
ఈ రైల్లోనే టీవీలు, వై-ఫై, కాఫీ మిషన్!
రైల్లో ముంబై నుంచి గోవా వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.. అంతసేపు రైల్లో కూర్చోవాలంటే బోర్ అనుకునేవాళ్ల కోసం సరికొత్త తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చేశాయి. వీటిలో ఎల్‌ఈడీ టీవీలు, వై-ఫై కనెక్షన్, సీసీటీవీ, కాఫీ మిషన్లు.. ఇలా బోలెడన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉన్న ఈ కొత్త తేజస్ రైళ్లను రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ప్రతి సీటుకు ముందు భాగంలో సమాచారాన్ని అందించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉంటాయి. వాటిలో ఏవైనా సినిమాల లాంటివి చూడాలన్నా చూడొచ్చు. దానికితోడు రైలు చాలా సురక్షితంగా ఉంటుంది. ఇందులో పొగను గుర్తించే అలారం, టీ/కాఫీ వెండింగ్ మిషన్ల లాంటి ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయని కంఏద్ర రైల్వే జనరల్ మేనేజర్ డీకే శర్మ చెప్పారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ) నుంచి బయల్దేరిన ఈ రైలును.. నేలమీద నడిచే విమానంతో ఆయన పోల్చారు.
శతాబ్ది రైళ్లంటేనే సాధారణంగా అన్నిరకాల సదుపాయాలు ఉండి, అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లాయని అంటారు. వాటి టికెట్ ధరలు కూడా మామూలు సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే ఎక్కువ. ఇప్పుడీ తేజస్ రైళ్ల టికెట్లు శతాబ్ది టికెట్ల కంటే కూడా 20 శాతం ఎక్కువగా ఉంటాయి. ముందుగా వీటిని కొంకణ్ ప్రాంతంలో నడిపిస్తున్నారు.
వారంలో ఐదు రోజుల పాటు ముంబై నుంచి కర్మలి (గోవా)కు ఈ రైలు వెళ్తుంది. అదే వర్షాకాలంలో అయితే వారానికి మూడు రోజులే వెళ్తుంది. దారిలో దాదర్, థానె, పన్వేల్, రత్నగిరి, కుడల్ స్టేషన్లలో ఆగుతుంది. సీఎస్‌టీ స్టేషన్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా గోవా చేరుకుంటుంది. అలాగే గోవాలో తిరిగి 2.30 గంటలకు బయల్దేరి, రాత్రి 9 గంటలకు ముంబై సీఎస్‌టీ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇందులో 56 సీట్ల సామర్థ్యంతో ఉండే ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ బోగీ ఒకటి, దాంతోపాటు 78 సీట్ల సామర్థ్యం ఉండే ఏసీ ఛైర్‌కార్ బోగీలు 12 ఉంటాయి. అంటే రైలు మొత్తం ఏసీ ఛైర్‌కార్ మాత్రమే అన్నమాట. ఇందులో ఆహారంతో కలిపి అయితే ఒకరేటు, కాకుండా అయితే మరో రేటు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్‌కార్ అయితే ఆహారంతో కలిపి రూ. 2680, ఆహారం కాకుండా రూ. 2525 చొప్పున టికెట్ ధరలున్నాయి. ఏసీ ఛైర్‌కార్ టికెట్లు రూ. 1280, 1155 చొప్పున ఉన్నాయి.