Tourist Department
-
డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్
రాకాసి అలలు.. ఎన్నో కుటుంబాల్లో మరణ శాసనం రాసి సముద్రమంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని చేరేలోపే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు విశాఖ వాసులు సరికొత్త డ్రోన్‌ను ఆవిష్కరించారు. సైఫ్‌సీస్ పేరుతో రూపొందించిన ఈ పరికరం మృత్యు అలలను ఎదిరించి మునిగిపోతున్న వారి ప్రాణాలు కాపాడగలదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను పర్యాటక శాఖ నిర్వహించింది. సాక్షి, విశాఖపట్నం: సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎవరికైనా ఈత కొట్టాలనిపిస్తుంటుంది. కానీ రాకాసి అలలు మింగేస్తాయని భయం అందరిలోనూ ఆందోళన రేకెత్తించినా.. అక్కడి పరిస్థితులు వాటిని లెక్కచెయ్యనీయవు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పుష్కర కాలంలో సుమారు 600 మంది అలలకు బలయ్యారు. ఇందులో 60 శాతం మంది 15 నుంచి 30 ఏళ్లలోపువారే ఉండటం బాధాకరమైన విషయం. నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్‌గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్‌గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్‌సీస్ పేరుతో డ్రోన్‌ను తయారు చేసింది. దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే విశాఖ తీరం రూపురేఖలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు. గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు. కానీ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆర్కే బీచ్‌కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు మరింతగా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్‌నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్రంలో ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్‌సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి. సైఫ్ సీస్.. ఇలా రక్షిస్తుంది.. సాధారణంగా లైఫ్‌గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్లగలరు. 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్గార్డుకు పడుతుంది. కానీ.. గజఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్లు దూసుకెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు. అంటే లైఫ్గార్డు కంటే 7 రెట్లు వేగంగా స్పందిస్తుంది. లైఫ్గార్డు ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే రక్షించగలరు. కానీ.. సైఫ్‌సీస్ 200 కిలోల బరువు వరకూ ఎంత మంది ఉంటే అందర్ని ఒడ్డుకు తీసుకురాగలదు. గంటకు 15 కిలో మీటర్ల వేగంతో అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. పూర్తిగా రిమోట్ ద్వారా ఒడ్డున నిలబడే ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి వద్దకు ఈ డ్రోన్లను క్షణాల్లో పంపించవచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. 22 కేజీల బరువుండే ఈ డ్రోన్‌ను పట్టుకుంటే మళ్లీ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.6 లక్షల వరకూ ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం వరకూ దీనిని కంట్రోల్డ్‌గా ఆపరేట్ చెయ్యవచ్చు. భారత ప్రభుత్వ ప్రశంసలు విశాఖ బృందం చేసిన ఈ సైఫ్‌సీస్ డ్రోన్‌కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పోలో సైఫ్సీస్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ దీని పనితీరుని తెలుసుకొని బృంద సభ్యులను అభినందించారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పర్యాటక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ.. కొద్ది నెలల క్రితం సైఫ్‌సీస్ డ్రోన్ ట్రయల్ రన్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రోత్సహిస్తే.. ప్రాణాలు కాపాడతాం.. మూడేళ్ల పాటు శ్రమించి సైఫ్‌సీస్ డ్రోన్‌ని ఇండియన్ నేవీ స్పెసిఫికేషన్స్‌తో తయారు చేశాం. సైఫ్సీస్ని డీఆర్డీవో–ఎన్ఎస్టీఎల్ అప్రూవ్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. లైఫ్‌గార్డుల కంటే వేగంగా చేరుకోవడం వల్ల సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడగలం. 100 శాతం ఆటోమేటిక్‌గా రోబోటిక్ ప్రోబ్స్తో దీన్ని తయారు చేశాం. పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుతోంది. ఏపీలో ప్రోత్సహిస్తే వైజాగ్ బీచ్‌లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలమన్న విశ్వాసం మాకు ఉంది. – అలీఅస్గర్ కలకత్తావాలా, సైఫ్‌సీస్ కో–ఫౌండర్ (చదవండి: సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి') -
ట్రావెల్ ఫ్రం హోం!
సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం అంటే తెలుసు కానీ ఈ ట్రావెల్ ఫ్రం హోం ఏమిటి అనుకుంటున్నారా? విదేశాల్లోని ప్రముఖ పర్యాటక, ప్రసిద్ధ కేంద్రాలకు మనం స్వయంగా వెళ్లకుండానే అక్కడకు వెళ్లినట్లుగా, వ్యక్తిగతంగా అన్నింటినీ సొంతంగా వీక్షిస్తున్నట్లుగా అనుభూతి పొందేలా చేసేవే ‘వర్చువల్ ట్రావెల్’, ‘ట్రావెల్ ఫ్రం హోం’. ఇది ఇప్పటికే ‘నెట్టింట’అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం దీనికి ఇప్పటిదాకా అంత ప్రాచుర్యం లభించలేదు. అయితే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కమ్మేసిన నేపథ్యంలో వర్చువల్ ట్రావెల్‌పై దేశంలోని పర్యాటక ప్రేమికులు సైతం అధిక ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సమేతంగా చేపట్టే విదేశీ టూర్లకు అయ్యే ఖర్చు, శ్రమతో పోలిస్తే ‘ట్రావెల్ ఫ్రం హోం’ఖర్చు చాలా తక్కువే కావడంతో వాటిపట్ల మక్కువ ప్రదర్శిస్తున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు వర్చువల్ టూర్లు ఆఫర్ చేసే సంస్థలు కొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నాయి. 360 డిగ్రీల కోణంలో... విదేశీ పర్యాటకం అధికంగా సాగే వేసవిలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేయడం, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశాలన్నీ సరిహద్దులను మూసేసి లాక్డౌన్ ప్రకటించడంతో జనజీవనం స్తంభించింది. ఫలితంగా విదేశాల్లోనే కాకుండా దేశీయంగానూ పర్యాటక, రవాణా, ఆతిథ్య తదితర అనుబంధ రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఈ తరుణంలో దేశ, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ముఖ్య కట్టడాలను ఇల్లు కదలకుండానే వీక్షించేందుకు లోకల్ ఎక్స్పర్ట్ భాగస్వాములతో కలిసి ఎక్స్పీడియా అనే అంతర్జాతీయ ట్రావెల్స్ సంస్థ వర్చువల్ టూర్లను ఆఫర్ చేస్తోంది. ట్రావెల్ ఫ్రం హోం సిరీస్‌లో భాగంగా వర్చువల్ ట్రావెల్‌తోపాటు సాంస్కృతిక, విద్య, వినోద అనుబంధ రంగాల్లోని విశేషాలను, వాటికి సంబంధించిన టూర్లను ఇళ్లలో తీరికగా కూర్చొని ఆయా ప్రదేశాల్లో పర్యటించిన అనుభూతి పొందేలా ప్రణాళికకు రూపకల్పన చేసింది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ (వీఆర్), వెబ్‌కామ్‌లు, కంప్యూటర్ల ద్వారా 360 డిగ్రీల కోణంలో లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా ఆయా పర్యాటక కేంద్రాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తోంది. మరికొన్ని సంస్థలు సైతం ఇదే తరహా టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. టూర్ గైడ్లతో లైవ్ వీడియో టూర్... కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను చూడాలని పర్యాటక ప్రేమికులు కోరుకోవడం, దాని కోసం పెద్దమొత్తం ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ టూర్లకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక, సాంస్కృతిక, ఇతర కేంద్రాల్లోని టూర్ గైడ్లతో లైవ్, ఇంటరాక్టివ్ వీడియో సెషన్ల ద్వారా ‘రిమోట్ ట్రావెల్స్’నిర్వహిస్తున్నారు. ఆత్మీయులతోనో, స్నేహితులతోనో కలసి కొత్త ప్రదేశాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించేలా మనకు నచ్చిన, చూడాలని కోరుకున్న పర్యాటక కేంద్రాలు, వాటి గురించిన ఆసక్తికర వివరాలను టూర్ గైడ్లు వివరించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాలను చూడాలని అనుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ‘ప్రివ్యూ’లను కూడా గైడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియాలను డిజిటల్ టూర్ల మాదిరిగా చూసే అవకాశం లభిస్తోంది. గూగుల్ స్ట్రీట్ ద్వారా ఆధునిక, సమకాలీన చిత్రకళ ప్రదర్శనలను వీక్షించే వీలు కల్పిస్తున్నారు. అయితే బ్రిటిష్ మ్యూజియం పర్యటనకు విషయానికొస్తే మాత్రం ఇది గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో లేకపోవడంతో బ్రిటిష్ మ్యూజియం వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వస్తోంది. -
పర్యాటకం వద్దు.. ఈవెంట్లే ముద్దు
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడని ఈవెంట్ల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. సోషల్ మీడియా సమ్మిట్... ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్... ఎయిర్ షో వంటి వాటికి రూ.కోట్లు వెచ్చించింది. రానున్న రెండు, మూడు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో నిర్వహించే ఈవెంట్ల గురించి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పర్యాటక శాఖ ఇప్పటికే ఒక నివేదిక రూపొందించినట్లు సమాచారం. ఈవెంట్ల ప్రచారం కోసం ఎన్ని రూ.కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో నిర్వహించే ఈవెంట్లను తిలకించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు పెద్దగా వచ్చే అవకాశం లేకపోయినా అక్కడ ప్రచారానికి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం ఏమిటని సాక్షాత్తూ పర్యాటక శాఖ అధికారులే ప్రశ్నిస్తున్నారు. విదేశీ పర్యాటకులు నిల్ రాష్ట్రంలో ఇటీవల సోషల్ మీడియా సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహించింది. ఇందుకోసం బాలీవుడ్ సినిమా తారలను కూడా రప్పించారు. ఈ సమ్మిట్‌కు కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక కృష్ణా నదిలో ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్‌ను వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు హాజరవుతున్నారని ప్రభుత్వం భావించింది. వారికి వసతులు కల్పించే పేరిట విజయవాడ, గుంటూరు లాడ్జిల్లోని గదులను పర్యాటక శాఖ బుక్ చేసింది. ఈ బోట్ రేసింగ్‌కు కనీసం దేశవిదేశాల నుంచి 500 మంది కూడా హాజరు కాలేదు. లాడ్జీల్లో గదులన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ రూ.20 లక్షల అద్దె చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల కృష్ణా నది వేదికగా ఐదు రోజులపాటు నిర్వహించిన ఎయిర్‌షో గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి భారీగా ఖర్చు చేశారు. ఈ ఎయిర్‌షోకు పెద్దగా ప్రజాస్పందన లభించలేదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఈవెంట్లపై టీవీలు, హోర్డింగ్‌ల ద్వారా ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తుండడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కెనాల్ సిటీ, బీచ్ సిటీ ఎక్కడ బాబూ! వైఎస్సార్ జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో గండికోటలో తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని 2015 నవంబర్ 15న సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది. నాగార్జున సాగర్‌ను బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు హామీ మాటలకే పరిమితమైంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో 100 చెరువులను అభివృద్ధి చేసి, లేక్‌సిటీగా మారుస్తామని చంద్రబాబు గతంలో ఘనంగా ప్రకటించారు. విజయవాడను కెనాల్ సిటీగా, విశాఖను బీచ్ సిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారు. కానీ, ఆ సిటీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎకో టూరిజం, బుద్ధిస్ట్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిక్రియేషన్ అండ్ టూరిజం అడ్వెంచర్ బేస్డ్ టూరిజం, మెడికల్ టూరిజం ఏర్పాటు కోసం పలు కంపెనీలు ముందుకొచ్చి అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నా పనులు మాత్రం అడుగు కూడా ముందుకు పడడం లేదు. -
గీజర్ లేకుండానే గరమ్ గరమ్
చలికాలంలో.. వెచ్చటి నీళ్లు - బోరు నుంచి ఉబికి వస్తున్న వేడి నీళ్లు - జయశంకర్ జిల్లాలో ప్రకృతి అద్భుతం సాక్షి, భూపాలపల్లి: గోదావరి ఒడ్డున ఉన్న రామన్నగూడెంవాసులు గట్టకట్టే చలిలో సైతం తేలిగ్గా స్నానం చేయగలరు. ఈ ఊరిలో నిరంతరం పొగలు కక్కె వేడినీరు అందించే వేడినీటి ఊటబావి ఉండటమే అందుకు కారణం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ వేడి నీటి ఊట నిరాదరణకు లోనవుతోంది. పర్యాటక శాఖ పట్టించకోకపో వడంతో 25 ఏళ్లుగా మరుగునపడింది. పాతికేళ్లుగా..: చమురు నిక్షేపాల కోసం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) పాతికేళ్ల క్రితం 1990లో ఏటూరు నాగారం మండలంలో పలు చోట్ల బోర్లు వేసింది. చమురు నిక్షేపాల జాడ లేకపోవడం తో తదనంతర కాలంలో ఓఏన్‌జీసీ తన ప్రయత్నాలు విరమించుకుంది. కానీ, ఓఎన్జీసీ వేసిన బోరు బావుల్లో రామన్నగూ డెం దగ్గర వేసిన బోరు నుంచి వేడి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఇలా పాతికేళ్లుగా నిర్విరామంగా వేడి నీళ్లు వస్తూనే ఉన్నాయి. రాపిడి వల్లే..: భూగర్భంలో రాతి సమూహా లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి ఉంటాయని భూగర్భ నిపుణులు అంటున్నా రు. ఎలాంటి మానవ ప్రయత్నం లేకుండా నిరంతరం భూమిలో నుంచి నీరు బయటకు రావడాన్ని సాంకేతిక భాషలో ఆర్టిసియన్ వెల్ (నీట బుంగ) అంటారు. నీరు అధిక పీడనం ఉన్న ప్రాంతం నుంచి అల్పపీడనం వైపునకు ప్రవహిస్తుంది. భూగర్భంలో పీడనం ఎక్కువైన చోట నీరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుం ది. అనువైన చోట నీరు బయటకు వస్తుంది లేదా ఈæ ప్రాంతాల్లో బోర్లు వేస్తే వీటి ద్వారా ప్రవాహం పైకి వస్తుంది. ఇక్కడ నీరు పైకి రావడంతో పాటు వేడిగా ఉండటం మరో విశేషం. భూగర్భంలో జల ప్రవాహం ఎక్కువ దూరం రాళ్ల మధ్య ప్రవహించడం వల్ల తాకిడికి నీరు వేడిగా ఉండటానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని పనులు అక్కడే..: బోరు నుంచి వస్తు న్న నీరు... భూమి, చెట్ల వేర్లను ఆనుకొని ప్రవహించడం వల్ల ఎలాంటి దుర్వాసనా ఉండదు. ఎలాంటి రంగు, రుచి లేకుండా స్వచ్ఛంగా ఈ నీరు ఉంటోంది. రామన్నగూడెంలోని వంద కుటుంబాల నీటి అవసరాలు తీరుతున్నాయి. స్థానిక ప్రజలు ఈ నీటిలో దుస్తులు ఉతుక్కోవడం, స్నానాలు చేయడం, సాగు అవసరాలకు వినియోగిం చడం చేస్తున్నారు. ముఖ్యంగా చలి కాలంలో ఇక్కడి వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్నానానికి వేడి నీరు లభ్యమవుతోంది. పట్టించుకోని పర్యాటకశాఖ రామప్ప, కోటగుళ్లు వంటి చారిత్రక కట్టడాలు, లక్నవరం, బొగత జలపాతం ప్రకృతి అందాలు, డోల్మన్ సమాధులు వంటి పురాతన నాగరికత అవశేషాలకు నెలవైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న వేడి నీటి ఊటను పర్యాటకశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బొగత జలపాతానికి వెళ్లే పర్యాటకుల్లో 90 శాతం మంది ఏటూరునాగారం మీదుగా వెళ్తారు. ఇక్కడి నుంచి కేవలం 5 కి.మీ. దూరంలో రామన్నగూడెం పుష్కరఘాట్‌కు వెళ్లే దారి లో ఉన్న వేడి నీటి ఊటకు ప్రాచుర్యం కల్పించేందుకు పర్యాటక శాఖ తరఫున చర్యలు కరువయ్యాయి. స్వదేశీ దర్శన్ టూరిజంలో భాగంగా వేడినీటి ఊటకు ప్రాచుర్యం కల్పించాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆకాశ వీధి నుంచి హైదరాబాద్ అందాలు
♦ నేటి నుంచి నగరంలో హెలికాప్టర్ రైడ్స్.. ♦ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్ : అంతెత్తున ఠీవిగా నిలిచిన చార్మినార్.. గొప్ప కోటల్లో ఒకటిగా ఖ్యాతి పొందిన గోల్కొండ.. మానవ నిర్మిత పెద్ద జలాశయాల జాబితాలో మనకూ చోటు కల్పించిన హుస్సేన్‌సాగర్.. పాలరాతి అద్భుతం బిర్లా మందిర్.. చారిత్రక ఖ్యాతితోపాటు ఆధునిక హంగులద్దుకున్న భాగ్యనగరం.. ఇందులో ఏదీ మనకు కొత్తకాదు.. కానీ గగనతలం నుంచి వీటిని వీక్షిస్తే.. రోజూ చూసే నగరం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడా అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పిస్తోంది. హెలి టూరిజం జాయ్ రైడ్స్ ప్రాజెక్టును ఇటీవల మేడారం జాతర సందర్భంగా ప్రారంభించిన ప్రభుత్వం.. అందులో భాగంగా హైదరాబాద్ ఏరియల్ ట్రిప్‌ను మంగళవారం నుంచి ప్రారంభిస్తోంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సేవలు మొదలుకానున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం 10 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవే ట్ లిమిటెడ్‌తో కలసి పర్యాటక శాఖ ‘హెలి టూరిజం ఇన్ హైదరాబాద్’ను నిర్వహిస్తోంది. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఉండే జాయ్ రైడ్‌కు రూ.3500గా టికెట్ ధర నిర్ణయించారు. దీనికి స్పందన లభిస్తే ట్రిప్పు నిడివి పెంచుతూ నగర సమీపంలోని ఇతర ప్రాంతాల వరకు విస్తరించాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్, వరంగల్, కరీంనగర్, నల్లమల అడవి, కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాలు తదితరాలతో దీన్ని అనుసంధానించాలని భావిస్తున్నారు. -
ఓరుగల్లు, కరీంనగర్‌లకు సీ ప్లేన్‌లో
♦ భాగ్యనగరం నుంచి పర్యాటక విమానాలు ♦ పెద్ద చెరువులుంటే చాలు.. ఎయిర్‌పోర్టులు అవసరంలేదు ♦ రెండు సంస్థలతో ప్రభుత్వం చర్చలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు విమానంలో వెళ్లాలనుందా.. కొద్ది రోజుల్లో ఆ అవకాశం అందుబాటులోకి రావచ్చు.. ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. అదేంటి.. అసలు వరంగల్ విమానాశ్రయం శిథిలావస్థలో ఉంటే విమానం ఎలా వెళ్తుందని ఆశ్చర్యపోతున్నారా... ఈ విమానానికి ఎయిర్‌పోర్టు అవసరం లేదు.. ఎంచక్కా అక్కడి భద్రకాళి చెరువులోనో, వడ్డేపల్లి చెరువులోనో దిగుతుంది. హైదరాబాద్లోనేమో హుస్సేన్‌సాగర్ నుంచి రివ్వున ఎగిరిపోతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీన్ని కార్యరూపంలోకి తెచ్చే ప్రయత్నాలైతే సాగుతున్నాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘సీ ప్లేన్’లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. తేలికపాటి విమానాలు నీళ్లలో దిగే ఏర్పాటుతోపాటు నేలపైనా దిగేందుకు అనువైనవి. సీప్లేన్లను రంగంలోకి దించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవచ్చని ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. గతంలో విదేశీ పర్యటన సమయంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనిపై దృష్టి సారించారు. అక్కడి తరహాలో హైదరాబాద్‌లో సీ ప్లేన్‌ను అందుబాటులో ఉంచితే గగనతలం ద్వారా హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుం దని, ఇది పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఆయన ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో కసరత్తు మొదలైంది. కేవలం పర్యాటకులను తిప్పటానికి మాత్రమే వాటిని పరిమితం చేయకుండా హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు కూడా వాటిని నడిపితే ఎలా ఉంటుందనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టులు అవసరం లేనందున ఆ నగరాల్లోని నీటి వనరులను టేకాఫ్, ల్యాండింగ్‌కు వాడొచ్చు. వరంగల్‌లో భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు టేకాఫ్, ల్యాండింగ్‌కు సరిపోతాయో లేదో పరిశీలించనున్నారు. ఇక కరీంనగర్‌కు ఆనుకునే ఉన్న లోయర్ మానేర్‌డ్యాం బాగా ఉపయోగపడనుంది. 15 నిమిషాల ప్రయాణానికి రూ.4 వేల వరకు, అరగంట ప్రయాణానికి 9 వేల వరకు చార్జి చేసే అవకాశం ఉంది. ఒక్కో విమానంలో పదిమంది ప్రయాణించే వెసులుబాటుంటుంది. హెలికాప్టర్లు నడిపేందుకు... ఇక హెలికాప్టర్లు నడిపేందుకు మరో రెండు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటికోసం హెలీప్యాడ్లు తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది. అందుకుగాను ఆ సంస్థకు రుసుము చెల్లించే విషయంలో చర్చలు సాగుతున్నాయి. సరిపడా స్థలాన్ని కేటాయిస్తే తామే నిర్వహించేందుకు సిద్ధమని పర్యాటక శాఖ స్పష్టం చేసింది. ఇది కూడా మరో వారంపదిరోజుల్లో కొలిక్కి రానుంది. వెరసి ఫిబ్రవరిలో ఇటు హెలికాప్టర్ అటు సీ ప్లేన్లు అందుబాటులోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. పర్యాటకప్రాంతాలను గగనతలం నుంచి వీక్షించే అనుభవం లేని నగర పర్యాటకులు వాటి రాకకోసం ఎదురుచూస్తున్నారు. మరికొద్దిరోజుల్లో స్పష్టత హైదరాబాద్ కేంద్రంగా సీప్లేన్ నిర్వహణకు రెండు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. వాటితో ధరల విషయంలో చర్చలు సాగుతున్నాయి. టికెట్లను ప్రభుత్వమే విక్రయించుకుని తమకు నెలవారీ నిర్ధారిత మొత్తాన్ని చెల్లించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. వాటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుని టికెట్లను ఆయా సంస్థలే విక్రయించుకోవాలని పేర్కొంటోంది. దీనిపై మరో వారంపది రోజుల్లో స్పష్టత రానుంది.