లక్నోలో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ లోపలి భాగం
లక్నో: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం పట్టాలపై పరుగులు తీసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపి, రైలును ప్రారంభించారు. లక్నో–న్యూఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... ఇలాంటి రైళ్లు దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారి ప్రయాణిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. భారత్‌లో మొదటి కార్పొరేట్ రైలును పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిపేందుకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఆధునిక ప్రపంచంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మొబైల్ ఫోన్లు తొలుత రంగ ప్రవేశం చేసినప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటేవని, ఇప్పుడు నేలపైకి దిగివచ్చాయని, ప్రతి ఒక్కరూ కొనగలుగుతున్నారని, ఆరోగ్యకరమైన పోటీ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలంటే ఆరోగ్యకరమైన పోటీ అవసరమని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. భారత రైల్వేశాఖ చౌకైన, భద్రతతో కూడిన ప్రయాణ సౌలభ్యం కల్పిస్తోందని కొనియాడారు. ఆగ్రా–వారణాసి మధ్య సెమి–బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అంగీకరిస్తే భూసేకరణకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లక్నో–అలహాబాద్, లక్నో–గోరఖ్‌పూర్ మధ్య హైస్పీడ్ రైళ్లు నడపాలని కోరారు.
ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత బీమా
తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో లక్నో–న్యూఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6.40 గంటల్లో లక్నో నుంచి న్యూఢిల్లీకి చేరుకుంటోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు లక్నో నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 10.05 గంటలకు లక్నో చేరుకుంది. ఈ రైలుకు రెండు హాల్టులు (కాన్పూరు, ఘజియాబాద్) మాత్రమే ఉన్నాయి.
మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి చెందిన తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇందులో ప్రయాణించేవారు రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కారుకు రూ.1,280, ఎగ్జిక్యూటివ్ చైర్ కారుకు రూ.2,450 చెల్లించాలి. ఈ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేట్ రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ రైల్లే విభాగాలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment