చుక్‌ చుక్‌ బండి.. దుమ్మురేపింది! | IRCTC shares slump ahead of Q3 earnings | Sakshi
Sakshi News home page

చుక్‌ చుక్‌ బండి.. దుమ్మురేపింది!

Published Fri, Feb 14 2020 4:37 AM | Last Updated on Fri, Feb 14 2020 5:04 AM

IRCTC shares slump ahead of Q3 earnings - Sakshi

ఐఆర్‌సీటీసీ: 4 నెలలు... 5 రెట్లు
ఐఆర్‌సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌లో స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్‌... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత ట్రేడింగ్‌లోనూ రికార్డ్‌ల మీద రికార్డ్‌లు  సృష్టిస్తూ సాగిపోతోంది. ఈ రికార్డ్‌లకు, లాభాల పరుగుకు కారణాలు, షేరు భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు తదితర విశేషాలు సాక్షి బిజినెస్‌ పాఠకుల కోసం...

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) 4 విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం, రైల్వే కేటరింగ్‌ సర్వీసులు నిర్వహించడం, టూరిజం సర్వీసులు నిర్వహణ, రైల్‌ నీర్‌ బ్రాండ్‌ కింద ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ను విక్రయించడం. టూరిజం సర్వీసులు కాకుండా మిగిలిన మూడు విభాగాల్లో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఇక రైల్వేయేతర కేటరింగ్‌ సర్వీసులు, ఈ–కేటరింగ్, బడ్జెట్‌ హోటళ్ల రంగంలోకి కూడా విస్తరిస్తోంది.

ఈ బుధవారమే ఈ కంపెనీ క్యూ3 ఫలితాలను వెల్లడించింది. నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ.206 కోట్లకు చేరగా,  మొత్తం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ఇవ్వనుంది. దీనికి రికార్డ్‌ డేట్‌గా ఈ నెల 25ను నిర్ణయించింది. ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో ఐఆర్‌సీటీసీ షేర్‌ జోరుగా పెరిగింది. గురువారం ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,609ను తాకింది. చివరకు 11% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఐఆర్‌సీటీసీ షేర్‌ ధర 400 శాతం పెరగ్గా, ఈ కాలంలో సెన్సెక్స్‌ 9 శాతమే లాభపడింది.  

ఐపీఓ... అదిరిపోయే ఆరంభం...
గత ఏడాది సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3ల మధ్య వచ్చిన ఐఆర్‌సీటీసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఇప్పటివరకూ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం ఇదే మొదటిసారి. రూ.320 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేరు దాదాపు రెట్టింపు ధరకు రూ.626 వద్ద అక్టోబర్‌ 14న స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్‌ రోజునే రూ.744 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి రూ.729 వద్ద ముగిసింది. లిస్టింగ్‌లోనూ ఈ షేర్‌ రికార్డ్‌లే సృష్టించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో లిస్టింగ్‌ లాభాలు రావడం కూడా ఇదే మొదటిసారి. ఐపీఓలో షేర్లు దక్కని వాళ్లు జోరుగా ఈ షేర్లు కొన్నారు. ఆ ఒక్కరోజే రూ.3,500 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇటీవల కాలంలో మంచి లాభాలు గడించిన ఐపీఓ ఇదే.

23వ స్థానం...: అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఈ కంపెనీ 23వ స్థానంలో ఉంది. మార్కెట్‌ క్యాప్‌ రూ.25,279 కోట్లు. స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి టాప్‌50లో కూడా ఈ షేర్‌ లేదు. ఇప్పుడు ఆయిల్‌ ఇండియా, భెల్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీలను దాటేసింది.

తేజస్‌తో మరింత దూకుడు..  
ఈ కంపెనీ తొలి తేజస్‌ రైలును లక్నో– ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్‌ రైలును అహ్మదాబాద్‌ – ముంబై సెంట్రల్‌కు ప్రారంభించింది. ఆ రోజే ఈ షేర్‌ నాలుగంకెల ధరకు చేరింది. ఇక మూడో తేజస్‌ రైలును త్వరలోనే ఇండోర్‌– వారణాసి మధ్య నడిపించనుంది. తేజస్‌ రైళ్ల దూకుడుతో ఈ షేర్‌ ధర మరింత జోరుగా పెరగనుంది.

షేరు ధర ఎందుకు పెరుగుతోందంటే..
ఈ కంపెనీ బిజినెస్‌ మోడల్‌ వినూత్నంగా ఉండటం వల్ల షేర్‌ విలువ మదింపు చేయడం  కొంచెం కష్టమేనన్నది నిపుణుల మాట. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, రైల్వే కేటరింగ్‌ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీదే. అసెట్‌– లైట్‌ బిజినెస్‌ మోడల్‌ను అనుసరిస్తున్న ఈ కంపెనీ ఫ్లోటింగ్‌ షేర్లు (ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య) చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. ధర కూడా పెరిగిపోతూనే ఉంది.

ఇటీవలే కేటరింగ్‌ ఉత్పత్తుల ధరలను పెంచింది. మార్జిన్లు అధికంగా ఉండే తేజస్‌ రైళ్లను మూడు రూట్లలో నడుపుతోంది. మరిన్ని తేజస్‌ రైళ్లను తెచ్చే యోచనలో ఉంది. బిజినెస్‌ మోడల్‌ నిలకడగా ఉండటం, డివిడెండ్‌ చెల్లింపులు బాగుండటం (గత మూడేళ్లలో సగటున 50% డివిడెండ్‌ ఇచ్చింది), రూ.1,100 కోట్ల మేర పుష్కలంగా నగదు నిల్వలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఉత్తమ షేరుగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడేళ్లలో అమ్మకాలు 23%,  లాభం 49% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా.
 
బహుపరాక్‌..

 ఈ షేర్‌ ధర జోరుగా పెరుగుతోంది. అయితే డెలివరి అయ్యే షేర్ల నిష్పత్తి 11–13 శాతమే ఉంది. డే ట్రేడింగ్‌ బాగా జరుగుతోందనడానికి ఇది నిదర్శనమన్నది నిపుణుల మాట. మొమెంటమ్‌ గేమ్‌ ఆడాలనుకుంటే ఇన్వెస్టర్ల చేతులు కాలవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కంపెనీ వేల్యుయేషన్లు భారీగా పెరిగాయని, కంపెనీ షేరు ధర ఈపీఎస్‌కు 80 రెట్ల వద్ద ట్రేడవుతోందని, ఒకింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్‌ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్‌ కంపెనీలకు ఈ విలువ సమంజసమైనదే. అయితే ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి మాత్రం ఈ విలువ చాలా అధికమన్నది వారి విశ్లేషణ. అధిక వేల్యుయేషన్లు ఉండటంతోపాటు, భవిష్యత్తులో ఈ కంపెనీలో మరోవిడత వాటా విక్రయానికి కూడా అవకాశం ఉందని,  ఈ రెండూ ప్రతికూలాంశాలని వారంటున్నారు. అయితే మరింత వాటా విక్రయానికి మరో ఏడాది సమయం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement