న్యూఢిల్లీ: భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా మొదటి అడుగు పడింది. ఢిల్లీ–లక్నో, ముంబై–అహ్మదాబాద్‌ల మధ్య తిరిగే తేజస్ రైళ్లను ఇకపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తుందని రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ తెలిపారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చేందుకు, గమ్యస్థానం నుంచి ఇంటికెళ్లేందుకు, లగేజీ తరలింపునకు ఐఆర్‌సీటీసీ ట్యాక్సీలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈ రైళ్లలో వినోదంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తేజస్ రైళ్లకు లోకోమోటివ్‌లు, భద్రతా సిబ్బందిని భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందనీ, మిగతా సేవలన్నీ ఐఆర్‌సీటీసీ అందిస్తుందని చెప్పారు. భారతీయ రైల్వేలను నడిపేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపాయని యాదవ్ చెప్పారు. ఏదోఒక దశలో రైల్వే రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే ఐఆర్‌సీటీసీకి ప్రయోగాత్మకంగా రెండు తేజస్ రైళ్లను అప్పగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment