తాకింది. చివరకు 11% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఐఆర్సీటీసీ షేర్ ధర 400 శాతం పెరగ్గా, ఈ కాలంలో సెన్సెక్స్ 9 శాతమే లాభపడింది. ఐపీఓ... అదిరిపోయే ఆరంభం... గత ఏడాది సెప్టెంబర్ 30, అక్టోబర్ 3ల మధ్య వచ్చిన ఐఆర్సీటీసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 112 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇప్పటివరకూ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం ఇదే మొదటిసారి. రూ.320 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేరు దాదాపు రెట్టింపు ధరకు రూ.626 వద్ద అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్ రోజునే రూ.744 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి రూ.729 వద్ద ముగిసింది. లిస్టింగ్‌లోనూ ఈ షేర్ రికార్డ్‌లే సృష్టించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో లిస్టింగ్ లాభాలు రావడం కూడా ఇదే మొదటిసారి. ఐపీఓలో షేర్లు దక్కని వాళ్లు జోరుగా ఈ షేర్లు కొన్నారు. ఆ ఒక్కరోజే రూ.3,500 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇటీవల కాలంలో మంచి లాభాలు గడించిన ఐపీఓ ఇదే. 23వ స్థానం...: అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఈ కంపెనీ 23వ స్థానంలో ఉంది. మార్కెట్ క్యాప్ రూ.25,279 కోట్లు. స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి టాప్50లో కూడా ఈ షేర్ లేదు. ఇప్పుడు ఆయిల్ ఇండియా, భెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీలను దాటేసింది. తేజస్‌తో మరింత దూకుడు.. ఈ కంపెనీ తొలి తేజస్ రైలును లక్నో– ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్ రైలును అహ్మదాబాద్ – ముంబై సెంట్రల్‌కు ప్రారంభించింది. ఆ రోజే ఈ షేర్ నాలుగంకెల ధరకు చేరింది. ఇక మూడో తేజస్ రైలును త్వరలోనే ఇండోర్– వారణాసి మధ్య నడిపించనుంది. తేజస్ రైళ్ల దూకుడుతో ఈ షేర్ ధర మరింత జోరుగా పెరగనుంది. షేరు ధర ఎందుకు పెరుగుతోందంటే.. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ వినూత్నంగా ఉండటం వల్ల షేర్ విలువ మదింపు చేయడం కొంచెం కష్టమేనన్నది నిపుణుల మాట. ఆన్లైన్ టికెట్ల విక్రయం, రైల్వే కేటరింగ్ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీదే. అసెట్– లైట్ బిజినెస్ మోడల్‌ను అనుసరిస్తున్న ఈ కంపెనీ ఫ్లోటింగ్ షేర్లు (ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య) చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర కూడా పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే కేటరింగ్ ఉత్పత్తుల ధరలను పెంచింది. మార్జిన్లు అధికంగా ఉండే తేజస్ రైళ్లను మూడు రూట్లలో నడుపుతోంది. మరిన్ని తేజస్ రైళ్లను తెచ్చే యోచనలో ఉంది. బిజినెస్ మోడల్ నిలకడగా ఉండటం, డివిడెండ్ చెల్లింపులు బాగుండటం (గత మూడేళ్లలో సగటున 50% డివిడెండ్ ఇచ్చింది), రూ.1,100 కోట్ల మేర పుష్కలంగా నగదు నిల్వలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఉత్తమ షేరుగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడేళ్లలో అమ్మకాలు 23%, లాభం 49% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. బహుపరాక్.. ఈ షేర్ ధర జోరుగా పెరుగుతోంది. అయితే డెలివరి అయ్యే షేర్ల నిష్పత్తి 11–13 శాతమే ఉంది. డే ట్రేడింగ్ బాగా జరుగుతోందనడానికి ఇది నిదర్శనమన్నది నిపుణుల మాట. మొమెంటమ్ గేమ్ ఆడాలనుకుంటే ఇన్వెస్టర్ల చేతులు కాలవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కంపెనీ వేల్యుయేషన్లు భారీగా పెరిగాయని, కంపెనీ షేరు ధర ఈపీఎస్‌కు 80 రెట్ల వద్ద ట్రేడవుతోందని, ఒకింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ కంపెనీలకు ఈ విలువ సమంజసమైనదే. అయితే ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి మాత్రం ఈ విలువ చాలా అధికమన్నది వారి విశ్లేషణ. అధిక వేల్యుయేషన్లు ఉండటంతోపాటు, భవిష్యత్తులో ఈ కంపెనీలో మరోవిడత వాటా విక్రయానికి కూడా అవకాశం ఉందని, ఈ రెండూ ప్రతికూలాంశాలని వారంటున్నారు. అయితే మరింత వాటా విక్రయానికి మరో ఏడాది సమయం ఉంది. -
తేజాస్ ప్రయాణీకులకు రూ 63,000 పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ : అహ్మదాబాద్-ముంబై తేజాస్ ఎక్స్‌ప్రెస్ బుధవారం మధ్యాహ్నం గంట ఆలస్యం కావడంతో ప్రయాణీకులకు రూ 63,000 పరిహారం చెల్లించనున్నట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది. దేశంలో రెండో ప్రైవేట్ ట్రైన్‌గా అహ్మదాబాద్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 19 నుంచి ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఈ రైలు గంటా 30 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్ధానానికి చేరుకుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. తమ రిఫండ్ పాలసీకి అనుగుణంగా రైలులో జాప్యం జరిగినందున ప్రయాణీకులు దరఖాస్తు చేసుకోవచ్చని, వెరిఫికేషన్ అనంతరం వారికి రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ ప్రతినిధి పేర్కొన్నారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్‌లో ఉదయం 6.42కు బయలుదేరి ముంబై సెంట్రల్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 2.36 గంటలకు గమ్యాస్ధానానికి చేరుకుంది. ముంబై శివార్లలోని భయందర్, దహిసర్ స్టేషన్ల మధ్య రైలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో జాప్యం నెలకొంది. సాంకేతిక సమస్యలు సర్దుబాటు అయిన తర్వాత రైలు ముంబైకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ పాలిసీ ప్రకారం రైలు గంట ఆలస్యమైతే రూ 100, రెండు గంటలు జాప్యం జరిగితే రూ 250 చెల్లిస్తారు. చదవండి : ట్రైన్ హోస్టెస్‌ల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.. -
ట్రైన్ హోస్టెస్‌ల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు..
విమానాలలో ఎయిర్ హోస్టెస్‌లు ఉంటారు. రైల్లో ఇప్పుడు ‘ట్రైన్ హోస్టెస్’లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విమాన ప్రయాణికులంత హుందాగా రైలు ప్రయాణికులు వారితో వ్యవహరించడం లేదు. ‘నీవు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. రైలు రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని పాత జోకు. భారతీయ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించడంలో సుదీర్ఘ ప్రయాణమే చేశాయి. ఎన్నో సమస్యలను దాటాయి. ఘన విజయాలూ సొంతం చేసుకున్నాయి. కన్ను తడవకుండా ఈ దేశంలో ఎవరైనాజీవితాన్ని దాటొచ్చేమోగాని రైలెక్కకుండా గమ్యాన్ని దాటలేడు. రైల్వే సేవలు తమ ప్రమాణాలు పెంచుకుంటూ వెళ్లినట్టే ప్రయాణికుడూ తన సంస్కారస్థాయినీ పెంచుకుంటూ పోతున్నాడు. అయితే అతడు నేర్చుకోవలసింది ఇంకా ఉందని ఇటీవలి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. దేశంలో ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ల పేరుతో రైల్వేశాఖ కార్పొరెట్ రైళ్లను ప్రారంభించింది. 2019 అక్టోబర్‌లో మొదటి కార్పొరెట్ రైలు లక్నో–న్యూఢిల్లీల మధ్య మొదలైంది. మొన్నటి (జనవరి 19, 2020) నుంచి రెండవ తేజస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ నుంచి ముంబైకు మొదలైంది. అయితే ఈ ఖరీదైన రైళ్లలో మహిళా యువశక్తికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రైల్వేశాఖ ‘ట్రైన్ హోస్టెస్’లను ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు ఆహార సదుపాయాలలో వీరు సహాయం చేస్తారు. అచ్చు ఎయిర్ హోస్టెస్‌లకు మల్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అహ్మదాబాద్–ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ మొదలైన సందర్భంగా అహ్మదాబాద్లోగుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో ట్రైన్ హోస్టెస్‌లు. అయితే కొందరు ప్రయాణికులకు మాత్రం ఇది కొత్తొక వింతగా ఉంది. వీళ్లు కలిగిస్తున్న ప్రధాన అసౌకర్యం ఈ హోస్టెస్లను ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం. వద్దని గట్టిగా వారించలేని పరిస్థితి కావడంతో ఇది వారికి ఇబ్బంది కలిగిస్తోంది. విమానాలలో అయితే ఎయిర్ హోస్టెస్‌ల అనుమతి లేకుండా వారిని ఫొటోలు తీయడానికి వీల్లేదు. ఇక్కడ మాత్రం అడక్కుండానే సెల్ఫీలు తీస్తున్నారు. వీరి పేరు అడుగుతున్నారు. నంబర్ అడిగేంతగా తెగిస్తున్నారు. ఇంకొందరు తమ సీట్ల దగ్గర ఉండే కాల్ బెల్‌ను ఊరికూరికే నొక్కి వెళ్లాక ‘పని చేస్తుందో లేదో చూద్దామని’ అని వెర్రినవ్వు నవ్వుతున్నారు. ఇంకా అన్యాయం ఏమిటంటే వీరి దుస్తుల గురించి తీర్పులు వెలువరించడం. ఎటువంటి దుస్తులు ధరించాలో చెప్పడం. ‘మీ ప్రయాణం మీరు చేయక మా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు?’ అని ఈ ట్రైన్ హోస్టెస్‌లు చికాకు పడుతున్నారు. అయితే రైల్వే శాఖ ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంది. ప్రయాణం ముగిశాక డ్యూటీ దిగిన ఎయిర్ హోస్టెస్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఇబ్బంది పెట్టిన ప్రయాణికుడిని గుర్తించడం కష్టం కాదు. ఎందుకంటే సీట్ నంబర్ ఉంటుంది. సిసి కెమెరాలు కూడా ఉంటాయి. అమ్మాయిలు భిన్నమైన ఇటువంటి ఉపాధులను ధైర్యంగా ఎంచుకుంటున్నారు. వీలైతే వారిని మెచ్చుకోవాలి. నొచ్చుకునేలా చేయరాదు. అప్పుడే వారి జర్నీ వారు చేస్తారు. మన జర్నీ మనం. -
పట్టాలెక్కనున్న మరో తేజాస్ ట్రైన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి ప్రైవేట్ రైలుగా లక్నో-ఢిల్లీ మధ్య నడిచే తేజాస్ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైన క్రమంలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆపరేటర్ అహ్మదాబాద్-ముంబై రూట్లో రెండో తేజాస్ ట్రైన్ పట్టాలెక్కనుంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకు బయలుదేరే ఈ రైలుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలు శుక్రవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు . రైలు వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఇక ఈ రైలు బుకింగ్స్‌ను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ ఐఆర్సీటీసీ రైలకనెక్ట్ ద్వారా ప్రయాణీకులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో తేజాస్ ట్రైన్‌కు ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు లేదు. ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అహ్మదాబాద్- ముంబై మధ్య ఈ రైలు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఇక గురువారం మెయింటెనెన్స్ కోసం ఉద్దేశించడంతో ఆ రోజు రైలు సేవలు అందుబాటులో ఉండవు. పూర్తి ఏసీ ట్రైన్‌గా అత్యాధునిక సౌకర్యాలతో తేజాస్ ముందుకొచ్చింది. ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్ధ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్‌కార్స్‌తో పాటు ఎనిమిది చైర్ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ నదియాద్, వడోదర, బరూచ్, సూరత్, వాపి, బొరివలి మీదుగా ముంబైకు చేరుకుంటుంది. -
తేజస్ ఎక్స్‌ప్రెస్: 20 మంది సిబ్బంది తొలగింపు
న్యూఢిల్లీ: తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సేవలందిసున్న ఒక ప్రైవేటు సంస్థకు చెందిన 20 మంది ఉద్యోగులను బుధవారం ఎటువంటి నోటీసులివ్వకుండానే విధుల నుంచి తొలగించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు వివిధ విభాగాల్లో క్యాబిన్ సిబ్బంది, అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తమను తొలగించడంతో సహయం కోరుతూ వారంతా గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ట్వీట్ చేశారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా 18 గంటలపాటు విధులు నిర్వర్తించే తమకు యాజమాన్యం కనీసం నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలుగా పేరున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ లక్నో- న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్వహిస్తోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సేవలందించే కొన్ని విభాగాల్లో అవసరానికి మించి సిబ్బంది ఉన్న కారణంగా.. కొంతమందిని తప్పించినట్లు ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. కాగా తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సేవలందిస్తున్న బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్ అనే ప్రైవేటు సంస్థ ఢిల్లీకి చెందింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలైన తేజస్ ఎక్స్‌ప్రెస్ గంటకు పైగా ఆలస్యం అయితే రూ. 100 పరిహారం, రెండు గంటలకు పైగా ఆలస్యం అయినట్లయితే రూ. 250 పరిహారంగా ఇస్తుంది. -
ప్రైవేట్ కాదు... ఔట్ సోర్సింగే
న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారీ స్థాయిలో రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రైళ్లను నడిపే బాధ్యతలు అప్పగిస్తామని వాటి భద్రతపై కేంద్రానిదే బాధ్యతని స్పష్టం చేశారు. లక్నో–ఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి రైల్వే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థ ఐఆర్సీటీసీ, దానికి అనుబంధంగా ఉన్న టూరిజం, కేటరింగ్ వంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు ప్రయోగాత్మకంగా అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను నడపడానికి పరిమిత కాలానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమైంది. 12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్లు ఖర్చు రైల్వే వ్యవస్థను సజావుగా నడపాలంటే వచ్చే 12 ఏళ్లలో రూ. 50 లక్షల కోట్లు అవసరం ఉంటుందని, అంత బడ్జెట్ కేటాయించడానికి పరిమితులుంటాయని గోయల్ అన్నారు. ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కేంద్రం లక్ష్యం. .కానీ రైల్వేల భద్రత అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు మంచివే.. రైలు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోందని వారందరికీ సదుపాయాలు కల్పించాలంటే కొత్త రైళ్లు నడపాలని, లైన్లు వేయా లని, ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి శక్తికి మించిన భారమని గోయల్ అన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులెవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే మంచిదేనన్నారు. -
తొలి ప్రైవేట్ రైలు పరుగులు
లక్నో: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం పట్టాలపై పరుగులు తీసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపి, రైలును ప్రారంభించారు. లక్నో–న్యూఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్వహిస్తోంది. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... ఇలాంటి రైళ్లు దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారి ప్రయాణిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. భారత్‌లో మొదటి కార్పొరేట్ రైలును పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిపేందుకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఆధునిక ప్రపంచంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మొబైల్ ఫోన్లు తొలుత రంగ ప్రవేశం చేసినప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటేవని, ఇప్పుడు నేలపైకి దిగివచ్చాయని, ప్రతి ఒక్కరూ కొనగలుగుతున్నారని, ఆరోగ్యకరమైన పోటీ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలంటే ఆరోగ్యకరమైన పోటీ అవసరమని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. భారత రైల్వేశాఖ చౌకైన, భద్రతతో కూడిన ప్రయాణ సౌలభ్యం కల్పిస్తోందని కొనియాడారు. ఆగ్రా–వారణాసి మధ్య సెమి–బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అంగీకరిస్తే భూసేకరణకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లక్నో–అలహాబాద్, లక్నో–గోరఖ్‌పూర్ మధ్య హైస్పీడ్ రైళ్లు నడపాలని కోరారు. ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత బీమా తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో లక్నో–న్యూఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6.40 గంటల్లో లక్నో నుంచి న్యూఢిల్లీకి చేరుకుంటోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు లక్నో నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 10.05 గంటలకు లక్నో చేరుకుంది. ఈ రైలుకు రెండు హాల్టులు (కాన్పూరు, ఘజియాబాద్) మాత్రమే ఉన్నాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి చెందిన తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇందులో ప్రయాణించేవారు రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కారుకు రూ.1,280, ఎగ్జిక్యూటివ్ చైర్ కారుకు రూ.2,450 చెల్లించాలి. ఈ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేట్ రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ రైల్లే విభాగాలకు సూచించింది. -
ఆ రైలు లేటైతే ప్రయాణికులకు పండుగే
న్యూఢిల్లీ: మీరు బుక్ చేసుకున్న రైలు పలుమార్లు ఆలస్యంగా వచ్చిందా! ఆలస్యంగా వస్తే మనకు పరిహారం చెల్లిస్తే ఎంత బాగుణ్ణు అని మీకెప్పుడైనా అనిపించిందా! ఇలాంటి మీ ఆలోచన ఫలించినట్టుంది. ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు లేటుగా వస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది. ఈ రైలు అక్టోబర్ 4 నుంచి ఢిల్లీ – లక్నోల మధ్య పరుగులు పెట్టనుంది. ఈ తరహా ప్రయోగానికి తెరతీస్తున్న తొలి రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్సే కావడం గమనార్హం. లాభాలివి.. అనుకోని పరిస్థితుల వల్ల ఈ రైలు గంట లేటుగా వస్తే రూ. 100, రెండు గంటలు లేటుగా వస్తే రూ. 250లు ప్రయాణికులకు చెల్లించనుంది. దీనితో పాటు ప్రయాణికులకు రూ. 25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వనుంది. సరిపడా పత్రాలు చూపిస్తే రెండు మూడు రోజుల్లోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయనుంది. రైల్లో ప్రయాణిస్తున్నపుడు ఒకవేళ దోపిడీ జరిగితే రూ. లక్ష ఇవ్వనున్నట్లు రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ప్రకటించింది. రైల్లో ఉచిత టీ, కాఫీలు వెండింగ్ మెషీన్ ద్వారా ఇవ్వనుండగా, ఆర్వో మెషీన్ ద్వారా మినరల్ వాటర్ కూడా అందించనున్నారు. ఈ రైల్లో లక్నో నుంచి ఢిల్లీకి చార్జీలు ఏసీ చైర్ కార్కు రూ. 1,125, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కు రూ. 2,310గా ఉంది. ఢిల్లీ నుంచి లక్నోకు ఏసీ చైర్ కార్ రూ. 1280 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో రూ. 2,450గా ఉండనుంది. ఈ రైలు చార్జీలు డిమాండ్‌కు అనుగుణంగా (డైనమిక్ ఫేర్) పెరుగుతాయి. విమానాల్లోలాగే, రైల్లో కూడా ప్రయాణికులకు ఆహారాన్ని అందించనున్నారు. ఈ తరహా విధానాలు ఇప్పటికే పలు దేశాల్లో అమలవుతున్నాయి. జపాన్‌లో, పారిస్ నగరంలో రైలు లేటయితే ప్రయాణికులకు ఓ సరి్టఫికెట్ అందుతుంది. దీన్ని పాఠశాలలు, కళాశాలు, ఆఫీసుల్లో చూపించి ఆలస్యానికి సహేతుక కారణాన్ని చూపవచ్చు. -
ఇక రైలు లేటయితే ప్రయాణీకులకు పరిహారం..
సాక్షి, న్యూఢిల్లీ : భారత రైల్వేల చరిత్రలో తొలిసారిగా రైలు సకాలంలో రానిపక్షంలో ప్రయాణీకులకు పరిహారం చెల్లించే పద్ధతి అందుబాటులోకి రానుంది. తమ రైలు నిర్ధేశిత సమయానికి రావడంలో జాప్యం జరిగితే తేజాస్ ఎక్స్‌ప్రెస్ పరిహారం చెల్లించనుంది. రైలు గంటకుపైగా లేటయితే ప్రతి ప్రయాణీకుడికి రూ 100 పరిహారం, రెండు గంటలకు పైగా రైలు రాకలో జాప్యం చోటుచేసుకుంటే ప్రతి ప్రయాణీకుడికి రూ 250 చెల్లిస్తారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా నడిచే ఈ రైలును ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. అక్టోబర్ 14 నుంచి ఢిల్లీ-లక్నో, లక్నో-ఢిల్లీ రూట్లలో నడిచే ఈ రైలును లక్నో నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక రైలు సమయంలో జాప్యం జరిగితే పరిహారం చెల్లించడంతో పాటు అదనపు చార్జీలు వసూలు చేయకుండా తేజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ రూ 25 లక్షల ప్రయాణ బీమాను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ ద్వారా నడిచే ఈ రైలును తర్వాతి నెలల్లో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్‌కు అప్పగించనున్నారు. -
తేజస్ రైలులో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ–లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ప్రయాణించే వారికి పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ రైలుకు సంబంధించిన పలు వివరాలను గురువారం విడుదల చేసింది. ► ప్రయాణీకుల లగేజీ తరలింపునకు ‘పిక్ అండ్ డ్రాప్’ సర్వీసును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రయాణీకుల లగేజీని వారి ఇంటి నుంచి రైలు సీటు వరకు, రైలు దగ్గర నుంచి వారి ఇంటి వరకు తరలించే వెసులుబాటు కల్పించనుంది. ► తేజస్‌లో రాయితీలు, తత్కాల్ కోటా వర్తించవు. ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులకు పూర్తి చార్జీలు వర్తిస్తాయి. ► ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏసీ చైర్ కార్లలో విదేశీ పర్యాటకుల కోసం ఐదు సీట్లను కేటాయించనుంది. ► ప్రయాణానికి 60 రోజుల ముందే బుకింగ్స్ ఉంటాయి. ► విమానాల్లో మాదిరిగా భోజనాన్ని ట్రాలీలలో అందిస్తారు. టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఆర్వో మెషీన్ల ద్వారా నీటిని అందిస్తారు. ► ప్రయాణికుల రద్దీ, పండుగల సీజన్, డిమాండ్ వంటి వాటి ఆధారంగా టికెట్ ధరలు మారుతూ ఉంటాయని తెలిపింది. డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని పేర్కొంది. ► ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ సర్వీస్ ఆధారంగా టికెట్ బుకింగ్ ఉంది. -
తేజస్ రైళ్లను నడపనున్న ఐఆర్సీటీసీ
న్యూఢిల్లీ: భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా మొదటి అడుగు పడింది. ఢిల్లీ–లక్నో, ముంబై–అహ్మదాబాద్‌ల మధ్య తిరిగే తేజస్ రైళ్లను ఇకపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్వహిస్తుందని రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ తెలిపారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చేందుకు, గమ్యస్థానం నుంచి ఇంటికెళ్లేందుకు, లగేజీ తరలింపునకు ఐఆర్సీటీసీ ట్యాక్సీలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈ రైళ్లలో వినోదంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజస్ రైళ్లకు లోకోమోటివ్‌లు, భద్రతా సిబ్బందిని భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందనీ, మిగతా సేవలన్నీ ఐఆర్సీటీసీ అందిస్తుందని చెప్పారు. భారతీయ రైల్వేలను నడిపేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపాయని యాదవ్ చెప్పారు. ఏదోఒక దశలో రైల్వే రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే ఐఆర్సీటీసీకి ప్రయోగాత్మకంగా రెండు తేజస్ రైళ్లను అప్పగించామన్నారు. -
పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల విధ్వంసం
ముంబై : తేజాస్ ఎక్స్‌ప్రెస్ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. ఆకతాయిలైన ప్రయాణికులు, సీట్లకు ముందున్న ఎల్సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయగా.. మరికొందరు హెడ్ఫోన్లను ఎత్తుకెళ్లారు. వ్యాక్యూమ్ టాయిలెట్‌ను కంపు కంపు చేశారు. ఈ సంఘటన ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే ముంబై-నాసిక్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే రకమైన విధ్వంసకర వాతావరణం చోటు చేసుకుంది. ఈ రైలు సర్వీసును అప్‌గ్రేడ్ చేసిన నాలుగు నెలల్లోనే, ట్రే టేబుల్స్‌ను, కర్టెన్లను చెల్లాచెదురు చేశారు. అంతేకాక కిటికీలను పగులగొట్టారు. హెల్త్‌కు చెందిన రెగ్యులేటర్లను, కుళాయిలను, లగేజ్ ర్యాక్‌ల గ్లాస్‌లను ప్రయాణికులు బ్రేక్ చేశారు. చెత్తాడబ్బాలను, అద్దాలను ఎత్తుకుపోయారు. రైళ్లలో తరుచూ జరుగుతున్న ఈ సంఘటనలతో, సెంట్రల్ రైల్వే ఇప్పటికీ రిఫైర్ బిల్లుగా రూ.9 లక్షల మేర ఖర్చు చేసింది. ప్రయాణికులు వారికి అందిస్తున్న సౌకర్యాలను సరిగ్గా వినియోగించుకోవడం లేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఫిబ్రవరి 7న రైల్వే మంత్రిత్వశాఖ అన్ని జోనల్ రైల్వేస్‌కు ఒక లేఖ రాసింది. ఈ విషయాన్ని రైల్వే బోర్డు విచారణ జరుపుతుందని తెలిపింది. గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో, తేజాస్ ఎక్స్‌ప్రెస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సెమీ-లగ్జీర ట్రైన్ అయిన దీన్ని గోవా నుంచి ప్రారంభించారు. గోవా నుంచి ఇది ముంబైకు ఒక ట్రిప్ వేసింది. ఇక అంతే తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఈ రైలు విండోలను పగలగొట్టారు. హెడ్ఫోన్లను దొంగలించారు. ఈ సంఘటనలతో రైళ్లలో అందిస్తున్న సౌకర్యవంతమైన సర్వీసులను తీసివేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే రోజూ ట్రాక్‌లపై చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని, అలాగని ముంబై సబ్అర్బన్ సర్వీసులను రైల్వే ఆపివేస్తుందా అని రైల్ యాత్రి పరిషద్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా ప్రశ్నించారు. అలాగే పగిలిపోయిన ఎల్సీడీ స్క్రీన్లను మొత్తంగా తీసివేయడం కంటే, వాటిని బాగు చేయడం మంచిదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ సౌకర్యాలను తీసివేస్తే, టిక్కెట్ ఛార్జీలను కూడా తగ్గించాలని ప్రయాణికుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
ఆ రైళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లకు టాటా!
రైల్వే ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి తేజస్, శతాబ్ది రైళ్లలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లతో రైల్వేశాఖకు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ రైళ్లలో ప్రతి ప్రయాణికుడి సీటు ముందు ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లను ప్రయాణీకులు ధ్వంసం చేయడం, కొంతమంది వాటి హెడ్సెట్లను తీసుకెళ్తున్నారనీ, ఇంకొంతమందైతే ఆ ఎల్సీడీ స్క్రీన్లనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ రైల్వే వ్యవస్థ వాపోతోంది. పగిలిన స్ర్కీన్లను మళ్లీ అమర్చాలన్నా, కొత్తవాటిని తీసుకురావాలన్నా వాటికి ఖర్చు ఎక్కువ అవుతోందని అసలు ఎల్సీడీ స్ర్కీన్‌లనే రైల్లోంచి తీసేయాలని రైల్వే యంత్రాంగం ఆలోచిస్తుంది. బొంబాయి నుంచి గోవాకు వెళ్లే ఈ రైళ్లను నడపాలంటే రైల్వేవ్యవస్థ వ్యయప్రయాసలకు గురవుతోందట. -
ఈ రైల్లోనే టీవీలు, వై-ఫై, కాఫీ మిషన్!
-
ఈ రైల్లోనే టీవీలు, వై-ఫై, కాఫీ మిషన్!
రైల్లో ముంబై నుంచి గోవా వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.. అంతసేపు రైల్లో కూర్చోవాలంటే బోర్ అనుకునేవాళ్ల కోసం సరికొత్త తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చేశాయి. వీటిలో ఎల్ఈడీ టీవీలు, వై-ఫై కనెక్షన్, సీసీటీవీ, కాఫీ మిషన్లు.. ఇలా బోలెడన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉన్న ఈ కొత్త తేజస్ రైళ్లను రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ప్రతి సీటుకు ముందు భాగంలో సమాచారాన్ని అందించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. వాటిలో ఏవైనా సినిమాల లాంటివి చూడాలన్నా చూడొచ్చు. దానికితోడు రైలు చాలా సురక్షితంగా ఉంటుంది. ఇందులో పొగను గుర్తించే అలారం, టీ/కాఫీ వెండింగ్ మిషన్ల లాంటి ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయని కంఏద్ర రైల్వే జనరల్ మేనేజర్ డీకే శర్మ చెప్పారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి బయల్దేరిన ఈ రైలును.. నేలమీద నడిచే విమానంతో ఆయన పోల్చారు. శతాబ్ది రైళ్లంటేనే సాధారణంగా అన్నిరకాల సదుపాయాలు ఉండి, అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లాయని అంటారు. వాటి టికెట్ ధరలు కూడా మామూలు సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే ఎక్కువ. ఇప్పుడీ తేజస్ రైళ్ల టికెట్లు శతాబ్ది టికెట్ల కంటే కూడా 20 శాతం ఎక్కువగా ఉంటాయి. ముందుగా వీటిని కొంకణ్ ప్రాంతంలో నడిపిస్తున్నారు. వారంలో ఐదు రోజుల పాటు ముంబై నుంచి కర్మలి (గోవా)కు ఈ రైలు వెళ్తుంది. అదే వర్షాకాలంలో అయితే వారానికి మూడు రోజులే వెళ్తుంది. దారిలో దాదర్, థానె, పన్వేల్, రత్నగిరి, కుడల్ స్టేషన్లలో ఆగుతుంది. సీఎస్టీ స్టేషన్లో ఉదయం 5 గంటలకు బయల్దేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా గోవా చేరుకుంటుంది. అలాగే గోవాలో తిరిగి 2.30 గంటలకు బయల్దేరి, రాత్రి 9 గంటలకు ముంబై సీఎస్టీ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇందులో 56 సీట్ల సామర్థ్యంతో ఉండే ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ బోగీ ఒకటి, దాంతోపాటు 78 సీట్ల సామర్థ్యం ఉండే ఏసీ ఛైర్‌కార్ బోగీలు 12 ఉంటాయి. అంటే రైలు మొత్తం ఏసీ ఛైర్‌కార్ మాత్రమే అన్నమాట. ఇందులో ఆహారంతో కలిపి అయితే ఒకరేటు, కాకుండా అయితే మరో రేటు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్‌కార్ అయితే ఆహారంతో కలిపి రూ. 2680, ఆహారం కాకుండా రూ. 2525 చొప్పున టికెట్ ధరలున్నాయి. ఏసీ ఛైర్‌కార్ టికెట్లు రూ. 1280, 1155 చొప్పున ఉన్నాయి.