సాక్షి, న్యూఢిల్లీ : భారత రైల్వేల చరిత్రలో తొలిసారిగా రైలు సకాలంలో రానిపక్షంలో ప్రయాణీకులకు పరిహారం చెల్లించే పద్ధతి అందుబాటులోకి రానుంది. తమ రైలు నిర్ధేశిత సమయానికి రావడంలో జాప్యం జరిగితే తేజాస్ ఎక్స్‌ప్రెస్ పరిహారం చెల్లించనుంది. రైలు గంటకుపైగా లేటయితే ప్రతి ప్రయాణీకుడికి రూ 100 పరిహారం, రెండు గంటలకు పైగా రైలు రాకలో జాప్యం చోటుచేసుకుంటే ప్రతి ప్రయాణీకుడికి రూ 250 చెల్లిస్తారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా నడిచే ఈ రైలును ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. అక్టోబర్ 14 నుంచి ఢిల్లీ-లక్నో, లక్నో-ఢిల్లీ రూట్లలో నడిచే ఈ రైలును లక్నో నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక రైలు సమయంలో జాప్యం జరిగితే పరిహారం చెల్లించడంతో పాటు అదనపు చార్జీలు వసూలు చేయకుండా తేజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ రూ 25 లక్షల ప్రయాణ బీమాను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ద్వారా నడిచే ఈ రైలును తర్వాతి నెలల్లో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్‌కు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment